జనతా కర్ఫ్యూ పాటిద్దాం.. కరోనాను తరిమేద్దాం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ దాటికి అనేక దేశాల్లో లక్షలాది మంది ఆస్పత్రుల పాలవ్వగా.. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నాయి. దీనికి భారత్‌ కూడా మినహాయింపు కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓవైపు కరోనాను నివారించే చర్యలు చేపడుతూనే.. దేశ ప్రజల రక్షణ కోసం కష్టపడుతోన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇతర రంగాల వారికి సంఘీభావం తెలిపేందుకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీన్ని విజయవంతం చెయ్యాలంటూ సినీ ప్రముఖులు సైతం ప్రధాని పిలుపుకు మద్దతుగా ప్రజలను జాగృతం చేస్తున్నారు. ప్రతిఒక్కరూ జనతా కర్ఫ్యూను ఓ బాధ్యతగా పాటించాలని సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిస్తున్నారు.


*
‘‘కరోనాను నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవా భావంతో పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసులకు, ఆయా ప్రభుత్వాలకు హర్షాతిరేఖాలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపుకు స్పందిస్తూ.. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 వరకు మనమందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిద్దాం. ఇళ్లకే పరిమితమవుదాం. మన కోసం సేవలందిస్తున్న వారికి సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు మన ఇంటి గుమ్మాల్లోకి వచ్చి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిది. ఇది మన ధర్మం. భారతీయులుగా మనమందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జైహింద్‌’’.

- చిరంజీవి


*
‘‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి తమని తాము పణంగా పెట్టిన ఎన్నో ధైర్య హృదయాలకు నమస్కరిద్దాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇళ్లకే పరిమితం అవుదాం. సాయంత్రం 5గంటలకు బాల్కనీల్లోకి వచ్చి కరతాళ ధ్వనులతో వారికి సంఘీభావం తెలుపుదాం. కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం దేశంలోని ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరుతున్నా’’.

- మహేష్‌బాబు


*
‘‘ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో అసాధారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ విపత్తు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సమైక్యతతో ఇంట్లో సురక్షితంగా ఉందాం. దీనికి మద్దతు ఇవ్వాలంటూ నా అభిమానుల్ని, మిత్రుల్ని కోరుతున్నా’’.

- కమల్‌హాసన్‌


*
‘‘ఈ ఆదివారం.. ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు.. నేను జనతా కర్ఫ్యూని పాటించబోతున్నా. మీరూ పాటిస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి సంక్షోభ సమయంలో.. అందరం మన ఇళ్లలోనే ఉండి సంఘీభావం తెలుపుదాం. ఇది మన బాధ్యత’’.

- వెంకటేష్‌


*
‘‘కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి మన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం సామాజిక దూరాన్ని పాటించడం. కరోనాపై పోరులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు (జనతా కర్ఫ్యూ)నకు సంఘీభావంగా మనమూ ఈ ప్రతిజ్ఞ చేద్దాం’’.

- నాగార్జున


*
‘‘విధి విసిరిన సవాల్‌ను దాటుకొని వెü™్ల వారందరినీ ప్రశంసించాల్సిన సమయమిది. కరోనా వ్యతిరేక పోరులో అందరూ ఐక్యంగా ఉండి.. వాళ్లకు సంఘీభావంగా నిలబడదాం. మరింత బాధ్యతగా.. సురక్షితంగా ఇంట్లో ఉండండి’’.

- కొరటాల శివ

* ‘‘ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దాం.. చప్పట్లు కొడుతూ సంఘీభావంతో కరోనాను తరిమికొడదాం’’.

- పరుచూరి గోపాలకృష్ణCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.