నేను తీసిన సినిమాను పాఠంగా చెప్పారు!
కథానాయకుడు అతనే..
ప్రతినాయకుడు అతనే..
దర్శకుడు అతనే..
దర్శకుడు సృష్టించే పాత్రా అతనే..
గడ్డానికి అందం తెచ్చిందీ అతనే..
గడ్డమంటే గుర్తుకొచ్చేదీ అతనే..
నటనలో చక్రవర్తి.. అతనే మన జేడీ చక్రవర్తి.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి, ‘శివ’తో ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారనే విషయం దగ్గరి నుంచి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..


(మర్చిపోయినవన్నీ గుర్తు చేస్తున్నారుగా అని జేడీ చక్రవర్తి అనడంతో...)

* ఏం మర్చిపోయారు..? హీరోయిన్లను మర్చిపోయారు?
జేడీ చక్రవర్తి: హీరోయిన్లను ఎప్పుడూ మర్చిపోలేదు. మగవాళ్లందరినీ మర్చిపోతా.. ‘ఐ హేట్‌ మెన్‌’. మీరు(ఆలీ) కూడా గుర్తులేరు. కానీ, మీ వాయిస్‌ మాత్రమే గుర్తుంది(నవ్వులు)

* మిమ్మల్ని కొందరు గడ్డం జేడీ చక్రవర్తి అనీ, గడ్డం జేడీ అనీ, గడ్డం చక్రి అనేవాళ్లు ఎందుకని గడ్డం తీసేశారు?
జేడీ చక్రవర్తి: ఇటీవల విహారయాత్రలో భాగంగా సిమ్లా వెళ్లా. వాతావరణం బాగా వేడిగా ఉంది కదాని గడ్డం తీసేశా. కానీ, అక్కడకు వెళ్లిన తర్వాత చాలా చల్లగా ఉంది.

* మీకు పెళ్లయిందా?
జేడీ చక్రవర్తి: మనలో మనమాట ఇప్పుడు పెళ్లి గురించి అవసరమా? (నవ్వులు)

* మొదటిసారి వెండితెరపై కనిపించింది ‘శివ’తోనేనా? రాంగోపాల్‌ వర్మను ఎలా కలిశారు?
జేడీ చక్రవర్తి: ఇండస్ట్రీకి రాకముందు నుంచీ నేనూ ఉత్తేజ్‌ ఫ్రెండ్స్‌. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్‌ అయిపోదామని కోరిక. అయితే, ఎలా వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియదు. కానీ, మద్రాసు వెళ్లాలి. ఇలాంటి సమయంలో ఒకరోజు ఉత్తేజ్‌ కలిసి ‘ఒరేయ్‌! నేను ఒక కొత్త దర్శకుడి దగ్గర పని చేస్తున్నా. ఆయన రేపు మద్రాసు వెళ్తున్నారు. అందుకే రేపు ఉదయం 10-10.30గం.లకు నువ్వు అన్నపూర్ణా స్టూడియోస్‌కు వచ్చేసెయ్‌’ అన్నాడు. అప్పట్లో నాకు ఫియెట్‌ కారు ఉండేది. దాన్ని వేసుకుని ఉత్తేజ్‌ చెప్పిన ఫ్లోర్‌ దగ్గరి వెళ్లా. అప్పటికే అక్కడ 20 మంది లైన్లో నిలబడి ఉన్నారు. నన్ను నేరుగా రమ్మనడంతో లైన్‌లో కాకుండా పక్క నుంచి వెళ్లిపోతున్నా! అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి నన్ను ఆపి ‘ఏయ్‌ ఎక్కడికి వెళ్తున్నావ్‌’ అన్నాడు. ‘లోపల ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పా. ‘అదే ఫ్రెండ్‌ను మేమూ కలవడానికి వచ్చాం. వచ్చి మా వెనక నిలబడు’ అన్నాడు. అతనెవరో కాదు.. కాదంబరి కిరణ్‌కుమార్‌. అప్పుడే లోపలి నుంచి ఉత్తేజ్‌ వచ్చి, ‘మా సర్‌ మద్రాసు వెళ్తానన్నాడు కానీ, వెళ్లలేదు’అని నన్ను పక్క కాటేజీకి తీసుకెళ్లాడు.


