జెమినీ గణేశన్‌ కథలో.. విలాసం.. వివాదం!
జెమినీ గణేశన్‌.. సావిత్రి జీవితం అత్యంత సామాన్య స్థితి నుంచి తారస్థాయికి చేరుకునే వరకు ప్రతి మలుపులో కనిపించి, వినిపించే పేరు. కొందరు జెమినీ.. సావిత్రిని నిలువెత్తు ప్రేమకు చిహ్నంలా యువరాణిలా చూసుకున్నాడని అంటే, మరికొందరు ప్రేమ పేరుతో మోసపుచ్చాడని అంటుంటారు. దీనికి ఆయన వ్యక్తిగత జీవితంలో చేసుకున్న నాలుగు పెళ్లిళ్లనే ఉదహరిస్తారు. తాజాగా తెరకెక్కిన సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’, జెమినీ గురించి కూడా ఎంతో ఆసక్తిని కలుగజేసింది. ‘మహానటి’.. సావిత్రి జీవితంలోని ఎన్నో వాస్తవాలను ప్రపంచానికి చూపించిందంటూ ఆమె సంతానం సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈ చిత్రంలో తమ తండ్రిని విలన్‌గా చూపారంటూ జెమినీ తొలి భార్య సంతానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం వాస్తవం ఏంటన్నది సినీ ప్రియులకు తెలియకపోయినా జెమినీ గణేశన్‌ వ్యక్తిగత జీవితంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలు...


* ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించి...
జెమినీ గణేశన్‌ అసలు పేరు రామస్వామి గణేశన్‌. 1947లో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. తొలినాళ్లలో జెమినీ స్టూడియోలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. అలా అక్కడ చేస్తూ అందరిలో జెమినీ గణేశన్‌గా పేరు తెచ్చుకున్నాడు. జెమినీ తొలిసారి ‘మిస్‌ మాలినీ’ (1947)తో తెరంగేట్రం చేసినా.. 1953లో చేసిన ‘తాయ్‌ ఉల్లమ్‌’తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో జెమినీ ప్రతినాయక పాత్ర పోషించాడు.

* కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌..
జెమినీ గణేశన్‌ను తమిళనాట ‘కాదల్‌ మన్నన్‌’గా అభిమానులు కీర్తించేవారు. మగువలను కట్టిపడేసే అందం ఆహార్యంతో జెమినీ ఎన్నో సినిమాల్లో అమర ప్రేమికుడిగా కనిపిస్తారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు అందాల నటుడి, కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా వెండితెరను ఏలారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. అయితే వెండితెరపై కుర్రకారు కలల హీరోగా కీర్తి గడించిన గణేశన్‌, వ్యక్తిగత జీవితంలో బహు వివాహాలు చేసుకొని అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు.


* 19 ఏళ్ల వయసులో తొలి వివాహం..
జెమినీ గణేశన్‌ 19 ఏళ్ల వయసులో తొలిసారిగా పెళ్లిపీటలు ఎక్కాడు. తొలి భార్య అలమేలును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ నలుగురు (రేవతి, కమల, జయలక్ష్మి, నారాయణి) సంతానం ఉన్నారు. వీరిలో ముగ్గురు వైద్యవృత్తిలో స్థిరపడగా చివరి కూతురు నారాయణి జర్నలిస్ట్‌గా ఉన్నారు.

* కొడుకుతో కలిసి నటించిన జెమినీ..
అలమేలుతో వివాహమయ్యాక సావిత్రిని ప్రేమ వివాహం చేసుకున్నారు జెమినీ. వీరిద్దరి పెళ్లి చాలా రహస్యంగా జరిగింది. పెళ్లైన రెండేళ్లకు గానీ ఈ విషయం బయటకు రాలేదు. సావిత్రి, జెమినీలకు ఇద్దరు (విజయ చాముండేశ్వరి, సతీశ్‌ కుమార్‌) సంతానం ఉన్నారు. జెమినీ తన కుమారుడు సతీష్‌తో కలిసి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. సావిత్రి చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు జెమినీ మొదటి భార్య అలమేలు, సావిత్రిని ఆసుపత్రికి వెళ్లి మరీ చూసి వచ్చింది. సావిత్రి చనిపోయాక ఆమె పార్థివదేహాన్ని తన ఇంటికి తీసుకువెళ్లడమే కాక దగ్గరుండి కర్మకాండలు జరిపించింది.


* ముచ్చటగా మూడో వివాహం..
అలమేలు, సావిత్రిలు కాక జెమినీ జీవితంలో ఉన్న మరో మహిళ తెలుగు నటి పుష్పవల్లి. వాస్తవానికి సావిత్రి కన్నా ముందే జెమినీకి ఈమెతో సాన్నిహిత్యం ఉంది. బాలీవుడ్‌ ప్రముఖ నటీమణులు రేఖ, రాధ వీరిద్దరి సంతానమే.

* 78 ఏళ్ల వయసులో 36 ఏళ్ల యువతితో..
జెమినీ గణేశన్‌ తన 78 ఏళ్ల వయసులోనూ మరో పెళ్లి చేసుకోవడానికి వెనుకాడలేదు. అది కూడా తన కన్నా చాలా చిన్న వయసున్న జూలియానా అండ్రూస్‌ (36)ను నాలుగవ వివాహం చేసుకున్నాడు జెమినీ. ఇలా మొత్తంగా నలుగురు భార్యలకు భర్తగా, ఎనిమిది మంది సంతానానికి తండ్రిగా మారాడు. జెమినీ 2005 మార్చి 22న కన్నుమూశారు.

- మందలపర్తి రాజేశ్ శర్మ, ఈనాడు డిజిటల్


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.