పెద్ద లోలాకులు కులికెను.. కులికెను
ఎరుపు లోలాకు కులికెను కులికెను... ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను...
- ఇలా రచయిత కలం అందాన్ని వర్ణించాలన్నా... ఆ పాటని కథానాయకుడు అంతే అందంగా పాడుకుంటూ ప్రేమని కురిపించాలన్నా.. కథానాయిక తెరపైన నఖశిఖ పర్యంతం ప్రత్యేకంగా కనిపించాల్సిందే. నుదుటిన బొట్టు, కళ్లకి కాటుక, ముక్కుపుడక, చెవికమ్మలు, మెడలోని హారాలు, చేతి గాజులు, నడుము సింగారించిన వడ్డాణం, కాళ్ల పట్టీలు... ఇలా ప్రతిదీ అతివ అందాన్ని రెట్టింపు చేసేదే. ఆ అందం కథానాయకుడిని ఆకర్షించిందంటే చాలు... ఎక్కడి నుంచి వర్ణించడం మొదలుపెడతాడో ఊహించలేం. అందుకే తెరపైన భామలు తమ నీలాల కళ్లకి కాటుక దిద్దడం మొదలుపెట్టి, కాలి గోర్ల వరకు అందానికి మెరుగులు అద్దుతూనే ఉంటారు. తెరపైన కనిపించడంలోనే కాదండోయ్‌... తెర వెనక కూడా కథానాయికలు ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. బయట కుర్రాళ్లు కూడా వాళ్ల అందం గురించి కవిత్వం రాసుకునేలా అన్నమాట! ఇక్కడ వీళ్లు సింగారించుకొన్న చెవి కమ్మల్ని చూస్తే ఎవ్వరైనా కాసేపు ఆగిపోవల్సిందే, వీళ్ల బుట్టలో పడిపోవల్సిందే.


ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న లాంగ్‌ ఇయర్‌ రింగ్స్‌ ట్రెండ్‌ని మన భామలు ఇలా ఒడిసిపట్టుకున్నారు. రకరకాల డిజైన్లతో కూడిన పొడవాటి కమ్మల్ని ధరిస్తూ అదరగొడుతున్నారు. ఇటీవల వేడుకలకి హాజరైన ఈ ముద్దుగుమ్మలు తమ చెవి కమ్మలతోనే ఎక్కువగా ఆకర్షించడం విశేషం. వీళ్లు వేదికలపై ముచ్చట్లు చెబుతూ హొయలుపోతుంటే... వీళ్ల చెవులకమ్మలు కులుకుతూ అల్లరి చేస్తుంటాయి. ఈ పొడవాటి చెవి కమ్మలకి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఏ డ్రెస్‌కైనా ఇవి సెట్‌ అవుతాయని ఫ్యాషన్‌ నిపుణులు చెబుతున్నారు. పలు చిత్రాలకి ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసిన ప్రముఖ స్టైలిస్ట్‌ శ్రీ మాట్లాడుతూ ‘‘కథానాయికలు ఇదివరకు చెవికి చిన్న కమ్మలు, మెడలో రెండు మూడు రకాల దండలు వేసుకొనేవాళ్లు. అప్పుడు అది ఫ్యాషన్‌. ఇప్పుడు మాత్రం కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. అందులో భాగమే లాంగ్‌ ఇయర్‌ రింగ్స్‌. ఇవి ధరిస్తే మెడలో హారాల అవసరం ఉండదు. అవే ప్రత్యేకమైన లుక్‌తో, అందాన్ని ఇనుమడింపజేస్తుంటాయి. వెస్ట్రన్‌, ఇండో వెస్ట్రన్‌, ట్రెడిషన్‌... ఇలా ప్రతి డ్రెస్‌కీ ఈ కమ్మలు సెట్‌ అవుతాయి. రింగ్స్‌ ఎంత పెద్దగా పెడితే అంత ఫ్యాషన్‌ అన్నమాట. వీటి ఖరీదు కూడా ఎక్కువేం కాదు. రూ.300 నుంచి మొదలవుతుంది. సినిమాల్లోనే కాకుండా, బయట కూడా కథానాయికలు ఈ తరహా కమ్మల్ని ధరించడానికి ఆసక్తి చూపుతుంటార’’ని చెప్పారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.