*నేను అక్కడ కూర్చొని ఉంటే సడెన్‌గా ఓ వ్యక్తి వచ్చారు. ‘మీరు యాక్టరా?’
అని అడిగారు. ‘అవును’ అని చెప్పా. ‘ఇంతముందు నటించారా’ అని అడిగితే ‘లేదు’ అన్నా. ఇంతలో ఉత్తేజ్‌ వచ్చి నన్ను పరిచయం చేశాడు. ‘ఏదైనా సీన్‌ చేసి చూపిస్తారా’ అని ఆయన అడిగితే, ‘మీరు ఇస్తే చేస్తా’ అనడంతో ఉత్తేజ్‌ను పంపి సీన్‌ పేపర్లు తెప్పించారు. అప్పటికి నాకు నటించడం అస్సలు తెలియదు. ఆ పేపర్‌ చూసి, ‘రేపు వచ్చి చేసి చూపించవచ్చా’అని అంటే, ‘సరే’ అన్నారు. కానీ, నాతో పాటు ఉత్తేజ్‌ మాత్రం రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ‘జ్యోతి చిత్ర’ మ్యాగజైన్‌ చూస్తే అందులో ‘శివ’ అని పేరు వేసి, ‘కొత్త నటులు కావాలి’ అని ఉత్తేజ్‌ చెప్పిన దర్శకుడు పేరు కనిపించింది. అదే రాంగోపాల్‌ వర్మ. ఆ రోజు ఆయన చెప్పిన సీన్‌ బాగా ప్రిపేర్‌ అయి స్క్రీన్‌ టెస్ట్‌కు వెళ్తే, చాలా వరెస్ట్‌గా చేశా. ఆయన కెమెరా అనగానే డైలాగ్‌ చెప్పేసేవాడిని. ‘ముందు కెమెరా.. అని చెబుతాం.. యాక్షన్‌ అని చెప్పిన తర్వాత మీరు డైలాగ్‌ చెప్పాలి’ అనడంతో ‘సరే’నన్నా. అయినా కూడా ఏడెనిమిది టేక్‌లు తీసుకున్నా. చాలా దరిద్రంగా చేశాననిపించింది. ‘రేపు 4గంటలకు రండి రిజల్ట్‌ చెబుతాం’ అన్నారు. నేను చాలా బాధతో ఇంటికి వెళ్లి పడుకున్నా. ఇంతలో మా అమ్మ, అక్క బయటకు వెళ్లి వచ్చి ‘ఏరా స్క్రీన్‌ టెస్ట్‌ ఎలా జరిగింది’ అని అడిగారు. ‘ప్చ్‌’ అని నిట్టూర్చా! అయితే మా అక్కకు నాపై చాలా నమ్మకం. ‘నీకు అవకాశం ఇచ్చే అదృష్టం వాళ్లకు లేదా’ అన్నది.


మరుసటి రోజు రామూగారు పిలిచి ‘మీకు వేషం ఇవ్వకూడదని 3.40గం.కు నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. ‘ఇవ్వనిదానికి 3.40గం.కు తీసుకుంటే ఏంటీ?
ఎప్పుడు తీసుకుంటే ఏంటీ’ అని మనసులో అనుకున్నా. ఆయన చెప్పినదానికి నేనేమీ షాకైపోలేదు. ‘సరేనండీ’ అన్నా. ఎందుకంటే నేను చాలా దరిద్రంగా చేశానని నాకూ తెలుసు. తిరిగి వెళ్లిపోతుంటే ‘హలో! ఎక్స్‌క్యూజ్‌ మీ! నేను 3.49కి ఏమనుకున్నానో మీకు చెప్పలేదు కదా’ అని రామూగారు అంటూ, ‘మీకు వేషం ఇద్దామనుకున్నా’ అన్నారు. దానికీ నేనేమీ రియాక్ట్‌ కాలేదు. అలా నాకు తొలి అవకాశం వచ్చింది.

