పాప నవ్వుతో మొదలైన ‘కిక్‌’ ఆగదు

కథానాయకుడు బాగా చదువుకున్న వ్యక్తి. అయితే అతనికి ఉద్యోగం చేయడం నచ్చదు. ప్రతి రోజు కొత్తదనం కావాలి. చేసే ప్రతి పనిలోనూ ‘కిక్’ ఉండాలి.  అతనికి అసలైన కిక్‌ ఓ పాప చిరునవ్వులో దొరుకుతుంది. అలాంటి వందల వేల చిన్నారుల మోముల్లో నవ్వులు కురిపించేందుకు దొంగగా మారాలి. ఇలాంటి కథతో సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడు సురేందర్‌ రెడ్డి, రవితేజ ఊహించారో ,లేదో? ఈ చిత్రం వాళ్లిద్దరి కెరీర్‌కి మరిచిపోలేని ‘కిక్‌’ ఇస్తుందని. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ని ఈ కథని వేరుగా చూడలేం. కల్యాణ్‌ అనే పాత్రలో తనదైన ఎనర్జీతో సినిమా మొత్తాన్ని హుషారెత్తించాడు రవితేజ. నైనాగా ఇలియానా అందం, అభినయం కుర్రకారు మతులు పోగొట్టింది. పోలీసు అధికారి కల్యాణ్‌ కృష్ణ పాత్రలో శ్యాం నటన అందరి దృష్టిని ఆకర్షించింది. షాయాజీ షిండే, బ్రహ్మానందం, వేణు మాధవ్‌, బెనర్జీ, కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. ఈ చిత్రంతోనే మణిశర్మ శిష్యుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. తొలి సినిమాకే మంచి స్వరాలు అందించి గురువుకు తగ్గ శిష్యుడనిపించుకున్నారు. నేపథ్య సంగీతంలోనూ తనదైన ముద్ర వేశాడు తమన్‌. ‘ఐ డోంట్‌ వాన్ట్ లవ్‌’, ‘గోరే గొగ్గొరే’, ‘బాసూ మనకు మెమొరీ లాసు’ గీతాలు విశేషణ ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా అబ్బూరి రవి మాటలు రాశారు. ఈ సినిమా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2009 మే 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్‌.. ఆగదు’ అని ఓ సందర్భంలో షాయాజీ షిండే చెప్పినట్లు రవితేజ అందించిన ‘కిక్‌’ ఎన్నడూ ఆగదు. ఎందుకంటే కిక్‌ అంటే రవితేజ అంటే కిక్‌ కాబట్టి. కొన్నాళ్లకు ‘కిక్‌ 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అది ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.