అందాల అభి‘రుచులు’
ఉగాది అనగానే తెలుగుదనం వెల్లివిరుస్తుంది. తెలుగింటి తొలి పండగ కాబట్టి లోగిళ్లు ప్రత్యేకంగా ముస్తాబవుతాయి. షడ్రసోపేతమైన పచ్చడి పంచే రుచులు... కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలు. ప్రత్యేకమైన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకి ఎవ్వరైనా ఫిదా కావల్సిందే. నవతరం కథానాయికలంతా తెలుగు భాష అన్నా... తెలుగుదనం అన్నా ఎంతో మక్కువ చూపుతున్నారు. తొందరగా భాష నేర్చేసుకొని... మేం తెలుగు అమ్మాయిలం అనిపించుకొంటున్నారు. తెరపై తెలుగుదనానికి లోటు రాకుండా చేస్తున్న ఈ కథానాయికల కొత్త ఆశలు, ప్రయాణమిదీ...అన్నీ సమపాళ్లలో
తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు ఇవన్నీ కలిస్తేనే ఉగాది. ఇలా అన్ని రుచులనూ పంచుతానంటోంది కీర్తి సురేష్‌.‘మహానటి’ తర్వాత ఆమె నేరుగా తెలుగులో సినిమా చేయలేదు. ఇటీవలే నరేంద్ర దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యమున్న ఓ చిత్రం కోసం రంగంలోకి దిగింది. కుటుంబం నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో హాస్యం, భావోద్వేగాలు కీలకమట. ‘మహానటి’లో సాక్షాత్తూ సావిత్రినే చూస్తున్నామా అన్నంతగా ఒదిగిపోయి మెప్పించింది కీర్తి. అలా మరోసారి తన నటనతో మాయ చేయాలనుకొంటోంది కీర్తి. తమిళ, మలయాళ భాషల నుంచి అవకాశాలు వచ్చినా ఆమె క్రమం తప్పకుండా తెలుగులో నటిస్తుంటుంది. తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. తెలుగుదనం ఉట్టిపడే రూపం కీర్తి సొంతం. ఈ భాష, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి నాకెంతో కాలం పట్టలేదని చెబుతోందామె.

వలపు.. పులుపు
రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తొలి అడుగుల్లోనే తెలుగమ్మాయి అనిపించుకుంది. తొలి సినిమా చేస్తున్నప్పుడే భాషపై పట్టు పెంచుకొంది. పంజాబీ మాతృభాష అయినా... ఇప్పుడు నా ఆలోచనలు తెలుగులోనే వస్తున్నాయని చెబుతోందామె. ‘మన్మథుడు2’ కోసం నాగార్జునతో జోడీ కట్టింది. మన్మథుడి సరసన అంటే రకుల్‌ వలపు బాణం విసరడం ఖాయమైనట్టే. ఈసారి ఆమె తెలుగు ప్రేక్షకులకు వలపుతోనే పులుపు రుచులు పంచబోతోందన్న మాట. కొన్నాళ్లుగా తెలుగులో కంటే, ఇతర భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది రకుల్‌. ఇకపై తెలుగుపరిశ్రమ నుంచే తన ఆదాయం పెంచుకోవాలన్నట్టుగా కొత్త చిత్రాలకి సంతకం చేస్తోంది.

కొత్తగా...
తెలుగు మాట్లాడకపోవచ్చు కానీ... తెలుగు సంస్కృతిని అర్థం చేసుకోవడంలోనూ, అచ్చమైన తెలుగు అందంతో కనిపించడంలోనూ కాజల్‌కి తిరుగులేదు. పుష్కరకాలంగా ఆమె తెలుగు చిత్రసీమలో ప్రయాణం చేస్తోంది. తాను ఎన్ని భాషల్లో నటించినా... తెలుగు సినిమా మాత్రం ప్రత్యేకమని చెబుతోందామె. త్వరలోనే ‘సీత’ చిత్రంతో సందడి చేయబోతోంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే కాజల్‌ తెరపై ఈసారి అందంగా కనిపిస్తూనే... విలనిజం కూడా ప్రదర్శించనుందని అర్థమవుతోంది. అప్పుడప్పుడు కాస్త పొగరుగా కనిపిస్తూ వగరుని, అందంగా కనిపిస్తూ తీపిని పంచిన కాజల్‌ ఈసారి విలనిజంతో చేదునీ రుచి చూపుతుందన్నమాట. దీన్నిబట్టి కాజల్‌ నుంచి మరో కొత్త రకమైన పాత్ర ఖాయమని అర్థమవుతోంది. యువ కథానాయకుడు శర్వానంద్‌తోనూ జోడీ కట్టింది కాజల్‌. ప్రస్తుతం తెలుగులో కొనసాగుతున్న సీనియర్‌ కథానాయికల్లో కాజల్‌ ఒకరు. కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టకుండా, తన అనుభవానికి తగ్గట్టుగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటిస్తూ రాజపూజ్యం బలంగా ఉండేలా చూసుకొంటోంది కాజల్‌.