* తొలిసారి నాగార్జునతో చేస్తున్నప్పుడు మీకెలా అనిపించింది?
జేడీ చక్రవర్తి: ఇక్కడ మీకు తప్పకుండా ఓ నిజం చెప్పాలి. సినిమాలో మీరు చూసే ఉంటారు.. మా ఇద్దరి మీదా తొలిసారి ఇరానీ కేఫ్‌లో ఫైట్‌ సీన్‌ తీశారు. అది కూకట్‌పల్లిలో తీశారనుకుంటా. చాలా మంది జనం కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు నాగార్జునగారు భోజనం చేసి అప్పుడే వస్తున్నారు. నేను ఇరానీ కేఫ్‌లో నుంచి బయటకు వస్తున్నా. ఆయన వస్తున్నారని నేను చూడలేదు. అనుకోకుండా నా భుజం ఆయనకు తగిలింది. సాధారణంగా నాగార్జున చాలా మంచి వారు. కానీ, అప్పుడు ‘ఏయ్‌ ఎటు చూసి నడుస్తున్నావ్‌’ అన్నారు. ‘నేను చూసుకోలేదండీ’ అంటే, ‘తగిలిన వెంటనే సారీ చెప్పాలని తెలియదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌? మర్యాదగా మాట్లాడు’ అని అన్నారు. ‘మీరు కూడా మర్యాదగా మాట్లాడండి’ అని నేను అంటే, ‘ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావ్‌’ అని లాగి పెట్టి కొట్టారు. నేను షాకైపోయా. లేచి ఆయన కాలర్‌ పట్టుకున్నా. ఇద్దరం ఒకరి కాలర్‌ ఒకరు పట్టుకుని తోసుకున్నాం. నాగార్జునగారు నన్ను కొడుతున్నారు. మధ్యలో నేనూ ఆయనను కొడుతున్నా. అది చూసి అన్నపూర్ణా స్టూడియోస్‌లో పనిచేసే డ్రైవర్లు నన్ను కొట్టడానికి రాడ్లు తీసుకొచ్చారు. దాదాపు 15నిమిషాలకు పైగా చాలా పెద్ద గొడవ జరిగింది. వాళ్లంతా ఒక్కసారిగా నన్ను కొట్టాడానికి రావడంతో, నాగార్జునగారు నన్ను గట్టిగా పట్టేసుకుని ‘ఏయ్‌ మీరంతా వెళ్లిపోండి’ అని వాళ్లను పంపించేశారు. అసలు విషయం ఏంటంటే.. బాగా జనం రావడం వల్ల అసలు షూటింగ్‌ చేయలేకపోతున్నాం. ఆ ఫైట్‌సీన్‌ రియలిస్ట్‌గా తీయాలని రాముగారు అనుకున్నారు. దీంతో షూటింగ్‌ ఆపేసి, కెమెరాలు రెండూ పైన పెట్టారు. ‘మీరు ఏం చేస్తారో తెలియదు. ఫైట్‌ స్టార్ట్‌కావాలి. అందరూ నమ్మాలి. అది రియల్‌ ఫైట్‌ అనుకోవాలి’ అన్నారు. అది మా ఇద్దరి మధ్య జరిగిన మొదటి సీన్‌. ఆ సీన్‌ చేస్తున్నామని అక్కడున్న ఐదారుమందికి తప్ప ఎవరికీ తెలియదు.

‘* శివ’ రిలీజ్‌ అయిన తర్వాత మీ పొజిషన్‌ ఏంటీ?
జేడీ చక్రవర్తి: హిందీ ‘శివ’ చేద్దామని లొకేషన్లు చూడటానికి నేనూ రాముగారూ వెళ్తున్నాం. కారులో ఆయన నా పక్కన కూర్చొన్నారు. ఆయన డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ అని ఎవరికీ తెలియదు. కారు ఎక్కడ ఆగినా అందరూ వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఆయన్ను వదిలేసి నాతో మాట్లాడుతున్నారని నాకు భయం వేసింది. ‘శివ’ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక మంచి సినిమా చేయడం అదృష్టమైతే, ఒక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీతో చక్రవర్తిగా ఉన్న నా పేరు జేడీ చక్రవర్తిగా మారడం నిజంగా ఆనందం. మా ఇంటిపేరు అసలు జేడీ కాదు.


