హాలీవుడ్‌ భామలు... ఆరడుగుల చాక్లెట్లు
మన హీరోలంటే ఎప్పుడో కానీ సూపర్‌మేన్‌ అవతారంలో కనిపించరు. హీలీవుడ్‌లో అయితే... తరచూ అవే అవతారాలు. తెరపై సూపర్‌మేన్‌లుగా. యోధులుగా కనిపిస్తూ అదరగొడుతుంటారు. ఆరడుగుల ఎత్తు, ఆరు పలకల దేహాలతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటారు. మరి వారి పక్కన నటించే కథానాయికలంటే ఎలా ఉండాలి? వారు ఆరడుగుల బుల్లెట్లయితే... వీళ్లు ఆరడుగుల చాక్లెట్లలాగా కనిపించాలి. అప్పుడే సన్నివేశం, పాత్రలు రక్తికడతాయి. ఆ విషయాన్ని తెలుసుకునే హాలీవుడ్‌ దర్శకులు ఆరడుగుల సుందరాంగులు ఎక్కడా అంటూ ప్రత్యేకంగా ఆరా తీస్తుంటారు. ఏరి కోరి అవకాశాలు కట్టబెడుతుంటారు. కథానాయికలే కాదు.. సహాయ నటులు కూడా ఆరడుగుల ఎత్తులో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. హాలీవుడ్‌లో ఆరడుగుల సుందరాంగులుగా గుర్తింపు తెచ్చుకొన్న భామల కథేంటో ఓసారి చూద్దాం...
ఆట.. అందం.. 
ఆరడుగులకి కొంచెం ఎక్కువే. ఆర్చెరీలో ఒలింపిక్‌ సెమీఫైనలిస్ట్‌. అందం, ఒడ్డూ పొడుగు ఆమెని రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేశాయి. అమెరికాకి చెందిన జీనా డేవిస్‌... సహాయ నటిగా ఆస్కార్‌ పురస్కారం కూడా సొంతం చేసుకొంది. ‘ద యాక్సిడెంటల్‌ టూరిస్ట్‌’ సినిమాకి గానూ ఆమెకి ఈ పురస్కారం దక్కింది. సహాయ పాత్రలనగానే హాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు జీనానే గుర్తుకొస్తుంటుంది. ఆమె నిలువెత్తు రూపమే ఆమెని హాలీవుడ్‌లో స్టార్‌ని చేశాయి.
..................................................................................................................................................................

కొంచెం తక్కువ అయినా... 
అమెరికాకి చెందిన నటి... ఉమా కరుణ తుర్మన్‌. ఆరడుగులకి ఒక ఇంచ్‌ తక్కువే కానీ... ఆమె ఆకారం మాత్రం చిత్ర పరిశ్రమను బాగా ఆకట్టుకొంటుంది. అందుకే ఆరడుగుల నటుల సరసన ఆమెని ఎంచుకొంటున్నారు. ‘ద యాక్సిడెంటల్‌ హజ్బెండ్, ‘మదర్‌ హుడ్‌’, ‘మై జింక్‌ బెడ్‌’, ‘స్మాష్‌’ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. తెరపై ఆమె రూపం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటుంది.

........................................................................................................................................................................
సూపర్‌ భామ 
సూపర్‌ హీరో అంటుంటాం కదా... అలా ఈ ముద్దుగుమ్మని సూపర్‌భామ అనేయొచ్చు. ‘ఎక్స్‌-మెన్‌’ సిరీస్, ‘గెల్డెన్‌ ఐ’ చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైంది. ఫ్రమ్కే జాన్సన్‌. డచ్‌ నటి అయిన ఆమె 1984లో అమెరికా వెళ్లి స్థిరపడింది. అలాంటి ఈ నటి ఆరడుగుల కథానాయకుల సరసన నటిస్తూనే ఉంది. ఈమె నటి మాత్రమే కాదు, దర్శకురాలు, రచయిత కూడా.


.............................................................................................................................................................................


సిల్వెస్టర్‌ స్టాలోన్‌కి దీటుగా...
డానిష్‌ నటి... బ్రిగిట్టీ నీల్సన్‌. ఆరడుగుల పొడగరి మాత్రమే కాదు... ఈమెని సకల కళావల్లభురాలని చెప్పొచ్చు. మోడల్, గాయని, రియాలిటీషో నిర్వాహకురాలు... ఇలా అన్నీ పాత్రల్లోనూ ఒదిగిపోయింది. ‘రెడ్‌ సోంజా’, ‘రాకీ’, ‘ఎక్సోడస్‌’, ‘ది కీ’ తదితర చిత్రాల్లో చటించి చక్కటి గుర్తింపును సొంతం చేసుకొంది. ఆమె అందం, రూపం, నటనని చూసి సిల్వెస్టర్‌ స్టాలోన్‌లాంటి నటుడు కూడా సెట్‌లో అప్రమత్తంగా వ్యవహరించేవాడట.

