కరోనా దెబ్బ కొట్టింది!

ప్రపంచం మొత్తాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బ సినిమా రంగంపై బలంగా పడింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న థియేటర్ల మూత నిర్ణయంతో సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 650 థియేటర్లు ఆదివారం ఉదయం ఆట నుంచే మూతపడనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లోనైనా కొత్త సినిమాలు విడుదలవుతాయా? నిర్మాతలు ఒక రాష్ట్రంలోనే విడుదల చేసుకోవడానికి మొగ్గు చూపుతారా అనే విషయంపై స్పష్టత రావల్సి ఉంది. ఈ పరిణామంతో త్వరలోనే మొదలు కాబోతున్న కీలకమైన వేసవి సీజన్‌ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సినిమా రంగంలో కరోనా కలవరం ఎప్పుడో మొదలైంది. పలు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. కొంతమంది ఒక చోట చిత్రీకరణ చేయాలనుకున్న సినిమాల్ని, మరో చోట పూర్తి చేశారు. ముంబయిలాంటి నగరాల్లో సినీ అవార్డుల వేడుకలు కూడా జనం లేకుండానే జరిగిపోయాయి. ఇక వైరస్‌ భయంతో థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. సినిమా థియేటర్ల దగ్గర ఎప్పటిలా సందడి కనిపించి చాలా రోజులే అయ్యింది. అయినా సరే... వారం వారం సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ వచ్చాయి. బాగున్న సినిమాలు అడపాదడపా వసూళ్లు చేసుకున్నాయి. పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా కొందరు నిర్మాతలు తమ చిత్రాల్ని విడుదల చేయాలనుకున్నారు. ప్రచార కార్యక్రమాల్ని కూడా వేగవంతం చేశారు. ఇంతలోనే... ఇన్నాళ్లుగా నెలకొన్న భయాలే నిజమవుతూ, థియేటర్ల మూత నిర్ణయం వెలువడింది. దాంతో రంగుల తెర చిన్నబోయింది. తెలంగాణలో ఈ నెల 31 వరకే థియేటర్లు బంద్‌ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... ఈ ప్రభావం తెలుగు సినిమా రంగంపై ఏడాది మొత్తం కనిపించనుంది. నిర్మాతల దగ్గర్నుంచి, థియేటర్లలో పనిచేసే కార్మికుల వరకు అందరికీ నష్టకాలమే ఇది.

సినిమా ఉగాది లేదు

తెలుగు చిత్ర పరిశ్రమలో వేసవి సీజన్‌ మొదలయ్యేది ఉగాది సినిమాల నుంచే. పండగకి అగ్ర హీరోల చిత్రాలొస్తుంటాయి. అక్కడి నుంచి వేసవి సందడి మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో వేసవి సీజన్‌ కొనసాగుతుంది. విద్యార్థులకి సెలవులుండడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకి వెళ్లేందుకు అనువుగా భావించడంతో... ఈ సీజన్‌లో సినిమాలు మంచి వసూళ్లని సొంతం చేసుకుంటుంటాయి. దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా ఈ సీజన్‌నే లక్ష్యంగా చేసుకుని సినిమాల్ని విడుదల చేయడానికి మొగ్గు చూపుతుంటారంటే కారణం అదే. ఈ ఉగాదికి నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ప్రదీప్‌ మాచినేని కథానాయకుడిగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమింà[టం ఎలా?’ సినిమాల్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే థియేటర్ల బంద్‌ నిర్ణయానికి ముందే ‘వి’ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. నాని సినిమాలకి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వి’ సినిమాని వాయిదా వేయడమే మేలని చిత్రబృందం నిర్ణయించింది. పరిమిత వ్యయంతో తెరకెక్కి, ఓవర్సీస్‌లో అంతగా మార్కెట్‌ లేని కథా నాయకుల చిత్రాలు మాత్రమే ఉగాదికి విడుదలయ్యే పరిస్థితులు కనిపించాయి. కానీ థియేటర్ల బంద్‌తో ఆ సినిమాలు కూడా ల్యాబ్‌లకే పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆంధ్రప్రదేశ్‌లోనైనా విడుదల చేసుకుందాం అని ముందుకొచ్చే నిర్మాతలు ఎంతమందనేది చూడాలి.

