హాలీవుడ్‌ జల్లులు... వినోదాల చినుకులు
వేసవి సందడి ముగింపుకొచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. హాలీవుడ్‌ చిత్రాల బాక్సాఫీస్‌ చిత్రాల ఫలితాలను చూసుకుంటే ఈ వేసవి రేసులో విజయ పతాకాన్ని రెపరెపలాడించింది తెలుగు చిత్రసీమ అనే చెప్పొచ్చు. ‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’, ‘కాంచన’, ‘మహర్షి’ ఇలా వారానికొకటి చొప్పున వెండితెరపై వరుస హిట్లు పడ్డాయి. ఇక హాలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ సైతం తెలుగు నాట సత్తా చాటింది. రికార్డు కలక్షన్లతో సందడి చేసింది. ఇప్పుడిక సినీప్రియుల చూపంతా ఆగస్టు నెలపైనే పడింది. ఎందుకంటే ‘సాహో’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘కాప్పన్‌’, ‘మన్మథుడు 2’, బన్నీ - త్రివిక్రమ్‌ల ‘ఏఏ 19’ వంటి బడా బడా చిత్రాలన్నీ అప్పుడే బాక్సాఫీస్‌ ముందుకు క్యూ కట్టబోతున్నాయి. మరి ఈ మూడు నెలల గ్యాప్‌లో బాక్సాఫీస్‌ ముందు సినిమాల సందడే ఉండదా? అంటే ఎందుకుండదు!! ఉంటుంది. ఈ కొద్ది నెలల విరామంలో హాయి హాయిగా హాలీవుడ్‌ యాక్షన్‌ హంగామాను రుచి చూసొచ్చేద్దాం..


ఈసారి సమ్మర్‌కు సినీప్రియుల కోసం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’, ‘అల్లాదీన్‌’, ‘గాడ్జిల్లా’ల రూపంలో హాలీవుడ్‌ నుంచి వినోదాల విందు భోజనం అందింది. ఇక ఇప్పుడు మరిన్ని యాక్షన్‌, యానిమేషన్‌ ఎంటర్‌టైనర్లు మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైపోతున్నాయి. 

* అల్లాదిన్‌ బాటలోనే బ్రైట్‌ బర్న్‌...
‘అల్లాదిన్‌’ ప్రేక్షకుల్ని పలకరించి వారం దాటిందో లేదో.. మరో హాలీవుడ్‌ చిత్రం ‘బ్రైట్‌ బర్న్‌’ కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు సందడి చేయబోతుంది. డేవిడ్‌ యొరోవిస్కై దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటికే మెక్సికో, హంగేరి తదితర దేశాల్లో విడుదల కాగా.. మే 29 నుంచి భారత్‌లోని తెరలపై ప్రదర్శితం కాబోతుంది. ఈ చిత్ర కథా నేపథ్యం ఏంటంటే.. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న ఓ దంపతులకు.. ఆకాశం నుంచి రాలిపడిన ఓ ఉల్క వల్ల శక్తిమంతమైన బాలుడు దొరుకుతాడు. వారిద్దరూ ఆ బాబును ఎంతో గారాబంగా పెంచుతారు. కానీ, అతడు స్కూల్లో చేరాక తొటి పిల్లల నుంచి సమస్యలు ఎదరువుతాయి. వారు తరచూ ఆ బాబుతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ రోజు ఇంటి సమీపంలో తోటలో తిరుగుతున్న వాహన చక్రాన్ని పట్టుకొని ఆపుతాడు. దాంతో అతనికున్న శక్తులేంటో తెలుస్తాయి. ఆ తర్వాత తన సూపర్‌ పవర్స్‌తో అతను ఏం చేశాడన్నది చిత్ర కథ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఎలిజబెత్‌ బ్యాంక్స్, డేవిడ్‌ డెడ్‌మ్యాన్, మాట్‌ జోన్స్‌ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.


