వేసవి పద్దు ఎంతో..?
తెలుగు చిత్రసీమలో సంక్రాంతి పద్దులు ఓ కొలిక్కివచ్చాయి. పరాజయాన్ని చవిచూసిన సినిమాలు మిగిల్చిన నష్టమెంతో, విజయాన్ని అందుకొన్న సినిమాకి ఏ స్థాయి లాభాలు దక్కాయో దాదాపుగా తేలిపోయింది. ఇంతలోనే మరో కీలకమైన సీజన్‌కి రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత సినిమాలకి మరో బలమైన సీజన్‌ వేసవే. ఆ సమయంలో అగ్ర కథానాయకుల చిత్రాలు పోటాపోటీగా బాక్సాఫీసు బరిలోకి దిగుతుంటాయి. వసూళ్లతోనూ, కొత్త రికార్డులతోనూ వేడి పుట్టిస్తుంటాయి. ప్రేక్షకులకు మండుటెండల్లోనూ హాయైన వినోదాలు పంచుతుంటాయి. అందుకే సినీ ప్రేమికులంతా వేసవి కోసం ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి సినీ వేసవి ఎలా ఉంటుంది?ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు? పరిశీలిద్దాం పదండి..తెలుగు చిత్రసీమలో వేసవి సీజన్‌ మార్చి నుంచి షురూ అవుతుంది. ఒక పక్క విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటే మరోపక్క కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. సినిమా బాగుందంటే ఏదో ఒక పూట థియేటర్‌కి వస్తారని... పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనంగా సినిమాల్ని ఆశ్రయిస్తారని దర్శకనిర్మాతలు నమ్ముతుంటారు. అందుకే పరీక్షల సమయంలోనూ ధైర్యంగా సినిమాల్ని విడుదల చేస్తుంటారు. ఈసారి మార్చి ఆరంభం నుంచే సినిమాల సందడి మొదలు కాబోతోంది.


కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘118’ మార్చి 1న విడుదల కాబోతోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయవుతున్న చిత్రమిది. నివేదా థామస్‌, షాలిని పాండే కథానాయికలు. అదే రోజునే అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించిన ‘ఏబీసీడీ’ విడుదల కాబోతోంది. మలయాళంలో విజయవంతమైన ‘ఏబీసీడీ’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ‘అర్జున్‌ సురవరం’ మార్చి 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే రోజునే నిహారిక ‘సూర్యకాంతం’ విడుదలవుతోంది. వేసవి సీజన్‌లో అగ్ర కథానాయకుల చిత్రాలే కాదు, పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలూ విడుదలవుతుంటాయి. సెలవులు కాబట్టి యువతరం అన్ని సినిమాల్నీ చూడటానికి ఆసక్తి చూపుతుందనే అభిప్రాయాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తుంటాయి.


అసలు హంగామా ఏప్రిల్‌లో
మహేష్‌బాబు, నాగచైతన్య, నాని, సాయిధరమ్‌ తేజ్‌... వీళ్ల సినిమాలన్నీ ఒకే నెలలో విడుదలైతే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అసలు సిసలు సీజన్‌ ఇదే అనిపిస్తుంది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘మహర్షి’ ఏప్రిల్‌ 25న విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ కలసి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కీలక చిత్రాల్లో ‘మహర్షి’ ఒకటి. అందుకే ఈ చిత్రంపై పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. నాని కథా నాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఏప్రిల్‌లోనే విడుదలవుతోంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ విడుదలకి ఏప్రిల్‌ 12న ముహూర్తం కుదిరింది. లారెన్స్‌ నటించిన ‘కాంచన 3’ ఏప్రిల్‌ 18న వస్తోంది. అనువాద చిత్రాలు కూడా ఈ నెలలోనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
చిన్నచిత్రాలకూ అవకాశం

సుదీర్ఘంగా సాగే సినిమా సీజన్‌ వేసవి. మార్చి నుంచి మొదలై జూన్‌ చివరి వరకు ఉంటుంది. చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాల్లో వెనకబడిన సినిమాలన్నీ మే, జూన్‌ మాసాల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. గత రెండు మూడేళ్లుగా వేసవిలో అగ్ర తారలు నటించిన కీలక చిత్రాలు విడుదలయ్యాయి. ఈసారి మాత్రం ఆ సందడి కనిపించే పరిస్థితులు లేవు. అగ్ర తారలు నటిస్తున్న చిత్రాలు ఇంకా సెట్స్‌పై ఉండటమే అందుకు కారణం. అవి ఆగస్టు, అక్టోబరు మాసాల్లో విడుదల కాబోతున్నాయి. మే, జూన్‌ మాసాలు ఓ మాదిరి హీరోల చిత్రాలకే పరిమితం కాబోతున్నాయి. రాజశేఖర్‌ ‘కల్కి’ మేలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. వేసవి బరిలో ప్రతిసారీ అగ్ర తారల చిత్రాలే పోటీపడటంతో పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలకి థియేటర్లు దొరికేవి కాదు. కానీ ఈసారి మార్పు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు క్రికెట్‌ మ్యాచ్‌ల రూపంలో వేసవి సినిమాలకి గట్టి పోటీ ఉండేది. కానీ ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడ్డారు. దాంతో క్రికెట్‌ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు చిత్ర పరిశ్రమ. వేసవి సీజన్‌ మొదలవుతోందనగానే వ్యాపార లావాదేవీలు ఊపందుకొనేవి. కానీ వరుసగా రెండు సంక్రాంతి సీజన్లు గట్టి దెబ్బకొట్టాయి. నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు నష్టపోయారు. ఓవర్సీస్‌లోనూ ఇదే పరిస్థితే. ఆ ప్రభావం ఈసారి వేసవి సినిమాలపై బాగానే పడింది. ఓవర్సీస్‌ పంపిణీదారులు ఇదివరకటిలాగా సినిమాల్ని ఎక్కువ ధరలకి కొనడానికి ఆసక్తి చూపడం లేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.