* మీ అసలు పేరు ఏంటి?
జేడీ చక్రవర్తి: శ్రీనివాస చక్రవర్తి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మానాన్నగారిది రాజమండ్రి. అమ్మది విజయవాడ. ఆయన అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. మా అమ్మ గురించి చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. మూడు ఎంఏలు, రెండు పీహెచ్‌డీలు చేశారు. ప్రొఫెసర్‌గా పనిచేశారు. చాలా ఎక్కువ చదివేశారు. ‘పండిత పుత్ర పరమశుంఠ’ అన్నది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది.(నవ్వులు)

‘* గులాబి సినిమా ప్రొడ్యూస్‌ చేస్తే నీ కోసమే చేయాలి. కృష్ణవంశీపై నాకు నమ్మకం లేదు’ అని వర్మ అన్నారట నిజమేనా?
జేడీ చక్రవర్తి: మీరు చెప్పింది నిజమే! ‘గులాబి’ కథ కూడా రామూగారికి తెలియదు. నన్ను నమ్మి సినిమా చేశారు. కేవలం ఫస్ట్‌ కాపీ మాత్రమే చూశారు. మూవీ విడుదలైన తర్వాత కూడా చూడలేదు. అంటే మీ మీద ఆయనకు ఉన్న నమ్మకం ఏంటి?
జేడీ చక్రవర్తి: ఈ ప్రశ్న మీరు రామూగారిని అడగాలి. బహుశా నా జడ్జిమెంట్‌ మీద నమ్మకం ఉందేమోనని నేను అనుకుంటున్నా? ‘నన్ను నమ్మి ఎందుకు చేస్తున్నారు’ అని అడిగితే ‘గులాబి’ ఉండేది కాదు. నేను ఏ ‘జిలేబి’నో చేసుకోవాల్సి వచ్చేది(నవ్వులు)

* ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గొప్ప సింగర్‌ అని చెప్పడానికి మీరు ఎందుకు పాటలు పాడారు? ఎందుకంత దారుణానికి ఒడిగట్టారు?
జేడీ చక్రవర్తి: మీ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో అది దారుణం. నా వైపు నుంచి చూస్తే, అది కరుణాత్మకమైన విషయం. బాలూగారు గొప్ప సింగర్‌ అని ఎలా నిరూపించాలి? అందుకే నాలాంటి వాడు ఒకడు పాడితేగానీ ఆయన మహానుభావుడు అని తెలియదు. వేరేవాళ్లకు ఎందుకా ప్రాబ్లం అని ‘మనీ’ సినిమాలో నేనే మూడు పాటలు పాడా.

* రాఘవేంద్రరావుని ఎక్కడ కలిశారు?
జేడీ చక్రవర్తి: నేను ఆయనను ముద్దుగా రాఘు అని పిలుచుకుంటా. మేము కలిసినప్పుడు ‘జేడీ చక్రవర్తి చాలా పెద్ద పేరు. చక్రి అని పిలవవచ్చా’ అన్నారు. ‘కె.రాఘవేంద్రరావు పెద్ద పేరు రాఘు అని పిలవవచ్చా’అని నేను అన్నా. ‘ఒకే’ అన్నారు. ‘బొంబాయి ప్రియుడు’ కోసం తొలిసారి మేము కలిసినప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ ఇది. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్‌ అయ్యాం. ఈ సినిమాకు ఆయనే నిర్మాత. ‘శ్రీదేవిగారితో మీరు చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలు నాకు చెబితే రెమ్యునరేషన్‌ తగ్గిస్తా’ అని ఆయనతో అన్నా.

* మమతా మోహన్‌దాస్‌తో పెద్ద గొడవైందని విన్నాం నిజమేనా?
జేడీ చక్రవర్తి: మీరు విన్నది నిజమే! కానీ, అది పెద్ద గొడవ కాదు. ‘హోమం’ సినిమాకు దర్శకత్వం చేస్తున్నప్పుడు నేను చేసే ప్రతి సన్నివేశం, పాట గురించే నటీనటులకు, టెక్నీషియన్లకు ముందే చెబుతా. అవన్నీ ముందే మమతకు ఇచ్చేశా. తను కూడా ఒప్పుకొంది. అయితే, షూటింగ్‌ వెళ్లే సరికి ఒక పాట చేయనంది. నేనేదో అసభ్యకర సన్నివేశాలు చేయమంటే అర్థముంది. నేను కథలో చెప్పనిది తీస్తున్నా చేయననడం సమంజసం. కానీ, అన్నీ ముందే చెప్పా. దాంతో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చా. ఆ తర్వాత అదే పాట తనతో తీశా.