తెలుగులోనే వేగంగా
తెలుగు భాషే కాదు...అందులోని యాసలు కూడా తెలిసిన కథానాయిక సాయిపల్లవి. ‘ఫిదా’లో ఆమె మాటలు ప్రేక్షకులకి భలే కిక్‌నిచ్చాయి. తొలి చిత్రం నుంచే తన పాత్రలకి తానే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంటోంది సాయిపల్లవి. ఆమెకి తెలుగు ఎంతగా నచ్చిందంటే... ఆమధ్య ఓ ద్విభాషా చిత్రం చేయగా, మాతృభాష తమిళంలో కంటే తెలుగులోనే వేగంగా డబ్బింగ్‌ పూర్తి చేసిందట. భాషలో తీయదనం ఉందని చెబుతోందామె. తెలుగు సినిమా సెట్‌లో ఉన్నానంటే, తాను తెలుగే మాట్లాడుతుంటానని చెబుతోందామె. ‘పడి పడి లేచే మనసు’తో ఎప్పట్లాగే నటన పరంగా మంచి మార్కులు సంపాదించింది. త్వరలో ఓ అగ్ర కథానాయకుడితో కలిసి జోడీ కట్టబోతోందని సమాచారం.

లిల్లీ ముచ్చట
ఉగాది రోజున వేప పువ్వే కాదు... లిల్లీ పువ్వు ముచ్చట కూడా వినండని చెబుతోంది రష్మిక మందన్న. ఆమె ‘డియర్‌ కామ్రేడ్‌’లో లిల్లీ అనే అమ్మాయిగా కనిపించ బోతోంది. పేరు వినడానికి సున్నితంగానే ఉంది కానీ... చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక మాత్రం షడ్రుచుల్లోని కారాన్ని గుర్తు చేస్తోంది. అంత హాట్‌గా కనిపిస్తోందామె. ‘గీత గోవిందం’లో కూడా ఆమె పాత్ర అంతే. సీరియస్‌గా కనిపిస్తూనే వినోదాన్ని పంచింది. మరి లిల్లీ పంచే వినోదాల్ని ఆస్వాదించాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఆగాల్సిందే. రష్మిక ఇటీవలే తమిళంలోకి అడుగుపెట్టింది. మాతృభాష కన్నడంలోనూ నటిస్తోంది. పలు భాషల్లో అవకాశాలతో ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ తెలుగు సినిమాని మాత్రం మరిచిపోనంటోంది. ఆమె త్వరలోనే నితిన్‌తో కలిసి ‘భీష్మ’లో నటించబోతోంది. తెలుగు గడగడా మాట్లాడేస్తున్న రష్మికని ప్రేక్షకులు కూడా తెలుగమ్మాయిలాగే చూస్తున్నారు.

జాతకం దివ్యం
ఈ ఏడాది రాజపూజ్యం మెండుగా ఉన్న కథానాయికల జాబితాలోకి నివేదా థామస్‌ చేరిపోయింది. ఆమె ఇప్పటికే ‘118’తో విజయాన్ని అందుకొని నటన పరంగానూ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే నివేదా ఆదాయం గురించి పట్టించుకోకుండా, కథాబలమున్న చిత్రాలు చేస్తోంది. అందుకే ఆమె నటన పరంగా అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఉంటుంది. తదుపరి ‘బ్రోచేవారెవరురా’, ‘శ్వాస’ చిత్రాలతోనూ సత్తా చాటి, ఈ ఏడాది తనది దివ్యమైన జాతకం అని చాటాలని చూస్తోంది. తెలుగమ్మాయి కాక పోయినా.. తెలుగుదనం ఉట్టిపడేలా హావభావాలు ప్రదర్శించడంలో దిట్ట నివేద.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.