తెర నుంచి బరిలోకి... సీనీనటుల ప్రస్థానం

సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం పరిపాటే. దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు. వారి బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నేటి నటీనటులు ఎన్నికల బరిలో దిగుతున్నారు. సినీ రాజకీయ రంగాల్లో నటీ నటుల పూర్వాపరాలను ఒకసారి సింహావలోకనం చేద్దాం...1967లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన నటుడు కొంగర జగ్గయ్య. ఆ తరువాత ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రయ్యారు. ఆ తరువాత ఎన్నికల్లో నటి శారద, జయప్రదలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శారద..తెనాలి నుంచి లోక్‌సభకు ఎన్నికైతే... జయప్రధ రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసింది. ఆ తర్వాత సమాజ్‌ వాదీ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కూడా 1996లో మచిలీపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సత్యనారాయణ సమకాలీకుడు రావు గోపాలరావు, తెలుగుదేశం తరుపున ఎమ్మెల్సీ అయ్యారు.


రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. తెలుగుదేశం నుంచి మోహన్‌ బాబు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. విజయశాంతి కూడా బీజేపీ, తల్లి తెలంగాణ, టీఆర్‌ఎస్‌ పార్టీలో సేవలు అందించారు. టీఆర్‌ఎస్‌ తరుపున మెదక్‌ లోక్‌ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. కథానాయకుడు కృష్ణ అప్పట్లో కాంగ్రెస్‌ తరుపున తెనాలి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కృష్ణ సతీమణి విజయ నిర్మలతో పాటు వారి కుమారుడు నరేష్‌ కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సహ నటుడు కృష్ణంరాజు నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. కేంద్ర కేబినెట్‌లో పనిచేసిన ప్రధమ సినీనటుడిగా పేరు సాధించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకొచ్చారు. ఇప్పుడు ఆయన తమ్ముడు నటుడు పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ స్ధాపించారు. ప్రస్తుత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాలనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. బాలకృష్ణ కూడా రెండో సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన సోదరుడు దివంగత హరికృష్ణ ఇక్కడనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. అటు క్యారెక్టర్‌ నటుడు కోట శ్రీనివాసరావు బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తోటి నటుడు బాబు మోహన్‌ కూడా ఎమ్మెల్యేగా సేవలందించారు. నటి రోజా కూడా వైసీపీ తరుపున నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక తమిళనాడు విషయానికొస్తే..ఎంజీఆర్‌ డీఎంకే పార్టీలో ఉండి అన్నాడీఎంకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరణించిన తరువాత జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించారు ఎంజీఆర్‌ సమకాలీనుడు శివాజీ గణేషన్‌ కూడా డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళ మున్నేట్ర మున్నయ్‌ అనే పార్టీని స్థాపించారు. విజయ్‌ కాంత్‌ కూడా డీఎండీకే పార్టీని స్థాపించారు. కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రజనీకాంత్‌ కూడా రాజకీయాల్లో వస్తున్నా అని ప్రకటించారు కానీ రాలేదు. శరత్‌ కుమార్, కార్తీక్, ఖుష్బు తదితర నటీనటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉత్తరాది నుంచి దేవానంద్, అమితాబ్‌ బచ్చన్, రాజేష్‌ ఖన్నా, సునీల్‌ దత్, వినోద్‌ ఖన్నా, శతృఘ్న సిన్హా, గోవిందా, జయ బచ్చన్, రేఖ, హేమా మాలిని, స్మృతి ఇరానీ, నగ్మా వంటి నటీ నటులు రాజకీయాల్లో పోటీపడ్డారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.