ఈ వారం.. వారసుల పర్వం
చిత్ర పరిశ్రమలో స్థిరపడిన నటీనటుల వారసుల నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగిపోతుంటాయి. తమ హీరో కుమారుడు/కుమార్తె నటన ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వస్తున్నాయి ‘దొరసాని’, ‘రాజ్‌దూత్‌’ చిత్రాలు. మూడు తెలుగు చిత్రాలు, మరో రెండు పరభాషా సినిమాలు జులై 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఎవరు ఏ మేరకు ప్రేక్షకులకు దగ్గరవుతారో చూడాలి.

70 ఏళ్ల బామ్మ 20 ఏళ్ల భామగా కనిపిస్తే ఎలా ఉంటుందో ‘ఓ బేబీ’ చూపించింది. రీమేక్‌ సినిమా అయినప్పటికీ దర్శకురాలు ఇక్కడి నేపథ్యానికి తగినట్టుగా తెరకెక్కించి, తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచింది. సమంత నటనకు అందరూ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ప్రవరిస్తారో ‘బుర్రకథ’లో చూశాం. ఓ సారి మాస్‌గా, మరోసారి క్లాస్‌గా ఉండే కథానాయకుడు చివరకు ఎలా మారాడో చూపించిన విధానం ఆకట్టుకుంది. ఇలాంటి విభిన్న కథలు తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచాయి. ఇదంతా గతవారం... మరి ఈ వారం ఎవరు ఎలాంటి అంచనాలతో మన ముందుకు వస్తున్నారో చూద్దాం..
* దొరసాని
ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘దొరసాని’. ఈ ఇద్దరికీ ఇదే తొలి సినిమా. సరికొత్త ప్రేమకథను దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర చూపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు అలరిస్తున్నాయి.ఈ సినిమా కథానాయకుడు ఆనంద్‌.. విజయ్‌ దేవరకొండ సోదరుడు, కథానాయిక శివాత్మిక.. నటుడు రాజశేఖర్‌ కుమార్తె. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.


* రాజ్‌దూత్‌శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్‌’. రాజ్‌దూత్‌ బైక్‌లో ఏముందనేదే ఈ సినిమా కథాంశం. ట్రైలర్‌తో ఇప్పటికే అందరిని ఆకట్టుకున్నాడు. శ్రీహరి కుమారుడిగా తెరంగ్రేటం చేస్తున్నా.. తన నటనతో తనని తాను నిరూపించుకునేందుకు రానున్నాడు. దర్శకత్వం.. అర్జున్‌ గున్నాల, కార్తీక్‌. సంగీతం.. వరుణ్‌ సునీల్‌.

* నిను వీడని నీడను నేనే


ఇప్పటి వరకు ప్రేమ కథల్లో కనిపించిన హీరో సందీప్‌ కిషన్‌ ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందీ సినిమా. విజయం కోసం ప్రయత్నిస్తున్న ఈ యువ కథానాయకుడికి ఈ సినిమా ఏ ఫలితం అందిస్తుందో చూడాలి. దర్శకత్వం.. కార్తీక్‌ రాజు. సంగీతం.. తమన్‌.

* అయోగ్య

విశాల్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం ‘అయోగ్య’. తమిళ్‌తోపాటు తెలుగలోనూ విడుదలవుతుంది. ఇందులో విశాల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు.

* సూపర్‌ 30ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సూపర్‌ 30’. ఇందులో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడు. ఈ సినిమా పోస్టర్, టీజర్లలో హృతిక్‌ ఆ పాత్రలో ఒదిగిపోయాడంటున్నారు అభిమానులు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.