* జూన్‌.. డబుల్‌ ధమాకా..
జూన్‌ వచ్చిందంటే దాదాపు వేసవి సీజన్‌ ముగిసినట్లే.. స్కూళ్లు, కళాశాలల హడావుడి మొదలైపోతుంది. కాబట్టి ఈ నెలలో ఏ చిత్రసీమ నుంచైనా ఎక్కువగా చిన్న చిత్రాలే విడుదలవుతుంటాయి. అయితే ఈ విద్యా సంవత్సరం మొదలు కావడానికి ముందే హాలీవుడ్‌ నుంచి రెండు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు బాక్సాఫీస్‌ ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అవే ‘ఎక్స్‌మెన్‌: డార్క్‌ ఫొనిక్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌: ఇంటర్నేషనల్‌’. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైన క్రేజ్‌ ఉన్న చిత్రాలైన్పటికీ.. ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ‘ఎక్స్‌మెన్‌’ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఈ సిరీస్‌ నుంచి వస్తోన్న ఆఖరి చిత్రం. 19 ఏళ్లుగా ఈ సిరీస్‌ నుంచి అనేక విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ప్రస్తుతం ‘ఎక్స్‌మెన్‌: డార్క్‌ ఫొనిక్స్‌’తో ఈ సిరీస్‌కు ముగింపు కార్డు వేయాలని నిర్ణయించుకుంది మార్వెల్‌ స్టూడియోస్‌. జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో గత సిరీస్‌ల్లాగే అద్భుతమైన గ్రాఫిక్స్, యాక్షన్‌ హంగులు ప్రేక్షకులకు కనులవిందు అందివ్వబోతున్నాయి. జెన్నీఫర్‌ లారెన్స్, మైఖేల్‌ ఫాస్‌బెండర్, నికోలస్‌ హౌల్ట్, సోఫియా టర్నర్‌ తదితర భారీ తారాగణం ఇందులో ప్రధాన పాత్రలు పోషించింది. ఇక జూన్‌ 14న విడుదల కానున్న ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌: ఇంçర్నేషనల్‌’ కూడా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్‌ను ప్రేక్షకులకు రుచిచూపించనుంది.


* ఓవైపు క్రాల్‌.. మరోవైపు లయన్‌.. మధ్యలో టాయ్‌స్టోరీ!


జులైలో ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు ట్రయాంగిల్‌ వార్‌ జరుగబోతుంది. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే ‘క్రాల్‌’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘టాయ్‌స్టోరీ 4’ వంటి క్రేజీ చిత్రాలు వెండితెరపై అడుగుపెట్టబోతున్నాయి. వీటిలో ముందుగా జులై 12న థియేటర్లలోకి రాబోతుంది ‘క్రాల్‌’. అలెగ్జాండ్రి అజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రమాదకరమైన మొసళ్ల నేపథ్యంతో థ్రిల్లర్‌ చిత్రంగా రూపొందింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంపై హరికేన్‌లు విరుచుకుపడటం.. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తడం.. అనుకోకుండా ఓ మహిళ వరదల నుంచి తప్పించుకోలేక తన ఇంట్లో చిక్కుబడిపోవడం.. ఆ తర్వాత అక్కడికి ప్రమాదకర మొసళ్లు రావడం.. వాటి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె చేసే సాహసాలు ఇలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ‘లయన్‌ కింగ్‌’, ‘టాయ్‌స్టోరీ 4’ రెండూ జులై 19నే ఒకేసారి బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాయి. 1994లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’కు రీమేక్‌గా అదే పేరుతో యానిమేటెడ్‌ ఫాంటసీ రూపంలో వాల్ట్‌ డిస్నీ దీన్ని రూపొందించింది. ‘ది జంగిల్‌ బుక్‌’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు జాన్‌ఫావ్రో నుంచి రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇదే రోజు రాబోతున్న ‘టాయ్‌స్టోరీ 4’ సైతం సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉన్న చిత్రమే. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత టాయ్‌స్టోరీ సిరీస్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మరో ఆసక్తికర విశేషం ఏంటంటే.. తొలి రెండు భాగాల్లో బాగా గుర్తుండిపోయిన బో పీప్‌ అనే బొమ్మ పాత్ర ఈ మూవీలో తిరిగి కనిపించబోతుంది. ఈ చిత్రానికి జోష్‌ కూలే దర్శకత్వం వహించారు.


ఇక జులై తర్వాత బాక్సాఫీస్‌ ముందు సందడి చేయనున్న హాలీవుడ్‌ చిత్రమేదైనా ఉందా అంటే? అది ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా’ను చెప్పుకోవచ్చు. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ నుంచి వస్తోన్న తొమ్మిదో చిత్రమిది. స్ట్రీట్‌ రేసింగ్‌ నేపథ్యంతో యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం.. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, మరాఠి, గుజరాతీ, బెంగాలి భాషల్లో పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతుంది యూనివర్సల్‌ పిక్చర్స్‌ ఇండియా సంస్థ. మరి ఇంకెందుకు ఆలస్యం రానున్న హాలీవుడ్‌ హంగామాను మీరు తనివితీరా ఆస్వాదించేయండి.- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.