* ‘గులాబి’ సినిమా కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నారట!
జేడీ చక్రవర్తి: మిగతావన్నీ మీకు తెలియడం ఒక ఎత్తయితే, ఈ విషయం తెలుసుకున్నందుకు మీకు నిజంగా హ్యాట్సఫ్‌. ఇది చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. 1995-96 సమయంలో ఇల్లు అమ్మడానికి ప్రయత్నించా. ‘గులాబి’ కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. దాన్ని తీసుకుని ఒక నిర్మాత దగ్గరకు వెళ్లా. ఆయన అప్పటికి యాక్టర్‌ అవ్వలేదు. కథంతా విని, చాలా బాగుందని చెప్పి, ‘రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది’ అన్నారు. ఆయనే నటుడు దువ్వాసి మోహన్. నేను ఇల్లు అమ్ముతున్నానని తెలిసి రామూ గారు నన్ను పిలిచి తిట్టి ఆయన సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.

* నటుడిగా బిజీగా ఉన్న సమయంలో ఎందుకు దర్శకత్వం చేయాలనిపించింది?
జేడీ చక్రవర్తి: ‘శివ’ సినిమాతో యాక్టర్‌గా పరిచయం అవుతూనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశా. అది చాలా మందికి తెలియదు. ‘క్షణ క్షణం’, ‘గోవిందా గోవిందా’ ఇలా రామూగారు చేసిన ప్రతి సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా ఆ తర్వాత ‘సత్య’కు కో-డైరెక్టర్‌గా, ఎడిటింగ్‌, సౌండ్‌ డిజైనింగ్‌ కూడా చేశా. దాని తర్వాతే డైరెక్టర్‌గా మారా. దాదాపు 18 ఏళ్లు సహాయ దర్శకుడిగా పనిచేసిన తర్వాతే మెగాఫోన్‌ పట్టా. అంతేకానీ, నేరుగా దర్శకుడిని అయిపోలేదు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. 2008లో ‘డర్నా జరూరియా’అనే సినిమా డైరెక్ట్‌ చేశా. దాన్ని న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పాఠంగా పెట్టారు. అది నిజంగా నాకు గొప్ప అచీవ్‌మెంట్.



* నటుడికి విరామం తీసుకోవడం ఇష్టం ఉండదు. కానీ మీరు ఎక్కువ విరామం తీసుకుంటున్నారు?
జేడీ చక్రవర్తి: ఏదైనా నాకు నచ్చాలి. అప్పుడే చేస్తా. అప్పట్లో నేను, సుస్మితా సేన్‌ ‘వాస్తు శాస్త్ర’ అని ఒక సినిమా చేశాం. అక్కడ పక్కనే షారుఖ్‌ ‘వీర్‌ జరా’ షూటింగ్‌ జరుగుతోంది. ఆయన నా సెట్‌కు వచ్చారు. ఇద్దరం ఒకరికొకరు హాయ్‌ చెప్పుకున్నాం. ఆ తర్వాత నేను పక్కకు వెళ్లిపోయి, నా డైలాగ్‌లు చూసుకుంటున్నా. మధ్యలో ఒకసారి మాట్లాడి వెళ్లిపోయారు. మళ్లీ 20 నిమిషాల తర్వాత వచ్చి ‘చక్రి కాస్త ఎక్కువైంది కదా’ అన్నారు. ‘ఏంటి?’ అన్నా. ‘చాలా సేపటి నుంచి చూస్తున్నా. నేను వచ్చినా కూడా నువ్వు నీ డైలాగ్‌లు చూసుకుంటూ ఉన్నావు. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు’ అని అడిగారు. ‘నేను కెమెరా ముందుకు వచ్చే ప్రతి సమయంలోనూ నటుడిగా నాకు టెన్షన్‌ ఉంటుంది. అది లేని రోజున సినిమా చేయకూడదని నా ఫీలింగ్‌’ అని చెప్పా. నన్ను గట్టిగా పట్టుకుని ‘నాకు మాత్రమే ఆ ఫీలింగ్‌ ఉందేమోననుకున్నా’ అన్నారు. అందుకే నేనే ఏ సినిమా చేసినా, నాకో కిక్‌, మంచి ఫీలింగ్‌ ఉండాలి. అప్పుడే చేస్తా. ‘హిప్పీ’ కూడా అందుకే ఒప్పుకొన్నా.

