ఈ దసరా పోరు మహా రంజుగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో బాక్సాఫీస్‌ పోరుకు రంగం సిద్ధమైంది. తెలుగు సినీ క్యాలెండర్‌కు చివరి మహా సంగ్రామమైన దసరా రేసుకు అగ్ర కథానాయకులు మొదలు యువ హీరోలు వరకు అంతా రెడీ అయిపోతున్నారు. దసరా బుల్లోడిలా బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటేందుకు అదిరిపోయే చిత్రాలతో వచ్చేస్తున్నారు. తాజాగా వినాయ చవితి పర్వదినాన్ని పురస్కరించుకోని చాలా చిత్రాలు విడుదలకు మహూర్తాలు ఖరారు చేసుకున్నాయి. అయితే ఈసారి దసరా రేసు మునుపెన్నడూ చూడనంతగా రసవత్తరంగా ఉండబోతున్నట్లు తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈసారి పండుగ రేసులో పోటీ పడుతున్న వారిలో చిరంజీవి, వెంకటేష్‌ వంటి సీనియర్‌ హీరోలతో పాటు గోపీచంద్‌, సందీప్ కిషన్‌ వంటి యువ హీరోలు ఉన్నారు.


‘సైరా’కు ‘వెంకీమామ’కు పోరు తప్పదా!!
ఈ దసరాకు అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్‌లు బాక్సాఫీస్‌ ముందు తలపడబోతున్నారా? ప్రస్తుతం చిత్రసీమలో కనిపిస్తున్న వాతావరణం చూస్తుంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. పాన్‌ ఇండియా చిత్రంగా ‘సైరా’ను దాదాపు రూ.300 కోట్ల పైగా ఖర్చుతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవి కలల ప్రాజెక్టు కావడం, అమితాబ్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, కిచ్చా సుదీప్‌ వంటి అగ్రతారలు నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే అదే రోజు హృతిక్‌ - టైగర్‌ ష్రాఫ్‌ల ‘వార్‌’ కూడా విడుదలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో ‘సైరా’కు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొకడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి పోరు నుంచి ‘సైరా’ తప్పుకోబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే దసరాకు ‘వెంకీమామ’తో చిరు పోరు పడకతప్పదు. ‘ఎఫ్‌ 2’ తర్వాత వెంకటేష్‌ నుంచి రాబోతున్న మరో క్రేజీ మల్టీస్టారర్‌ ఇది. ఇందులో వెంకీతో పాటు ఆయన మేనల్లుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నారు. ‘జై లవకుశ’ తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అందుకే దీనిపైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాబట్టి ఒకవేళ ‘సైరా’, ‘వెంకీమామ’ రెండు బాక్సాఫీస్‌ వద్ద తలపడితే టాక్‌ను బట్టీ వసూళ్లను సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోరు తప్పదా లేదా? అన్నది ‘సైరా’ వాయిదాపై అధికారిక ప్రకటన వస్తే కానీ, చెప్పలేం. ఒకవేళ చిరు ముందుగా చెప్పినట్లుగానే అక్టోబరు 2నే ప్రేక్షకుల ముందుకొచ్చినా దాని ప్రభావం ‘వెంకీమామ’పై తప్పకుండా పడే అవకాశం ఉంది.

అటు గోపీ.. ఇటు సందీప్‌.. మధ్యలో దెయ్యం..
ఇక ఈ దసరా బరిలోనే పోటీ పడుతున్న మరో మూడు చిత్రాలు ‘చాణక్య’, ‘తెనాలి రామకృష్ణ’, ‘రాజుగారి గది 3’. తాజాగా వినాయక చవితిని పురస్కరించుకోని విడుదల చేసిన పోస్టర్లలో దసరా కానుకగా అనే విషయాన్ని ప్రస్తావించారు. గతకొంత కాలంగా వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న గోపీచంద్‌ ‘చాణక్య’ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీ ఓ గూఢచారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్లకు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఓంకార్‌ హిట్‌ సిరీస్‌ రాజుగారి గది నుంచి వస్తోన్న మూడో భాగం కూడా దసరాకే థియేటర్లలోకి రాబోతుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే వీటితో పాటు సందీప్‌ ‘తెనాలి రామకృష్ణ’ కూడా పండగ బరిలో నిలుస్తుందా లేదా అన్నది కచ్చితంగా తెలియనప్పటికీ పోస్టర్‌పై అక్టోబరులోనే రాబోతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ అతను కూడా దసరా బరిలో అడుగుపెట్టేందుకే సిద్ధపడితే ఈసారి టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పోరు మహా రంజుగా మారే అవకాశముంది. అయితే ఇవన్నీ అనుకున్న సమయానికే వస్తాయా? లేదా? అన్నది కూడా ‘సైరా’ విడుదల తేదీపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చిరు తన రిలీజ్‌ డేట్‌ను మార్చుకుంటే వీరిలో ఎంత మంది దసరా పోరు నుంచి తప్పుకుంటారో తెలుస్తుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.