మకర సంక్రాంతికి ముద్దు గుమ్మల మెరుపులు
హరిదాసులు పాడే రామకీర్తనలు..

పొగ మంచు తెరల మధ్య ఇంటిముందు పడుచందాలు వేసే రంగవల్లికలు...

ఆకాశపు అంచుల్ని అందుకోవాలని రివ్వున ఎగిరే గాలిపటాలు..

వంటింట్లోంచి వీధి చివరి వరకూ పరుగులు పెట్టే ఘుమఘుమలు..

వాకిట్లో కొత్తల్లుళ్లతో ఆడే పరాచకాలు..

పొలం గట్ల మధ్య మీసాలు మెలితిప్పే పందాల రాయుళ్లు.


- సంక్రాంతి అంటే ఇవి మాత్రమే కాదు. కొత్త సినిమాలు, వాటి సరదాలు కూడా. అసలు కొత్త సినిమా చూడకపోతే పండగెలా పరిపూర్ణం అవుతుంది? ఆ సినిమా చూసొచ్చాక హీరోల డ్యాన్సుల గురించో, ఫైటింగుల గురించో, పేల్చిన పంచ్‌ డైలాగుల గురించో పొద్దుగూకేదాకా మాట్లాడుకోకపోతే ఆ రోజు ఎలా పూర్తవుతుంది? అయితే ఈసారి హీరోల గురించే కాదు. కథా నాయికల గురించీ మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ముగ్గుల పండక్కి - ప్రేక్షకులపై సొగస్కాంతులు వెదజల్లడానికి వీళ్లంతా సిద్ధంగా ఉన్నారు.

రజనీ... రంగవల్లికలు
9న ‘దర్బార్‌’ విడుదల కానుంది. ఈ సంక్రాంతి సీజన్‌కి బోణీ కొట్టే సినిమా అదే. రజనీకాంత్‌ సినిమా అంటే అందరిదృష్టీ ఆయనమీదే ఉంటుంది. రజనీని ఈ సినిమాలో ఎంత స్టైల్‌గా చూడబోతున్నాం? ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది? అనే లెక్కల్లో అభిమానులు ఉంటారు. అయితే ఈ చిత్రంలో నయనతార హవా ఏమీ తక్కువ కాదు. ఎందుకంటే ఇది మురుగదాస్‌ చిత్రం. ఆయన కథల్లో నాయికలకు సైతం ప్రాధాన్యం ఉంటుంది. పైగా నయనతార లాంటి స్టార్‌ కథానాయికకు సరైన పాత్ర రాయకపోతే ఎలా? ఎప్పటిలానే పద్ధతిగా, చీరకట్టులో దర్శనమిస్తోంది నయన్‌. ఈ చిత్రంలో నివేదా థామస్‌ సైతం కనిపించబోతోంది. ‘బ్రోచేవారెవరురా’, ‘118’ చిత్రాలతో ఆకట్టుకుంది నివేదా. రజనీ చిత్రంలో తనకు అవకాశం రావడమే గొప్ప విషయం. మరి దాన్ని ఎలా సద్వినియోగపరచుకుందో చూడాలి.


గాలి పటమా... పద పద

సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. దారం వదిలితే చాలు - రివ్వురివ్వుమంటుంటాయి. రష్మిక కూడా అలానే దూసుకుపోతోంది. తన కెరీర్‌లో స్పీడు అలా ఉంది. పైగా మహేష్‌బాబుతో సినిమా అంటే ఆ జోరు మరింత పెరుగుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’లో తనే కథానాయిక. ‘అర్థమయ్యిందా..’ అంటూ వెరైటీ మేనరిజంతో అల్లరి చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలో రైలు నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలున్నాయి. అందులో రష్మిక చేసిన సందడి అంతా ఇంతా కాదట.


వెచ్చని భోగిమంట

ప్రత్యేక గీతాలంటే ఇప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు తమన్నానే. ఓవైపు కథానాయికగా బిజీగా ఉంటూనే, మరోవైపు ఈ తరహా అవకాశాల్ని కూడా అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. ‘ఆజ్‌ రాత్‌ మేరే ఘర్‌ మే పార్టీ హై.. తూ ఆజానా’ అంటూ మహేష్‌ని కవ్వించే పాటలో తమన్నా కనిపించనుంది. ఈ పాటలో మహేష్, తమన్నా చేసే నృత్యాలు అభిమానులకు పండగ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఐటెమ్‌ గీతం, అందులోనూ తమన్నా నృత్యం - ఈ పొగ మంచు వేళలో, ఈ పాట ఓ భోగిమంటలా వెచ్చదనం పంచకుండా ఎలా ఉంటుంది? మరి ఆ విన్యాసాలు చూడాలంటే ఈనెల 11 వరకూ ఆగాల్సిందే.


పందేలు వేస్తున్న అందాలు
త్రివిక్రమ్‌ సినిమా అనేసరికి ఇద్దరు కథానాయికలు ఉండడం మామూలైపోయింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ ఇద్దరు నాయికలున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌ ఆ బాధ్యతని తీసుకున్నారు. అయితే ప్రథమ తాంబూలం మాత్రం పూజకే. ‘మేడమ్‌ మేడమ్‌’ అంటూ అల్లు అర్జున్‌ ఆమె వెంట పడడం, ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ తనని ప్రసన్నం చేసుకోవడానికి పాట్లు పడడం ప్రచార చిత్రాల్లో చూస్తూనే ఉన్నాం. నివేదా పేతురాజ్‌ పాత్ర ఏంటన్నది చిత్రబృందం కాస్త గోప్యంగా ఉంచుతోంది. సంక్రాంతి పూట కోడి పందాల్లానే.. వీళ్ల అందాల పోటీ కూడా రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహమే లేదు. ఈనెల 12న వీరిద్దరినీ థియేటర్లలో చూసేయొచ్చు.
రథం ముగ్గు వేసేదెవరమ్మా
రథం ముగ్గు వేసి సంక్రాంతిని సాగనంపుతారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో వచ్చే చివరి చిత్రం ‘ఎంత మంచివాడవురా’. కల్యాణ్‌రామ్‌ కథా నాయకుడిగా నటించారు. మెహరీన్‌ నాయిక. సతీష్‌ వేగేశ్న సినిమా అంటే బంధాలు, బంధుత్వాలే కదా. ఈ సినిమాలోనూ అంతే. ఆయనెప్పుడూ నాయికని చాలా పద్ధతిగా చూపిస్తుంటారు. ఈసారి మెహరీన్‌కి అలాంటి పాత్రే దక్కింది. మరి ఏమేర రాణించిందో తెలియాలంటే 15 వరకూ ఆగాలి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.