* అప్పట్లో చిరంజీవి ఇంటికి వెళ్లి ‘మిస్టర్‌ చిరంజీవి. ఐయామ్‌ కమింగ్‌ టు ఫిల్మ్‌ ఇండస్ట్రీ’ అని గట్టిగా అరిచారట!
జేడీ చక్రవర్తి: ‘మిస్టర్‌’ ఒకటి మీరు యాడ్‌ చేశారు. నేను ఆయనకు వీరాభిమానిని. కంప్యూటర్లు, గూగుల్‌ రాకముందు ఆయన నాకు ఫోన్‌ చేసి ‘చక్రవర్తిగారు. మన అభిలాష ఎప్పుడు రిలీజ్‌ అయిందంటారు’ అంటూ ఆయన సినిమాల గురించి అడిగేవారు. అంతలా ఆయన సినిమాలపై నాకు పట్టు ఉండేది. నాలాంటి నటులకు ఆయన స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇంటి ముందుకు వెళ్తే, ఆయన నటనలో కనీసం 10శాతం అయినా నాకు వస్తుందని నమ్మేవాడిని. అలా భారతీరాజా ఇంటి ముందుకు కూడా వెళ్లేవాడిని. ఎందుకంటే ఆయన కారులో వెళ్తూ, సడెన్‌గా ఆపి ‘నువ్వు నటుడివి అవుతావు’ అంటారట. నేను వెళ్లిన సమయంలో ఒక్కసారి కూడా ఆయన అటుగా కారులో వెళ్లలేదు(నవ్వులు)

* జేడీ చక్రవర్తి ఖర్మ సిద్ధాంతాలను నమ్ముతాడా? వర్మ సిద్ధాంతాలను నమ్ముతాడా?
జేడీ చక్రవర్తి: వర్మ సిద్ధాంతాన్నే నమ్ముతా. ఎందుకంటే నేను పనిచేసింది వర్మగారి దగ్గర కదా! అందుకే ఆయన సిద్ధాంతాలను నమ్ముతా.

* అంటే ఆయనను ఫాలో అవడం కరెక్ట్‌ అంటారా? ఎంతవరకూ ఆయన్ను ఫాలో అవుతారు?
జేడీ చక్రవర్తి: సిద్ధాంతం వేరు. ఫాలో కావడం వేరు. నాలో ఉన్న మంచి క్వాలిటీలు అన్ని ఆయనవే. చెడ్డ క్వాలిటీలు అన్నీ నావి. (మధ్యలో ఆలీ అందుకుని.. ‘నాలో ఒక్క మంచి క్వాలిటీ కూడా ఉండదు’ అని చెప్పారు) అలా చెప్పడమే మంచి క్వాలిటి. ‘నాలో మంచి లక్షణాలు లేవు’ అని చెప్పే ధైర్యమున్న మగాడిని చూపించండి.


* శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్లమ్మ మిమ్మల్ని అడిగారట!
జేడీ చక్రవర్తి: ఇది మీకెలా తెలుసు. ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకో’ అని శ్రీదేవిగారి తల్లి వచ్చి నన్ను అడిగిన మాట వాస్తవమే! ‘గులాబి’ జరుగతున్న సమయంలో మహేశ్వరి, వాళ్ల మదర్‌ నన్ను శ్రీదేవి ఇంటికి లంచ్‌కు రమ్మని పిలిచారు. అప్పుడు శ్రీదేవి ఇంట్లో లేరు. అప్పటికి కొన్ని రోజుల ముందు శ్రీదేవి మదర్‌కు బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేశారు. అప్పుడు చిన్న తప్పు జరిగింది. ఒకవైపు చేయాల్సిన ఆపరేషన్‌ మరోవైపు చేశారు. నేను లంచ్‌ వెళ్లినప్పుడు ఆమె తలుపు తీసి ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా’ అని అడిగారు. ఆమె ఉన్న పరిస్థితుల్లో అలా అడగటం నిజంగా బాధాకరమైన విషయమైనా, ‘శ్రీదేవిని పెళ్లి చేసుకో’ అని అడగటం నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ఇది నిజంగా జరిగింది.

