‘మగధీర’కి పదకొండేళ్లు


మగధీర.. టాలీవుడ్‌ సినిమా అని చెప్పడం కంటే టాలీవుడ్‌కే పేరు తెచ్చిన సినిమా అనడమే భావ్యం. అంతటి ప్రాచుర్యం పొందిందీ చిత్రం. అప్పటి వరకు చూడని ఓ సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకులకు అందించారు దర్శకుడు రాజమౌళి. కథ ఎంత కీలకమో గ్రాఫిక్స్‌ అంతే ప్రధానంగా నిలిచింది ఈ సినిమాకి. 17 శతాబ్దంలోని ఓ ప్రేమ జంట 21వ శతాబ్దంలో ఎలా కలుసుకుంటారు? ప్రస్తుతం వారికి గతం గుర్తుంటుందా? వీళ్లని విడదీయడానికి ప్రయత్నించేది ఎవరు? ఇదే కథాంశం. దీనికి గ్రాఫిక్స్‌ జోడించి తెలుగు ప్రేక్షకులతో ఔరా అనిపించారు. ఇదొక విజువల్‌ ట్రీటనే చెప్పాలి. రామ్‌ చరణ్‌..కాల భైరవ -హర్ష, కాజల్‌.. మిత్ర వింద,ఇందూగా తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీ హరి నటన గురించి.. షేర్‌ ఖాన్‌గా ఆయన చెప్పిన డైలాగ్‌ ‘కమ్ముకున్న చీకటిని చీల్చుకుంటూ మళ్లీ పుడతావురా భైరవా’ సినిమాకే హైలెట్‌. రామ్‌ చరణ్, శ్రీ హరి మధ్యలో వచ్చే డైలాగ్స్‌ థియేటర్లలో మోత మోగాయి. సాల్మాన్‌గానూ మరో పాత్ర పోషించారు శ్రీ హరి. కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. 24 విభాగాల్లో ప్రతి విభాగం గురించి ప్రత్యేంగా చెప్పుకునే అద్భుతం ఈ మగధీర చిత్రం. ఈ సినిమా విడుదలై నేటికి 11 ఏళ్లు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం 2009 జులై 31న రిలీజ్‌ అయింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.