వీటిపైనే ప్రభావం

సైకిల్‌ స్టాండ్‌ని తలపించేలా ఉంటుంది సినిమాల విడుదల వ్యవహారం. ఒక సైకిల్‌ ఒరిగితే అన్నీ పడిపోయినట్టు... ఒక అగ్ర కథానాయకుడి సినిమా వాయిదా పడిందంటే ఆ ప్రభావం మిగతా అన్ని సినిమాలపై పడుతుంది. ఏడాదంతా వాయిదాల పర్వం కొనసాగాల్సిందే. ప్రస్తుతానికి ఉగాది సినిమాలపైనే కరోనా దెబ్బ పడినట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ నెలలో కరోనా ప్రభావం తగ్గి, థియేటర్లు మళ్లీ తెరిచినా వచ్చే నెలలో అనుకున్న సమయానికే విడుదలయ్యే సినిమాలెన్ని అనేదే ప్రశ్న. ఏప్రిల్‌ 2న ‘ఉప్పెన’, ‘నిశ్శబ్దం’, ‘అరణ్య’ విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. ఏప్రిల్‌ 9న ‘రెడ్‌’, ఏప్రిల్‌ 17న ‘మిస్‌ ఇండియా’, ఏప్రిల్‌ 24న ‘శ్రీకారం’, మే 1న ‘సోలో బ్రతుకే సో బెటర్‌’... ఇలా వేసవి సినిమాలు పక్కాగా విడుదల తేదీల్ని ప్లాన్‌ చేసుకున్నాయి. వెంకటేష్‌ ‘నారప్ప’, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాలు కూడా ఈ వేసవిలోనే విడుదల కాబోతున్నాయి. మరి వీటిలో కరోనా ప్రభావం నుంచి తప్పించుకునేవి ఎన్ననేది చూడాలి. అగ్ర కథానాయకుల చిత్రాలతో పోలిస్తే, పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలకి ఈ పరిణామం తీవ్ర నష్టం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం థియేటర్ల బంద్‌ నిర్ణయం తీసుకోకపోతే చాలామంది నిర్మాతలు సినిమాల్ని విడుదల చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక దాన్ని అనుసరించాల్సిందే. దీనివల్ల చిన్న సినిమాలు బాగా ఇబ్బంది పడతాయి. ఇది సీజన్‌ కాదు కాబట్టి ఈ సమయంలో ఎలాగూ పెద్ద సినిమాలు విడుదల కావు. కొన్ని వారాలుగా పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలే విడుదలవుతూ వచ్చాయి. వచ్చే రెండు వారాల్లో కూడా 10 సినిమాల వరకు చిన్న చిత్రాలే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్లిపోవల్సిన పరిస్థితి. ఏప్రిల్‌లో పెద్ద సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. మేం ముందు అనుకున్న సమయానికి మా సినిమాల్ని విడుదల చేసుకుంటాం అని పెద్ద సినిమాల నిర్మాతలు అనే అవకాశాలున్నాయి. అందుకే మేం చలన వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశంలో ఆగిపోయిన చిన్న చిత్రాల్ని ఏప్రిల్‌లో విడుదల చేసుకునే అవకాశాల గురించి చర్చిస్తాం. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే థియేటర్లని మూసివేసినా, ఏపీలో కూడా ఆ నిర్ణయం తీసుకుంటే కష్టం కాబట్టి కొత్త సినిమాల్ని అక్కడ కూడా విడుదల చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు’’ అన్నారు. ఈ బంద్‌తో అందరికీ నష్టమే అని ఆయన తెలిపారు. ‘‘థియేటర్లని లీజు తీసుకున్నవాళ్లు.. ఇది ప్రభుత్వ నిర్ణయం కదా అని చెప్పి లీజు చెల్లించరు. వాళ్లకి లాభం. కానీ థియేటర్ల యాజమాన్యాలు నష్టపోతాయి. చిన్న నిర్మాతలు కూడా ఎక్కడెక్కడో డబ్బు తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు. వాళ్లకి కరోనా మరింత నష్టం చేకూర్చినట్టైంది’’ అన్నారు టి.ప్రసన్న కుమార్‌.


వీక్షకులు లేని పురస్కార వేడుక

కరోనా సెగ చిత్ర పరిశ్రమకు తగలడం మొదలైంది. థియేటర్లు మూతపడటం, షూటింగ్‌లు రద్దు, విడుదల వాయిదా... ఇవే కాదు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలపైనా ఈ ప్రభావం పడుతోంది. ఇటీవల ముంబయిలో జీ సినీ పురస్కారాల వేడుక జరిగింది. కానీ దీనికి వీక్షకులను అనుమతించలేదు. వీక్షకులు లేకుండా ఓ పురస్కార వేడుక జరగడం ఇదే తొలిసారి. ‘‘కరోనా కారణంగా సమూహాలుగా జనం ఉండటం మంచి కాదు కాబట్టి ప్రేక్షకులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని నిర్వాహకులు చెబుతున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.