* శ్రీదేవితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
జేడీ చక్రవర్తి: మేమిద్దరం బయట ఎక్కడ కలిసినా, ఎవరో ఒకరు నన్ను ఆమెకు పరిచయం చేస్తూ ఉండేవారు. అయితే, ఒకసారి ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్‌ను మాత్రం మర్చిపోలేను. ‘మనీ’ సినిమా చూసిన తర్వాత ‘నాకు ఇద్దరు బెస్ట్‌ యాక్టర్స్‌ మాత్రమే తెలుసండీ. ఒకటి కమల్‌. ఇప్పటి నుంచీ ఈ అబ్బాయి’ అన్నారు. నాకు చాలా ఆనందమేసింది.

* త్వరలో ఏదైనా సినిమా డైరెక్ట్‌ చేస్తున్నారా?
జేడీ చక్రవర్తి: అవును! చేస్తున్నా. రామూగారు, కృష్ణవంశీతో ‘నక్షత్రం’ తీసిన వేణుగారు కలిసి ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ నుంచి హిందీలో ఒకటి చేయబోతున్నా. హీరో ఇతర వివరాలు త్వరలో చెబుతా.

* మీ కెరీర్‌లో మిమ్మల్ని బాగా నిరాశకు గురిచేసిన సినిమా ఏది?
జేడీ చక్రవర్తి: ‘నవ్వుతూ బతకాలిరా’. దేవిశ్రీ ఇచ్చిన పాటలు చాలా బాగుంటాయి. తమిళంలో ప్రభుదేవా చేసిన సినిమా అది. దీంతో ఉత్సాహంగా చేశా. ఆ తర్వాత బాధపడ్డా.

* మరి మీ కెరీర్‌లో అద్భుతమైన సినిమా?
జేడీ చక్రవర్తి: ‘గులాబి’. హిట్‌.. ఫ్లాప్‌లను పక్కకు పెడితే.. ‘ఇది మన కెరీర్‌కు చాలా చాలా ఉపయోగపడుతుంది’ అని అనిపించిన సినిమా ఇది. ఇక నా కెరీర్‌లో మంచి సినిమా అంటే ‘సత్య’. అలాంటి చిత్రం రాదు.. ఉండదు.. ఇక రాదు కూడా. ఈ ప్రపంచంలో 100 బెస్ట్‌ ఫిల్మ్స్‌ అని హాలీవుడ్‌ వాళ్లు పుస్తకం ప్రచురిస్తే, అందులో ఇండియా నుంచి ‘మదర్‌ ఇండియా’, ‘షోలే’, ‘సత్య’ ఈ మూడు చిత్రాలే ఉన్నాయి. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఈ సినిమాను రెండుసార్లు చూశారు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ తీసిన డానీ బోయల్‌ ఏకంగా 42సార్లు చూశారట. అది నిజంగా ఒక కల్ట్‌ మూవీ.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

శివ
: క్లాసిక్‌
రాంగోపాల్‌వర్మ: కల్ట్‌
గడ్డం: నా ప్రాపర్టీ
అమ్మ: నా లైఫ్‌
పొగరు: నా అసెట్‌
అమ్మాయిలు: నా వీక్‌నెస్‌
అబ్బాయి: నా హేటర్స్‌
పెళ్లి: అవసరమైతే రెండోది చేసుకో (నా కొటేషన్‌..)
ప్రేమ: ఎమోషన్‌
డబ్బు: ఓకే
ఊర్మిళ: బ్యూటీ
మహేశ్వరి: నాటీ
రేవతి: టాలెంట్‌
హైదరాబాద్‌: నా ప్రపంచం
ముంబయి: నా అండర్‌వరల్డ్‌
రాజమండ్రి: నా ఫాదర్‌ గుర్తు



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.