ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం

సినిమాకైనా... తారలకైనా... ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడమే లక్ష్యం. బాలీవుడ్‌లో నటిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. పారితోషికం కూడా ఎక్కువే అందుతుంది. అందుకే తారల్లో చాలా మంది బాలీవుడ్‌ వైపే చూస్తుంటారు. సొంత భాషలో అభిమానుల్ని అలరిస్తే చాలనే ఆలోచనతో కనిపించిన హీరోలు కూడా ఇటీవల హిందీ వైపు చూస్తున్నారు. దీన్నిబట్టి ఆ మార్కెట్‌ వాళ్లని ఎంతగా ఊరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి అక్కడికి వెళ్లారంటే ఇక తిరిగి రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలా ఒక్క అవకాశంతో మొదలుపెట్టి... ఛలో ముంబయి అంటూ మకాం మార్చేసిన నాయికలు చాలామందే. అక్కడ అవకాశాలు తగ్గాక కానీ... ఇటువైపు చూసేవాళ్లు కాదు. కానీ ఇటీవల ఆ ధోరణికి భిన్నంగా అడుగులేస్తున్నారు. మేం ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం అంటూ రెండు చోట్లా మెరిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్, కియారా అడ్వాణీ, తాప్సి, తమన్నా... వీళ్లందరిదీ అదే వరసే.



ఎవరైనా మొదట ఒక్క అవకాశం వస్తే చాలనుకుంటారు. కాస్త నిలదొక్కుకున్నాక స్టార్‌ హోదా గురించి కలలు కంటారు. ఆ తర్వాత ఇతర భాషలపైనా కన్నేస్తారు. చివరికి హిందీలో ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. కథా నాయకుల మాటేమో కానీ.. ఎక్కువ మంది కథానాయికల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అయితే నవతరం భామల్లో చాలామంది హిందీలో బిజీగా ఉంటున్నా... దక్షిణాది చిత్రాలతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. మంచి అవకాశం వచ్చిందనగానే భాషతో సంబంధం లేకుండా వెంటనే పచ్చజెండా ఊపేస్తున్నారు.



అటు నుంచే వచ్చింది...

కియారా అడ్వాణీ హిందీ నుంచి వచ్చింది. తెలుగులో తొలి ప్రయత్నంగా చేసిన ‘భరత్‌ అనే నేను’తోనే ఆమె ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో నటించింది. ప్రస్తుతం ఆమెకి హిందీలో బోలెడన్ని అవకాశాలు. అయినా సరే... దక్షిణాదిలో నటించేందుకు సై అంటోంది. మహేష్‌తో మరోసారి కలిసి నటించడానికి ఆమె ఇప్పటికే ఓకే చెప్పేసింది. ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఫిదా అయిపోయా. నేను కనిపించానంటే చాలు... నా సినిమాల్లోని పాత్రల పేర్లతో పిలుస్తుంటారు. ఆ అభిమానం కోసమైనా.. తెలుగులో ఏడాదికో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా’’ అంటోందామె. తాప్సి కూడా హిందీలో బిజీ బిజీ. అక్కడ నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తోందామె. అయినా సరే అప్పుడప్పుడు దక్షిణాదిలో మెరుస్తుంటుంది. గతేడాది ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రంతో అలరించింది. ‘‘నాకు సినిమా అంటే ఏంటో నేర్పింది తెలుగు చిత్రసీమే. స్థానికంగా ఉంటే బాగుంటుందనే కోణంలో ఆలోచించే ముంబయి వెళ్లాను తప్ప... తెలుగు సినిమాకి నేనెప్పుడూ దూరం కాలేదు. ‘ఆనందోబ్రహ్మ’, ‘గేమ్‌ ఓవర్‌’ సినిమాలు చేశానంటే కారణం అదే. నటించినా, నటించకపోయినా దక్షిణాది కథలు తరచూ వింటుంటా’’ అంటోంది తాప్సి.


సమయం ఉంది మిత్రమా

రెండు సినిమాలు చేతిలో ఉన్నాయంటే.. మూడో సినిమా చేసే తీరిక మాకు లేదనే కథానాయికలే ఎక్కువ. పూజా హెగ్డే, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాత్రం సమయపాలనలో ఆరి తేరారు. నాలుగు సినిమాలైనా అవలీలగా చేసేస్తాం అంటున్నారు. అందుకే వాళ్లు ఎక్కడ మంచి అవకాశం వచ్చినా వదులుకోకుండా నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తమిళంలోనూ రెండు చిత్రాలు ఒప్పుకుంది. తెలుగులో నితిన్‌తో కలిసి ‘చెక్‌’లో నటిస్తోంది. పూజా హెగ్డే ఇటీవల హిందీలో సల్మాన్‌ఖాన్‌ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఇక తెలుగులో ప్రభాస్, అఖిల్‌ లాంటి కథానాయకులతో కలిసి నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని చెబుతోంది. ‘‘నటిగా నాకు పేరొచ్చింది తెలుగు సినిమాలతోనే. ప్రేక్షకులు ఎప్పుడో నన్ను సొంత మనిషిలా స్వీకరించారు. అందుకే నా తొలి ప్రాధాన్యం తెలుగుకే ఇస్తుంటా’’ అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ‘‘ఈమధ్య తెలుగు కథలు కట్టి పడేస్తున్నాయి. చేయనని చెప్పడానికి కారణాలేమీ కనిపించడం లేదు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?’’ అంటోంది పూజాహెగ్డే.


పాన్‌ ఇండియా సినిమాల ప్రభావమే...

డిజిటల్‌ వేదికలు అందుబాటులోకి వచ్చాక భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఏ భాషలో నటించినా... ఆ సినిమా బాగుందంటే, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకూ చేరువవుతోంది. అందుకే కథానాయికలు ఇప్పుడు భాష గురించి ఆలోచించడం లేదు. మంచి కథ ఎక్కడి నుంచి వచ్చినా, చేయడానికి సిద్ధపడుతున్నారు. ‘‘ఒక్కో చోట నుంచి ఒక్కో రకమైన కథలొస్తుంటాయి. అలాంటప్పుడు ఎందుకు వాటిని దూరం చేసుకోవాలి? తెలుగులో చేయలేకపోయిన కథల్ని హిందీలో చేసే అవకాశం నాకు వచ్చింది. అంతే తప్ప ఒక భాషలో నటిస్తున్నామంటే మరో భాషకి దూరమవుతున్నట్టు కాదు’’ అంటోంది తమన్నా. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘సీటీమార్‌’ చిత్రంలో గోపీచంద్‌తో కలసి నటిస్తోంది. దీంతో పాటు హిందీలో ‘బోలే చూడియాన్‌’ అనే చిత్రం చేస్తోంది. ఈమధ్య పాన్‌ ఇండియా సినిమాల జోరు కూడా ఎక్కువైంది. సినిమాలకి మరిన్ని హంగులు జోడించి జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు. పేరుకు ప్రాంతీయ భాషల్లోనే సినిమాలు రూపొందుతున్నా అవి జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. హిందీలో అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న శ్రద్ధా కపూర్, ఆలియాభట్‌ తదితర భామలు తెలుగు సినిమాలు ఒప్పుకుంటున్నారంటే కారణం అదే.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.