మళ్లీ మళ్లీ చూడాలనిపించే ‘చూడాలని ఉంది’

‘రామాయణం’ లాంటి మైథలాజికల్‌ చిత్రం తీసిన గుణ శేఖర్‌ తర్వాత చిరంజీవితో తీస్తున్నాడనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అప్పటికి ఆయన తెరకెక్కించింది మూడు సినిమాలు. అయినా మూడూ ప్రశంసలతోపాటు అవార్డులను అందుకున్నాయి. దీంతో చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమానే ‘చూడాలని ఉంది’. ఆ అవకాశాన్ని గుణ శేఖర్‌ ఎలా సద్వినియోగం చేసుకున్నాడో తెలిసిందే. చిరును రామకృష్ణగా సరికొత్త లుక్‌లో చూపించాడు. అప్పటి వరకు మాస్‌ చిత్రాల్లో మెరిసిన చిరంజీవి క్లాస్‌గా మారి వావ్‌ అనిపించాడు. అంజలా జావేరీ(ప్రియ), సౌందర్య(పద్మావతి) చిరంజీవి సరసన కనిపించి కనువిందు చేశారు. పద్మావతి, రామకృష్ణ మధ్య కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ కడుపుబ్బా నవ్విస్తాయి. మహేంద్రగా ప్రకాశ్‌ రాజ్‌ అభినయం సినిమాకు హైలెట్‌. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత అంటే సంగీతమే అని చెప్పితీరాల్సిన సత్యం. మణిశర్మ బాణీలు నేడు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న బీట్‌ సాంగ్స్‌ను సైతం బీట్‌ఔట్‌ చేస్తాయి. ఇందులో ఆరు పాటలు ఒకటి మించి మరొకటి పోటీపడతాయి. ప్రత్యేకంగా ‘యమహో నగరి’, ‘రామ్మా చిలకమ్మా’.. ఇప్పటికీ సంగీత ప్రియుల నోటిలో నానుతూనే ఉంటాయి. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్విన్‌ దత్‌ నిర్మించిన ఈ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1998 ఆగస్టు 27న విడుదలైన ‘చూడాలని ఉంది’ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూనే ఉంటుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.