తెలుగు తెరకు శ్రుతిమించని హాస్యంతో చక్కలిగిలి పెట్టి, ప్రేక్షకుల హృదయాలలో గిలిగింతలు రేపిన ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల! ‘‘మాటలు రాయడమంటే మాటలు కాదు’’ అని నమ్మి, హాస్యానికీ... అపహాస్యానికి మధ్య ఉన్న సున్నితమైన రేఖను గమనించి సంభాషణాశ్రయ హాస్యాన్ని సృష్టించడంలో పేరుపొందిన పదహారణాల తెలుగు రచయిత, దర్శకుడు జంధ్యాల!
ఇంటిపేరుతో ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరేమిటి... అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పే సమాధానం ఆయనలోని సహజాతమైన హాస్యదృక్పధానికి నిదర్శనం. ‘‘నేను రామానాయుడి సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ సినిమాకు పనిచేసేటప్పుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్...’’ అని చెప్పే జంధ్యాల పూర్తి పేరు జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. హాస్యానికి పెద్ద పీట వేస్తూనే, సందర్భోచితంగా మాటలు రాసి మెప్పించడం, వైవిధ్యమైన పాత్రల్ని సృష్టించడం జంధ్యాలకు నవ్వుతో అబ్బిన విద్య. 1976 నుంచి 2000 సంవత్సరం వరకూ తెలుగు చలనచిత్రసీమలో జంధ్యాల పూయించిన మాటలు, హాస్య ప్రియుల మనసుల్లో ఇప్పటికీ పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. చలనచిత్ర రచయితగా రంగ ప్రవేశం చేయక ముందు ‘‘ఏక్ దిన్ కా సుల్తాన్’’, ‘‘గుండెలు మార్చబడను’’ వంటి హాస్యనాటక రచయితగా ప్రసిద్ధుడైన జంధ్యాల, హాస్య సంభాషణాచతురుడు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కళ్ల వెంట నీరు తెప్పిస్తే ఆ సభలోనే అతిథిగా పాల్గొన్న జంధ్యాల, వారి తర్వాత మాట్లాడుతూ ‘‘ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని’’ ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయిట. అదీ జంధ్యాల సమయ స్ఫూర్తి.

సిరిసిరిమువ్వ సినిమాతో మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన జంధ్యాల, 1983లో 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాసి ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. అతి తక్కువ సమయంలో, ఒక సినిమాకు సంపూర్ణంగా సంభాషణలు సమకూర్చగలిగిన మాటకారి జంధ్యాల. తెలుగు సాహిత్యం మీదా, వాడుక భాషమీదా ఉన్న విశేషమైన పట్టుతో ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభోదయం’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘అడవిరాముడు’, ‘వేటగాడు’, ‘సీతాకోకచిలుక’, ‘శుభలేఖ’, ‘సాగరసంగమం’, ‘అనందభైరవి’, ‘పడమటి సంధ్యారాగం’, ‘ఆపద్భాంధవుడు’, ‘రెండు రెళ్లు ఆరు’, ‘వివాహభోజనంబు’, ‘ముద్దమందారం’ చిత్రాలకు జంధ్యాల రాసిన సందర్భోచితమైన సంభాషణలు విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ఆయన కలం హాస్యరసాన్ని ఎంత బాగా పండించగలదో, లోతైన భావాలతో కూడిన, కరుణ రసాత్మక సంభాషణల్నీ అంత హృద్యంగానూ సమ కూర్చగలదు. సంభాషణా రచయితగా దాదాపు 350 చిత్రాలకు రాసిన సంభాషణలు, అద్భుత కథా కథనాలతో తీర్చిదిద్దిన 39 చిత్రాలు జంధ్యాల సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలు. సినిమా చూసొచ్చి ‘‘శ్రీ లలితా శివ జ్యోతి పిక్చర్స్ వారి లవకుశ, తారాగణం ఎన్టీ రామారావు, అంజలీదేవి... సౌండ్ రికార్డింగ్ వెస్ట్రేక్స్ ఆడియో...దుస్తులు పీతాంబరం...ఔట్ డోర్ యూనిట్ ఆనంద్ సినీ సర్వీసెస్...పోరాటాలు జూడో రత్నం...’’ అంటూ వర్ణించే స్త్రీ పాత్ర, చిన్నతనంలోనే తప్పిపోయిన తన కొడుకు జ్ఞాపకాలను ఎవరైనా గుర్తు చేస్తే ‘బాబూ చిట్టీ’ అంటూ తన్మయత్వంతో రెచ్చిపోయే తల్లిపాత్ర, ‘‘నేను కవయిత్రిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కాదన్నవాడ్ని రాయితో కొడతా’’...అంటూ నినదించే కవయిత్రి, పీనాసితనానికి పరాకష్టగా చెప్పుకోదగిన సీతాపతి వంటి వైవిధ్యమైన పాత్రల్ని సృష్టించి ‘హాస్యబ్రహ్మ’ బిరుదాన్ని¬ సార్ధకం చేసుకున్నారు జంధ్యాల. రచయితగా, దర్శకుడిగా, గాత్రదాతగా, నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకుని, ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అని నమ్మడమే కాకుండా ఆచరించి, తన పద చమత్కారంతో, మనందరి మనసుల్లోనూ చిరంజీవిగా మిగిలారు హాస్యరసజ్ఞ చక్రవర్తి జంధ్యాల!

