అంతకు ముందు... ఆ తర్వాత

కొత్త సినిమాల సందడికి చిత్ర పరిశ్రమ దూరమై రెండు నెలలు పూర్తయింది. కరోనా ప్రభావంతో సినిమా క్యాలెండర్‌ మొత్తం మారిపోయింది. ఈ విపత్తు నింపిన చీకట్ల నుంచి వెండితెర పూర్తిస్థాయిలో వెలుగులు సంతరించుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఇక నుంచి చిత్రసీమ కరోనాకి ముందు... తర్వాత అని విడదీసి చూసేలా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లపాటు మునుపటిలా పరిస్థితులు ఉండవన్నది ఖాయం. థియేటర్లు తెరుచుకోవడానికి ముందే చిత్రీకరణలకి అనుమతులు లభించే అవకాశాలున్నాయి. ఒకవేళ చిత్రీకరణలకు అనుమతులు వచ్చినా సినీ వర్గాలకు స్వాగతం పలికేందుకు అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు సినీ పరిశ్రమ వర్గాలు వాటిపైనే దృష్టిపెట్టాయి.




సెట్లో భద్రత:

సినిమా చిత్రీకరణ వందల మందితో కూడుకున్న వ్యవహారం. భౌతిక దూరాన్ని పాటిస్తూ చిత్రీకరించడం పెద్ద సవాలే. తక్కువ మంది చిత్రబృందంతో మాత్రమే చిత్రీకరణ జరపాల్సి వస్తే సినీ నిర్మాణాలు మరింత ఆలస్యమవుతాయి. అది నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపిస్తుంది. నటీనటుల్లో భయాల్ని తొలగించి, వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించి సెట్స్‌కు తీసుకురావడమన్నది మరింత క్లిష్టమైన అంశం. ‘‘కరోనా భయం ఇప్పట్లో పోదు. దానికి వ్యాక్సిన్‌ వచ్చిందంటే తప్ప మునుపటిలాగా ధైర్యంగా చిత్రీకరణలు చేసుకునే పరిస్థితులు ఉండవ’’ని ఓ ప్రముఖ కథానాయకుడు ‘ఈనాడు సినిమా’తో చెప్పారు.



నటీనటుల లభ్యత:

చిత్రీకరణలకు అనుమతులు ఎప్పుడు లభిస్తే అప్పుడు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని సినిమాలూ ఒకేసారి ప్రారంభిస్తే నటీనటులు ఏస్థాయిలో అందుబాటులో ఉంటారు? వాళ్ల డేట్లని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ప్రశ్న. హీరోలైతే ఒక్కో సినిమానే చేస్తారు. కానీ నాయికలు, సహ నటుల విషయంలో సమస్యలు రావొచ్చు.





ప్రచారం మాటేమిటి?

సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్లు, విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇకపై ఇలాంటి వాటికి వీలుండకపోవచ్చు. ఇటీవల ఓ వెబినార్‌లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘‘కరోనా వల్ల వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఇకపై సినిమాల్ని, వాటి నిర్మాణాన్ని మార్చుకోవాలి. మూస ధోరణిలో వెళ్తే బోల్తా పడతాం’’ అన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకుని అధ్యయనం చేశాకే చిత్రీకరణలకి సిద్ధమవ్వాల’’ని నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు.



విడుదల కష్టాలు:

పరిస్థితులు బాగున్నప్పుడే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టం. ఇక లాక్‌డౌన్‌ తర్వాత వాటి పరిస్థితి గురించి అనేక భయాలు నెలకొన్నాయి. అగ్ర హీరోల సినిమాలు వరుసగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. దాంతో వాటి వసూళ్లపైనా ప్రభావం పడుతుంది. అయితే థియేటర్లు తెరచుకున్నా ప్రేక్షకులు మునుపటిలాగా వస్తారా అనే సందేహం నిర్మాతల్ని వెంటాడుతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు, పాన్‌ ఇండియా సినిమాలకు ఓవర్సీస్‌ మార్కెట్లూ కీలకమే. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దుబాయ్‌ లాంటి ఓవర్సీస్‌ మార్కెట్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి ఆదాయం దక్కుతోంది. కాబట్టి ఇలాంటి చిత్ర నిర్మాతలు ఆయా రాష్ట్రాలు, దేశాల్లోని పరిస్థితులను కూడా అంచనా వేసుకునే ముందుకు రావాల్సి ఉంటుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.