జోరుగా సాగుతున్న కొత్త చిత్రాల వ్యాపారం

సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. థియేటర్లు మూగబోయాయి. పరిస్థితులు మళ్లీ ఎప్పుడు గాడిన పడతాయో తెలియని పరిస్థితి. కానీ చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాలకి సంబంధించిన వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నా సరే, తీసిన సినిమాల్ని థియేటర్లలోనే విడుదల చేయాలని కొందరు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అలాంటి చిత్రాలకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు సాగుతూనే ఉన్నాయి. సినిమాల క్రేజ్‌ని, వాటిపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని పంపిణీదారులు హక్కుల్ని కొని పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పరిమిత వ్యయంతో తెరకెక్కుతున్న సినిమాలేమో ఓటీటీల ద్వారా వ్యాపారాలు చేసుకుంటున్నాయి. దాంతో చిత్రసీమ స్థంభించిపోయినా వ్యాపార లావాదేవీలు మాత్రం ఊపందుకున్నట్టే కనిపిస్తోంది. చాలా సినిమాల చిత్రీకరణలు చివరి దశలో ఉన్నాయి. వాటి హక్కుల్ని కొనడంపై పంపిణీదారులు ఆసక్తి చూపుతున్నారు. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘క్రాక్‌’, గోపీచంద్‌ ‘సీటీమార్‌’, శర్వానంద్‌ ‘శ్రీకారం’, రానా ‘విరాటపర్వం’ సినిమాల నైజాం ప్రాంత హక్కుల్ని పంపిణీదారుడు వరంగల్‌ శ్రీనివాస్‌ సొంతం చేసుకున్నారు. మరిన్ని స్టార్‌ కథానాయకుల చిత్రాలకి సంబంధించిన హక్కుల కోసం కూడా నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు శ్రీనివాస్‌ తెలిపారు.


ఆ నమ్మకంతో..?

థియేటర్లు ప్రారంభమైతే ప్రేక్షకుల ఉధృతి ఎక్కువగా ఉంటుందని వ్యాపార వర్గాలు నమ్ముతున్నాయి. ప్రేక్షకులు చాలా రోజులుగా ఇళ్లకే పరిమితమవుతూ, వినోదానికి దూరమయ్యారు. థియేటర్‌కి వెళ్లడం సురక్షితమే అనే నమ్మకం కలిగిందంటే ప్రేక్షకులు థియేటర్లకి వరస కడతారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశాలున్నాయనేది వాళ్ల నమ్మకం. అందుకే వ్యాపార వర్గాలు కొత్త సినిమాలపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. పంపిణీదారులు వరంగల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చిందంటే ఇక ప్రేక్షకుల్ని ఆపలేం. సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల్లోనూ భవిష్యత్తుపై బలమైన నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు ఉత్సాహంగా పంపిణీ హక్కుల్ని కొంటున్నాం’’ అన్నారు. పంపిణీ హక్కులకి సంబంధించిన వ్యాపారం ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టుగానే మధ్యేమార్గంగా జరుగుతున్నట్టు సమాచారం.
శైలి మారింది

కరోనా వల్ల ఇదివరకటితో పోలిస్తే సినిమా వ్యాపారం విధానం మాత్రం పూర్తిగా మారిపోయింది. చాలా సినిమాలు ఓటీటీ లక్ష్యంగా రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. ప్రేక్షకుల్ని థియేటర్లవైపు ఆకర్షించగల సత్తా ఉన్న హీరోలతో మాత్రమే, థియేటర్‌లో విడుదల లక్ష్యంగా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే సిద్ధమైన సినిమాల్లో కూడా చాలా వరకు ఓటీటీ దారిని ఎంచుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా, ప్రేక్షకులు ఇది వరకటి స్థాయిలో రాకపోతే నష్టాలు మూటగట్టుకోవల్సి ఉంటుందని నిర్మాతలు ఓటీటీవైపు ఆసక్తి చూపుతున్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.