మెచ్చుతునకలు
‘‘కృష్ణ గోదావరుల్లో ప్రవహించేది నీరు కాదు..కన్నీరు..కట్నం ఇచ్చుకోలేని కన్నెపిల్లల కన్నీరు’’!
- రెండు జళ్ళ సీత
‘‘ఈ సుత్తి అనే పదం కలియుగంలోది కాదమ్మా... త్రేతాయుగంలోనిది. వనవాసానికి వెళ్లిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవికి వెళ్లాడు. అక్కడ రాములవారిని కలిసి ‘‘అయ్యా నువ్వు వెనక్కు తిరిగొచ్చేసి...రాజ్యమేలుకో తండ్రీ’’ అనడిగాడు. దానికి శ్రీరామచంద్రుడు ‘‘తమ్ముడూ భరతా! పితృ వాక్య పరిపాలనదక్షుడైన ఓ పుత్రిడిగా... సత్యశీలత కలిగిన ఓ వ్యక్తిగా... ఆడిన మాట తప్పని ఓ మనిషిగా... జాతికి నీతి నేర్పగల ఓ పుణ్యపురుషుడిగా... ప్రజల శ్రేయస్సు కాంక్షించే ఓ రాజకుమారుడిగా... నాన్నగారి మాట నేను జవదాటలేను. తమ్మూడూ! నేను రాజ్యానికి రాను... రాజ్యానికి రాలేను’’ అని చెప్పాడు. ఆ వాక్ప్రవాహానికి శోష వచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని ‘‘అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా... ఇంత సుత్తి ఎందుకూ?’’ అన్నాడు. ఇలా ఆ భరతుడి నోట్లోంచి రాలిన ‘సుత్తి’ భారతదేశంలో వాడుకలోకొచ్చిందన్న మాట.
అమ్మా... ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయి. ఒక్కోడు ఠంగు ఠంగుమని గడియారం గంటకొట్టినట్టు సుత్తేస్తాడు..మీ నాన్నగారిలా..దాన్ని ఇనుప సుత్తి అంటారు. అంటే ఐరన్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేసినట్టు తెలీయకుండా మెత్తగా వేస్తాడు, రబ్బరు సుత్తి. అంటే...రబ్బర్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు అందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు, సామూహిక సుత్తి. మాస్ హేమరింగ్ అన్నమాట. అంటే... రాజకీయనాయకుల మీటింగులు ఈ టైప్ అన్నమాట. పోతే... ఇంకో టైప్ ఉంది. మీ నాన్నగారు సుత్తేద్దామని వచ్చారనుకో! నేనే ఎదురు తిరిగి సుత్తేశాననుకో! ఉత్తినే అనుకుందాం. ఇది జరిగేపని కాదనుకో. దీన్ని ఎదురు సుత్తి అంటారు. రివర్స్ సుత్తి అంటారు. రివర్స్ హేమరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా. అంటే...ప్రొలాంగ్డ్ హేమరింగ్ అన్నమాట!
- నాలుగు స్తంభాలాట
‘‘ఆకలేసిన బాబు ‘అమ్మా’ అని ఒకలా అంటాడు... ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ ‘అమ్మా’ అని మరొకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు ‘అమ్మా’ అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది.. శ్రుతి వుంది.. స్వరం వుంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండివుంది దాసూ.. తాదాత్మ్యం చెందిన ఒక మహా మనిషి గుండె లోతుల్లోంచి గంగా జలంలా పెల్లుబికిన గీతమది, రాగమది. మిడిమిడి జ్ఞానంతో, ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చెయ్యకయ్యా! మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని అపభ్రంశం చెయ్యకు!’’
- శంకరాభరణం
‘‘పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు రుషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యలా మలిచేవాడు మనిషి’’
− సాగరసంగమం
‘‘పురోహితుడికి నత్తి, మన (వేశ్య)కి భక్తీ ఉండకూడదు!’’
- శంకరాభరణం
- పున్నమరాజు