......................................................................................................................................................................
ది బాడీ... 
ఎల్లే మ్యాక్‌ఫెర్సన్‌ అంటే ఎంత మంది గుర్తుపడతారో తెలియదు కానీ... ది బాడీ అంటే మాత్రం టక్కున ఆ ఆరడుగుల రూపాన్ని గుర్తు చేస్తారు. ఈమె ఎత్తు, అందం చూసి అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా తెగ ఇదైపోతుంటారు. మోడలింగ్‌తోనే ఎక్కువ ప్రాచుర్యం పొందినా... సినిమా రంగంపైనా తనదైన ముద్రవేసింది. చేసింది తక్కువే అయినా... గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ‘సైరన్స్‌’, ‘ఇఫ్‌ లూసీ సెల్‌’, ‘జేన్‌ ఐరే’, ‘బ్యాట్‌మెన్‌ అండ్‌ రాబిన్‌’ తదితర చిత్రాల్లో చక్కటి పాత్రలు పోషించింది. ‘ది బాడీ’ అని పేరుతో ఆమెకి ఓ బ్రాండ్‌ ఉంది. ఆ బ్రాండ్‌ పేరుతో పలు ఉత్పత్తుల్ని మార్కెట్‌ చేస్తుంటుంది.

........................................................................................................................................................................

హైటుతో దున్నేసింది... 
కాస్త హైటుంటే చాలు... ప్రపంచాన్ని దున్నేయొచ్చని నిరూపించిన మరో అందం - జేన్‌ మేరీ లించ్‌. ఈమె అమెరికాకి చెందిన నటి. గాయని కూడా. తెరపై ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపిస్తూ ఉంటుంది. ‘గ్లీ’, ‘క్రిస్టోఫర్‌’ అనే సినిమాలో ఆమె పోషించిన పాత్రకి విశేష ప్రాచుర్యం లభించింది. ‘ట్యాక్సీ కిల్లర్‌’, ‘వైస్‌ వెర్సా’, ‘ఇన్‌ ది వెర్సా’, ‘ఇన్‌ ది బెస్ట్‌ ఇంట్రెస్ట్‌ ఆఫ్‌ ది చిల్డ్రెన్‌’, ‘స్ట్రెయిట్‌ టాక్‌’, ‘టచ్‌ మి’ తదితర చిత్రాల్లో ప్రేక్షకులకు చేరువైంది.

.........................................................................................................................................................................

వహ్వా... నాన్సీ
హాలీవుడ్‌ తారలు కేవలం నటన తోనే సరిపుచ్చుకోరు. ఇంకా వాళ్లకు చాలా వ్యాపకాలుంటాయి. ఆరడుగుల అందాల భామ నాన్సీగైల్స్‌ కూడా అంతే. ఆమె స్వతహాగా ఓ టీవీ జర్నలిస్టు. సినిమా రంగంలోనూ రాణిస్తోంది. తెరపై గుర్తుండిపోయే పాత్రలెన్నో చేసింది. హాలీవుడ్‌ చిత్రాల్లో తరచుగా మెరిసే ఈ అందాన్ని నవతరం ఆదర్శంగా తీసుకొంటోంది. ‘బిగ్‌’ సినిమాలో ఆమె పాత్ర అందరినీ అలరింపజేసింది.

..........................................................................................................................................................................

లెగ్గీ లేడీ
పొడుగుకాళ్ల సుందరి అంటుంటాం కదా. ఆ మాటకి నిలువెత్తు రూపం... జెర్రీ హాల్‌. ఆరడుగులకిపైనే ఉంటుంది. పదో నెంబర్‌ పాదరక్షలు వాడుతుంటుంది. మోడలింగ్, యాక్టింగ్‌ రంగాల్లో రాణిస్తోంది. ఈమె ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన మిక్‌ జాగ్గర్‌కి మాజీ భార్య కూడా.
 
                             
...............................................................................................................................................................................

ఎంత ఎత్తుకు ఎదిగిందో... 7
అమెరికా నటి... బ్రూక్‌ షీల్డ్స్‌. పన్నెండేళ్ల వయసులోనే తెరపైకి అడుగుపెట్టింది. చిన్నప్పుడే వ్యభిచారిగా నటించింది. దీంతో ఆమె పోషించిన పాత్రపై అప్పట్లో విమర్శలు చెలరేగాయి. పసిప్రాయంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన... బ్రూక్‌షీల్డ్స్‌ పెద్దయ్యాక కూడా అదే స్థాయిలో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకొంది. నటిగా ఈ స్థాయికి చేరుకొన్నానంటే నా ఆరడుగుల ఎత్తే కారణం అని చెబుతుంటుంది బ్రూక్‌.

..............................................................................................................................................................................

తక్కువే అయినా... 
టిల్డా స్వింటన్‌గా పేరు పొందిన లండన్‌ నటి... కేథరిన్‌ మటిల్డా స్వింటన్‌. ‘మైఖేల్‌ క్లేటన్‌’ చిత్రానికి గానూ ఇదివరకు ఆమె ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ పురస్కారం కైవసం చేసుకొంది. ప్రస్తుతం ఈమె వయసు యాభై పైమాటే. కానీ అలా కనిపించదు. నా దేహమే నన్ను ఇలా యవ్వనంగా కనిపించేలా చేస్తోందని చెబుతుంటుంది. సహాయ పాత్రల్ని పోషించడంలో తిరుగులేని నటిగా హాలీవుడ్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది ఈ ఆరడుగుల నటి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.