నాట్య మయూరి.. అందాల మాధురి !!
వెండితెరపై ఆమె అందం ఓ సంచలనం..
దశాబ్దాల గడుస్తున్నా సినీప్రియుల మదిలో చెదరని మధుర స్వప్నం ఆ రూపం..
అబ్బురపరిచే అభియనయానికైనా.. అదరగొట్టే స్టెప్పులకైనా ఆ అందాల సుందరే చిరునామా..
ఐదు ఫిలింఫేర్‌లు..
నాలుగు స్టార్‌ స్క్రీన్‌ పురస్కారాలు..
రెండు జీ సినీ అవార్డులు..
వీటన్నింటినీ మించి ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం..
ఇవి చాలు.. నటిగా, అద్భుత నృత్యకారిణిగా మాధురి దీక్షిత్‌
భారత చిత్రసీమపై వేసిన ముద్ర ఎలాంటిదో చెప్పడానికి.

భారతీయ వెండితెరపై ఎందరో నటీమణులు తళుక్కున్న మెరిశారు కానీ, నిండు పున్నమిలా సినీప్రియుల మదిపై చల్లని వెన్నెలలు పంచింది కొందరు మాత్రమే. అలాంటి అరుదైన, అపురూపమైన మెరుపు తారకల్లో మాధురి దీక్షిత్‌ కూడా ఒకరు. వెండితెరకు దొరికిన అందాల పైడి బొమ్మ ఆమె. ఏళ్లు గడిచినా వన్నె తగ్గని వెన్నెల వయ్యారాలతో కవ్వించే కోమలాంగి. ఒంపు ఒంపునా చటుక్కున ఆకర్షించే సొగస్కాంతాన్ని పొదువుకున్న కొంటె కోణంగి మాధురి. ముఖ్యంగా భారతీయ చిత్రసీమలో అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరిగా ఆమెకు పేరుంది.


* మైక్రో బయాలజిస్ట్‌ కాబోయి నటిగా మారి..

మాధురి పూర్తి పేరు.. మాధురి శంకర్‌ దీక్షిత్‌. 1967 మే 15న ముంబయిలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. స్నేహలత, శంకర్‌ ఆమె తల్లిదండ్రులు. దిల్లీలోని పబ్లిక్‌ స్కూల్, దిల్లీ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న ఆమె.. తన కెరీర్‌ తొలినాళ్లలో మైక్రో బయాలజిస్ట్‌ కావాలని అనుకునేదట. కానీ, చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ చూపించడం, ఎనిమిదేళ్లకే కథక్‌లో ప్రవీణురాలై అనేక వేదికలపై సత్తా చాటడం వల్ల.. క్రమంగా సినీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుందట.


* ‘అబోద్‌’తో వచ్చి.. ‘దిల్‌’తో అదరగొట్టి
1984లో వచ్చిన ‘అబోద్‌’ చిత్రంతో తొలిసారి తెరపై తళుక్కున మెరిసింది మాధురి దీక్షిత్‌. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అంతగా ఆకట్టుకోనప్పటికీ నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీని తర్వాత మాధురి నాయికగానే కాక సహాయ నటిగానూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఆమె కెరీర్‌కు తొలిసారి బిగ్‌ బ్రేక్‌ను అందించిన చిత్రం ‘తేజాబ్‌’ (1988). ఇందులో అనిల్‌ కపూర్‌కు జోడీగా మోహిని పాత్రలో మాధురి కనబర్చిన నటనకు సినీప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంతోనే ఉత్తమ నటిగా తొలిసారి ఫిలింఫేర్‌కు నామినేట్‌ అయింది. ఇక ఈ సినిమాలోని ‘ఏక్‌ దో తీన్‌’ పాటతో దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని తన అభిమానులుగా మార్చుకుంది మాధురి దీక్షిత్‌. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్పులు నాటికీ నేటికీ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తునే ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి ‘రామ్‌ లఖన్‌’, ‘పరిందా’, ‘త్రిదేవ్‌’, ‘కిషన్‌ కన్హయ్యా’ వంటి వరుస హిట్లతో బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా మారిపోయింది. ఇక 1990లో ఆమిర్‌ ఖాన్‌తో చేసిన ‘దిల్‌’ చిత్రంతో ఆమె ప్రతిభ ఆకాశానికి తాకింది. ఈ సినిమాలో మధు మెహ్రా అనే డబ్బున్న పొగరుబోతు యువతిగా మాధురి కనబర్చిన నటన విమర్శకులను సైతం విస్మయపరిచింది. ఈ మూవీతోనే ఉత్తమ నటిగా ఆమె తొలిసారి ఫిలింఫేర్‌ను ముద్దాడింది.

