గురువుకు తగ్గట్టే తయారయ్యాడు

ఒక్క సినిమా చాలు... జీవితం తలకిందులు కావడానికి! ఆటుపోట్లకి పెట్టింది పేరు సినిమా పరిశ్రమ. అలాంటి చోట నిలదొక్కుకోవడమే గగనం. ఇక శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కానే కాదు. అది కూడా అడుగడుగునా సాహసోపేతమైన ప్రయత్నాలు చేస్తూ!! ఏటికి ఎదురీదినట్టుగా... అడుగడుగునా విభిన్నమైన చిత్రాలు చేస్తూ, దర్శకుడిగా తాను అనుకొన్న లక్ష్యాలన్నీ సాధించారు కోడి రామకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా... గురువు దాసరి నారాయణరావుకి తగ్గ శిష్యుడు అనిపించుకొన్నారు. గురువు 150కిపైగా సినిమాలు చేస్తే... ఆయనకి శిష్యుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కోడి రామకృష్ణ దాదాపుగా 140 సినిమాలు చేయడం విశేషం.


కోడి రామకృష్ణ మొదట నటుడు కావాలనుకున్నారు... దాసరి తీసిన ‘తాతా మనవడు’ చూశాక ఆయన లక్ష్యం మారిపోయింది.
‘నటుడైతే చేసే ఆ ఒక్క పాత్రకే పరిమితం కావాలి. అదే దర్శకుడైతే ఎన్నో పాత్రల్ని తీర్చిదిద్దవచ్చు కదా’ అనే ఆలోచన వచ్చింది. దర్శకత్వం అంటూ నేర్చుకుంటే దాసరి దగ్గరే నేర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. ‘తాతా మనవడు’ చిత్రం యాబై రోజుల వేడుక కోసం పాలకొల్లుకి వచ్చిన దాసరిని కలిస్తే... ‘ముందు డిగ్రీ పూర్తి చేశాక కలువు’ అని చెప్పారట. కొన్ని నెలల తర్వాత ‘రాధమ్మ పెళ్ళి’ సినిమా చిత్రీకరణ కోసం మరోసారి పాలకొల్లు వచ్చిన దాసరిని కలవగా... ‘నాటకాల్లో అనుభవం ఉంది కదా... ఒక వేషం ఇస్తా చేస్తావా?’ అని అడగడంతో శారద పక్కన అసిస్టెంట్‌గా తిరిగే కుర్రాడి వేషం కోసం తొలిసారి మేకప్‌ వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ చదువుల్లో పడిపోయిన కోడి రామకృష్ణ డిగ్రీ పూర్తయ్యాక దాసరి నారాయణరావుకి ఉత్తరం రాయడంతో, ఆయన జవాబుగా ‘స్టార్ట్‌ ఇమ్మీడియట్లీ’ అంటూ టెలిగ్రామ్‌ పంపారు. అలా 1972లో మద్రాసు దిగిన ఆయనకి ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశాన్నిచ్చారు దాసరి. సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే చిన్న చిన్న వేషాల్లో నటించారు. ఎప్పటికైనా గురువుగారిలాగానే నిర్మాత కె.రాఘవ సంస్థ నుంచే దర్శకుడిని కావాలని కోడి రామకృష్ణ కోరిక. ‘తూర్పు పడమర’ సినిమాకి పనిచేస్తూ, కె.రాఘవ మెప్పు పొందారు. ఆయనే నా సంస్థ నుంచే నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తానని చెప్పారట. ‘తరంగిణి’తో ఆ అవకాశం ఇచ్చినా.. కొత్తవాళ్లతో సినిమా ఎందుకని స్నేహితులు భయపెట్టడంతో కె.రాఘవ ఆ ప్రయత్నాన్ని మానుకొన్నారు. దాంతో కోడి రామకృష్ణ ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు సహాయంతో స్క్రిప్టు సిద్ధం చేసి... ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా, 1982లో విడుదలైన ఆ సినిమా యేడాది పాటు ఆడింది. ఆ తర్వాత మొదట అనుకొన్న కథ ‘తరంగణి’ని తెరకెక్కించారు. అది కూడా యేడాది పాటు ఆడింది.


దాసరి దారిలోనే...
అత్యంత వేగంగా సినిమాలు రూపొందించే దర్శకుడిగా పేరు సంపాదించారు కోడి రామకృష్ణ. కొత్తవాళ్లతోనూ, అగ్ర కథానాయకులతోనూ సినిమాలు చేసి విజయాల్ని అందుకొన్నారు. గురువు దాసరి నారాయణరావులాగే సమాజానికి అద్దం పట్టే కథలు, కుటుంబ కథల్ని రూపొందిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన తీసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయాలే. అర్జున్‌, భానుచందర్‌, సుమన్‌వంటి అగ్ర నటుల్ని పరిచయం చేసిన ఘనత కూడా కోడి రామకృష్ణదే. బాబూమోహన్‌, కాస్ట్యూమ్‌ కృష్ణ, రామిరెడ్డి, ముక్కా నరసింగరావు ఆయన తీర్చిదిద్దిన నటులే. చివరిగా ఆయన కన్నడలో ‘నాగరహావు’ అనే చిత్రం చేశారు. అది కూడా కోడి రామకృష్ణ మార్క్‌ సాంకేతిక మాయాజాలంతో తెరకెక్కిన చిత్రమే. కథానాయకుడిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కూడా నటించారు. కోడి రామకృష్ణ భార్య కోడి పద్మ కూడా నటిగా పేరు తెచ్చుకొన్నారు. లలిత కళాంజలి పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించి, పలు చిత్రాల్ని నిర్మించారు కోడి రామకృష్ణ. ఆయన సత్యసాయిబాబాపై సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం పూర్తి కాలేదు. దర్శకత్వంలోనే కాకుండా... నటన పరంగా కూడా గురువు దాసరి నారాయణరావుని అనుసరించారు. దాసరి తన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించేవారు. కోడి రామకృష్ణ కూడా ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’తోపాటు దాదాపుగా 20 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి అలరించారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.