అక్కడ జోరు.. ఇక్కడ బేజారు!!

‘బాలీవుడ్‌ బాక్సాఫీస్‌తో పోటీ’.. తెలుగు చిత్రసీమకు ఒకప్పుడిది అమ్మో అనిపించే మాట. చిత్ర నిర్మాణ విలువల పరంగా చూసినా, కంటెంట్‌ - బడ్జెట్‌ పరంగా చూసినా రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించేది. కానీ, ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిట్‌లు, వసూళ్ల విషయంలో రెండు బాక్సాఫీస్‌ల మధ్య ఓ పోటీ వాతావరణం ఏర్పడింది. గతేడాది హిందీ చిత్రసీమకు దీటుగా తెలుగులోనూ కావల్సినన్ని హిట్లు పడటంతో దర్శకనిర్మాతలు, డిస్టిబ్యూటర్లలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ జోరులోనే కొత్త ప్రయోగాలు, సరికొత్త కలయికలు సినీప్రియుల కోసం సిద్ధమయ్యాయి. అయితే ఈ కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు ఎదురైన దారుణ ఫలితాలు తెలుగు బాక్సాఫీస్‌ను కలవరపెడుతున్నాయి.


కొత్త సంవత్సరంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తుండగా.. ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు 30కి పైగా చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే వీటిలో ‘ఎఫ్‌2’, ‘యాత్ర’, ‘118’ చిత్రాలు తప్ప మిగిలినవన్నీ బాక్సాఫీస్‌ ముందు బొక్కబోర్లా పడ్డాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలు దారుణ ఫలితాల్ని అందుకున్నాయి. దీంతో సరైన వసూళ్లు లేక టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఓ నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడిలా ఉండగా.. బాలీవుడ్‌లో మాత్రం తొలి నెల నుంచే ఓ ఉత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. చిన్న చిత్రాలు కూడా అనూహ్యమైన విజయాలు అందుకోని భారీ వసూళ్లతో సత్తా చాటుతుండటంతో అక్కడి బాక్సాఫీస్‌ వద్ద నూతనోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఉరీ’ చిత్రం దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు, మణికర్ణిక రూ.150 కోట్ల పైచిలుకు వసూళ్లతో సత్తా చాటడంతో తొలి నెలే ఉత్సాహంగా షురూ అయినట్లయింది. దీనికి తగ్గట్లే తర్వాత వచ్చిన ‘గలీబాయ్‌’ రూ.125 కోట్లు, ‘టోటల్‌ ధమాల్‌’ రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టడంతో అక్కడి దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తాజాగా విడుదలైన మరో చిన్న చిత్రం ‘బద్లా’ కూడా ఇదే రీతిలో చక్కటి వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఏదేమైనా ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వరుస విజయాలతో జోరుగా కనిపిస్తోంటే.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వరుస ప్లాప్‌లతో బేజారుగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు చిత్రసీమ ఆశలన్నీ వేసవి సినిమాలపైనే ఉన్నాయి.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.