తారలు నేర్పిన పాఠాలివి!

సినిమా అంటే ఉద్వేగం...

ఎంతో మందితో కలిసిసాగే ఒక ప్రయాణం...

ఆ ప్రయాణం మనకు ఎన్నో అనుభూతులను పరిచయం చేస్తుంది... మరెన్నో విషయాలు నేర్పిస్తుంది... సహనటుల ప్రవర్తనలో ప్రత్యేకతలు పాఠాలు చెబుతాయి. ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాల్లో అలరించిన తారలు తమ సహనటుల్లో ఏమేం గమనించారో, వారి నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో చెబుతున్నారు. అవేంటో చూద్దామా?


* విజయ్‌లో గమనించిందదే: ఐశ్వర్య

విజయ్‌ దేవరకొండ అనగానే మనందరికీ మాస్‌లుక్, ఒక రౌడీ అబ్బాయి గుర్తుకు వస్తాడు. ఆ మొరటుతనం ఆయనకు తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్‌ ముందు తన సత్తా ఏంటో నిరూపించింది. ఆయన ఇటీవలి చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ఇందులో నాయికగా మెప్పించింది ఐశ్వర్య రాజేష్‌. ఆమె విజయ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘విజయ్‌ దేవరకొండ సింపుల్‌గా ఉండే వ్యక్తి. ఇతరుల ప్రతిభను ఎప్పుడూ గౌరవిస్తుంటాడు. ఇక నటన విషయంలో ఎంతో నిబద్ధతగా, అంకితభావంతో మెలుగుతుంటారు. ఏ సన్నివేశంలోనైనా సరే ముందు సాధన చేశాకే నటిస్తారు. అలా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో మా భాగం చిత్రీకరణ జరిగినన్ని రోజులూ ఇద్దరం ముందే సాధన చేసేవాళ్లం’’ అని ఆయన నుంచి నేర్చుకున్న ప్రత్యేకతలను వివరించింది ఐశ్వర్య.* సమంతను చూసి నేర్చుకున్నా: శర్వానంద్‌

‘జాను’ చిత్రంతో తొలిసారిగా జంటకట్టారు శర్వానంద్, సమంత. ఈ జోడి థియేటర్లలో హిట్‌ టాక్‌ అందుకోవడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో శర్వా సమంత నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారంట. వాటి గురించి ఈ యువ కథానాయకుడు ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు కూడా. ‘జాను సినిమాకు ఒక కసితో పనిచేశా. అందులో నా పాత్ర అంతగా పండటానికి కారణం సమంతనే. చిత్రీకరణ సమయంలో ఆమె నుంచి నేను కొన్ని విలువైన విషయాలు నేర్చుకున్నా. ఆమె తన సన్నివేశం లేకపోయినా సరే కెమెరా దగ్గరకు వచ్చి ఎవరెలా చేస్తున్నారన్నది గమనిస్తుంది. నటనలో తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పటి నుంచి నేను కూడా ఎవరేం చేస్తున్నారు... ఎలా చేస్తున్నారో పరిశీలిస్తున్నాన’ని అంటున్నారు శర్వా.


* మామ నేర్పిన మంచి అది: నాగచైతన్య

‘వెంకీ మామ’లో నిజ జీవితపు పాత్రల్లో సందడి చేశారు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య. ఈ మామాఅల్లుల్ల అల్లరి ప్రేక్షకులతో కేరింతలు కొట్టించింది. ఈ సినిమా ద్వారానే మామ వెంకటేష్‌ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నానంటున్నారు చైతూ. ‘‘వెంకీ మామ నుంచి వ్యక్తిగా ఎలా ఉండాలో తెలుసుకున్నా. సెట్స్‌పై ఆయన నడవడిక చాలా బాగుంటుంది. నిశ్శబ్దంగా, సంతోషంగా, ఎప్పుడూ సానుకూలంగా కనిపిస్తుంటారు. ఆయన్ని ద్వేషించే వాళ్లు ఎవరూ ఉండరు. ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ ఆయన దగ్గర ఇది నేర్చుకున్నా. భావోద్వేగాలపరంగా సైతం ఆయన్నుంచి ఎన్నో తెలుసుకున్నాన’’ని చెబుతున్నారు నాగచైతన్య.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.