వెండితెరపై ఆట ఆడబోతున్నారు..
నాయికలు అందగత్తెలే కాదు. ఆటగత్తెలు కూడా.
తెరపై కథానాయకుల ‘ఆట’ కట్టించేదీ వాళ్లే.
బయట అభిమానుల గుండెలతో ఓ ‘ఆట’ ఆడుకునేదీ వాళ్లే.


ఇక క్రికెట్టో, టెన్నిసో ఆడుకోవడం వాళ్లకో లెక్కా..? అందుకే మైదానంలోనూ దిగిపోతున్నారు. మన కథానాయికల్లో కొంతమంది క్రీడాకారిణులుగా మెరవబోతున్నారు. అదీ సినిమాల కోసమే.

కథానాయిక అంటే హీరోలతో పాటలు పాడుకోవడానికో, వాళ్లతో రొమాన్స్‌ చేయడానికో కాదు. కథలో వాళ్లకూ భాగం ఉంది. ఆ విషయాన్ని గుర్తించిన ప్రతి సినిమాలోనూ నాయిక పాత్రలు సరికొత్తగా తళుకులీనుతుంటాయి. నాయికాప్రాధాన్య చిత్రాలైతే సరే సరి. గతంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అంటే, పోలీస్‌ అధికారి, లాయర్, కలెక్టర్‌ ఇలాంటి పాత్రలే గుర్తొచ్చేవి. ఇప్పుడు అందులో స్పోర్ట్స్‌ కోటా మొదలైంది. క్రీడా నేపథ్యమున్న సినిమాలు ఎక్కువగా వస్తుండడంతో, కథానాయికలకు సరికొత్త పాత్రలు దక్కుతున్నాయి.
గోపీచంద్‌ - తమన్నా కలయికలో ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. సంపత్‌ నంది దర్శకుడు. మాస్, కమర్షియల్‌ కథలు ఎంచుకునే సంపత్‌.. ఈసారి క్రీడానేపథ్యమున్న కథ ఎంచుకున్నారు. ఇందులో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నారు. తమన్నా కూడా కోచే. కానీ మహిళా జట్టుకు. ఈ సినిమా కోసం తమన్నా, గోపీచంద్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ దిశగానే కీర్తి సురేష్‌ కూడా ‘పరుగు’ తీస్తోంది. ‘గుడ్‌ లక్‌ సఖీ’లో ఆమె ఓ రన్నర్‌ పాత్రలో కనిపించబోతోంది. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మహానటి’ కోసం కాస్త బొద్దుగా మారిన కీర్తి ఈ సినిమా కోసం బాగా బరువు తగ్గాల్సి వచ్చింది. అంతేకాదు.. మారథాన్‌ టెక్నిక్స్‌ని కూడా నేర్చుకుని బరిలోకి దిగిందట.


‘కౌసల్యా కృష్ణమూర్తి’లో క్రికెటర్‌ పాత్రలో ఒదిగిపోయింది ఐశ్వర్యా రాజేష్‌. పల్లెటూరి నుంచి వచ్చిన ఓ అమ్మాయి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? అందుకోసం ఎన్ని కష్టాలు పడిందన్నదే కథ. ‘కౌసల్య..’ కోసం బ్యాటు పట్టుకున్న ఐశ్వర్య ఇప్పుడు రెజ్లర్‌గా మారిపోయింది. ‘మిస్‌ మ్యాచ్‌’ అనే చిత్రంలో తన పాత్ర అదే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. లావణ్య త్రిపాఠి హాకీ స్టిక్‌ పట్టుకుని మైదానంలో దిగబోతోందని సమాచారం. హాకీ నేపథ్యంలో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుందని, అందులో లావణ్య నటిస్తుందని తెలుస్తోంది. సమంత, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌... వీళ్లందరికీ క్రీడా నేపథ్యమున్న సినిమాలంటే చాలా ఇష్టం. అయితే.. ఇప్పటి వరకూ అలాంటి అవకాశాలు రాలేదు. త్వరలోనే వీళ్లకు కలల పాత్రలు దొరుకుతాయేమో చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.