* గ్లామర్‌ డాల్‌ కాస్తా.. యాక్టింగ్‌ గర్ల్‌గా
‘దిల్‌’ వరకు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలతోనే నెట్టుకొచ్చిన మాధురికి ఆ సినిమా తర్వాత నుంచి నటనా ప్రాధాన్యమున్న పాత్రలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ‘సాజన్‌’, ‘బేటా’, ‘ఖల్నాయక్‌’, ‘హం ఆప్కే హై కౌన్‌’, ‘రాజా’ వంటి చిత్రాలతో ఏడాదికొక హిట్‌ చొప్పున విజయపరంపరను జోరుగా కొనసాగించింది. వీటిలో ప్రతి చిత్రం ఆమెలోని అత్యుత్తమ నటికి పరీక్ష పెట్టినవే. ఇందులో ‘హం ఆప్కే హై కౌన్‌’ను మాధురి కెరీర్‌కు మైలురాయి లాంటి చిత్రంగా అభివర్ణించవచ్చు. భారత హిందీ సినీ చరిత్రలోనే కమర్షియల్‌గా అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఈ చిత్రానికి భారత్‌లోనే దాదాపు రూ.650 మిలియన్లు రాగా.. విదేశాల్లో సుమారు రూ.150 మిలియన్లు దాకా రాబట్టింది. ఈ సినిమాతో మాధురి మూడో ఫిలింఫేర్‌ను అందుకొంది. దీనికన్నా ముందు ఆమె ‘బేటా’తో ఓ ఫిలింఫేర్‌ను దక్కించుకుంది. ఇక ఇదే ఏడాది ‘అంజాన్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దీని తర్వాత నుంచి ఆమె చేసిన ‘దిల్‌ తో పాగల్‌ హై’, ‘మృత్యుదండ్‌’, ‘సినిమా టూత్‌ ఎక్రాన్‌’ చిత్రాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2002లో వచ్చిన ‘దేవదాస్‌’ తర్వాత నుంచి సినిమాల విషయంలో నెమ్మదించిన మాధురి.. ‘బాంబే టాకీస్‌’, ‘ఏ జవానీ హై దివానీ’, ‘గులాబ్‌ గ్యాంగ్‌’, ‘దేద్‌ ఇష్కియా’ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘టోటల్‌ ధమాల్‌’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ భామ.. ఇటీవలే ‘కళంక్‌’ చిత్రంతోనూ సత్తా చాటింది. 1999 అక్టోబరు 17న శ్రీరామ్‌ మాధవ్‌ నేనేను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

* డ్యాన్సర్‌గా ఉర్రూతలూగించి..
మాధురికి నటిగానే కాక భారత చిత్రసీమలోని అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరిగా పేరుంది. ఆమె చేసిన పాటల్లో ‘‘ఏక్‌ దో తీన్‌’’ (తేజాబ్‌), ‘‘చోళీ కే పీఛే క్యా హై’’ (ఖల్నాయక్‌), ‘‘బడా దుఖ్‌ దీనా’’ (రాం లఖన్‌), ‘‘ధక్‌ ధక్‌’’ (బేటా), ‘చనే కె ఖేత్‌ మే’’ (అంజాన్‌), ‘‘పియా ఘర్‌ ఆయా’’ (యారానా), ‘‘మార్‌ డాలా’’ (దేవదాస్‌) వంటివి నాటి నుంచి నేటి వరకు సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తునే ఉన్నాయి.

* మాధురి క్రేజ్‌కు నిదర్శనాలివి..
నటిగా, నృత్యకారణిగా సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన మాధురి దీక్షిత్‌ అంటే ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్‌. హుసేన్‌కు విపరీతమైన అభిమానం. ఈ అభిమానమే ఆయన్ను ఆమెతో ‘గజ గామిని’ అనే చిత్రాన్ని రూపొందించేలా చేసింది. ఆయన ఈ సినిమాను మాధురికే అంకితం చేయడం మరో విశేషం. ఇక అందాలను ఆరాధించడంలో అందరి కంటే ముందుండే రామ్‌గోపాల్‌ వర్మ.. ఏకంగా మాధురి దీక్షిత్‌ పేరుతో ఓ చిత్రాన్నే నిర్మించారు. ‘మై మాధురి దీక్షిత్‌ బన్నా చాహ్తీ హుం’ పేరుతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చక్కటి ఫలితానే అందుకుంది. ఒకానొక దశలో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికమందుకున్న నటిగా పేరు తెచ్చుకున్న మాధురి.. ఫోర్బ్స్‌ రూపొందించిన టాప్‌ ఫైవ్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ స్టార్స్‌లో జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. 2008లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని అందుకొంది. చిత్రసీమలో ఆమె కనబర్చిన ప్రతిభకు గుర్తింపుగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌ లండన్‌లో ఆమె మైనపు ప్రతిమను ఏర్పాటు చేసింది.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.