తెలుగు తనువు పులకించేలా...!
సినిమా అనుభూతుల ప్రయాణం. కొన్ని ఆనందాన్ని మిగులుస్తాయి. ఇంకొన్ని విషాదాన్ని గుర్తు చేస్తాయి. వీటికి అతీతమైన చిత్రాలూ అరుదుగా వస్తుంటాయి. మనల్ని మనది కాని జీవితంలోకి, మనకు పరిచయం లేని కాలంలోకి ప్రేమగా ఆహ్వానిస్తాయి. వేలు పట్టుకుని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తాయి. కొన్ని అనుభవాల్ని గుప్పిట్లో పట్టుకుని గుండెల్లో నింపి పంపిస్తాయి. ఓ కంట ప్రేమ - మరో కంట కన్నీళ్లు పుట్టించే అద్భుతమైన అలౌకికమైన అనిర్వచనీయమైన స్పందన రగిలిస్తాయి. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక.. ‘చూసింది మూడు గంటల సినిమానా, నూరేళ్ల జీవితమా’ అనే కొత్త ప్రశ్నని రేకెత్తిస్తాయి. ‘మహానటి’ ఈ కోవలో చేరే చిత్రమే. తాజాగా ఈ చిత్రానికి 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు దక్కాయి.  ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా అవార్డును గెలుచుకోవడంతో పాటు.. ఈ సినిమాలోని నటనకు గానూ ఉత్తమ జాతీయ నటిగా ఎంపికైంది కీర్తి సురేష్‌. ఈ సందర్భంగా ‘మహానటి’కి సంబంధించి సితార.నెట్‌ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.


సున్నా నుంచి వంద వరకూ ఎదిగే ప్రయాణమే విజయం! ..వంద నుంచి సున్నాకి పడిపోవడం... పతనం!..వీటి మధ్య ఊగిసలాడే ప్రతి జీవితం... ఓ పాఠం.సావిత్రి జీవితం అలాంటి గుణ ‘పాఠమే’. సావిత్రి అంటే ఓ ‘మాయాబజార్‌’ శశిరేఖ. సావిత్రి అంటే ‘దేవదాసు’లోని పార్వతి. సావిత్రి అంటే మేరీ ‘మిస్సమ్మ’. సావిత్రి అంటే నింగిలోని నక్షత్రం! కానీ అసలు సావిత్రి వేరు. సావిత్రి అంటే విఫలమైన ఓ ప్రేమ. సావిత్రి అంటే నమ్మక ద్రోహాలకు బలైన సగటు స్త్రీ. సావిత్రి అంటే అగాధాన్ని అక్కున చేర్చుకున్న అమాయకురాలు. సావిత్రి అంటే విషాదాన్ని విషంగా మార్చుకుని గొంతులోనే దాచుకున్న విధి వంచిత. సావిత్రి అంటే నేలకు రాలిన ఓ మహావృక్షం. సావిత్రి సినిమాలు మాత్రమే చూస్తే ఆమె స్టార్‌డమ్‌ మెరుపులు మన కళ్లని బైర్లు కమ్మేలా చేస్తాయి. ఆమె జీవితాన్నీ చూస్తే అవే కళ్లు కన్నీళ్లని వర్షిస్తాయి. ఆ సుడులు మనల్ని ముంచేస్తాయి. ఊహకందని విజయాలు, ఊపిరాడని అల్లకల్లోలాలూ కలిస్తేనే సావిత్రి. ఇలాంటి కథని సినిమాగా మలచాలనుకోవడం దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌, నిర్మాతగా ప్రియాంక దత్‌ చేసిన సాహసం. దానికే ఇప్పుడు వీరతాళ్లు పడుతున్నాయి. నీరాజనాలు అందుతున్నాయి.


* సావిత్రి జీవితంలో ఇంత విషాదం ఉందా?
బయోపిక్‌లు తీయడమంటే తెలుగువాళ్లకు భయం. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే ‘ఆర్ట్‌ సినిమా’ అంటారు. కల్పన జోడిస్తే ‘అసలు కథకి అన్యాయం జరిగిన’ట్టు భావిస్తారు. సమతూకం పాటించడం, ఎలాంటి విమర్శలకూ వివాదాలకూ తావివ్వకుండా అందరి మెప్పూ పొందేలా తీయడం మామూలు విషయం కాదు. అందుకే ఈ విషయంలో తెలుగు సినిమా ముందు నుంచీ వెనుకే ఉంది. ‘బయోపిక్‌లు తీయాలంటే బాలీవుడ్‌ వాళ్లకే సాధ్యం..’ అని సర్దిచెప్పుకుంటున్నవాళ్లంతా ‘మహానటి’ చూసి నిర్ణయం మార్చుకునేలా చిత్ర రూపకర్తలు కష్టపడ్డారు. ఆ దిశగా విజయం సాధించారు. బయోపిక్‌ తీయాలంటే ఆ వ్యక్తి కథ తెలిస్తేనే సరిపోదు. ఆ జీవితం వెనుక ఉన్న కష్టనష్టాలూ అర్థమవ్వాలి. ఆ బాధని అనుభవించాలి. ‘మహానటి’ టీమ్‌ అక్షరాలా చేసింది అదే. సావిత్రి జీవితంలోకి తొంగి చూసినట్టు, ఆమె ప్రతి మలుపులోనూ తానూ ఉన్నట్టు, సావిత్రితో పాటు పుట్టి సావిత్రి అడుగులో అడుగువేసి నడిచినట్టు దర్శకుడు ఈ కథని రాసుకున్నాడు. అందుకే సావిత్రి పసితనం నుంచి ఆమె పతనావస్థ వరకూ ప్రతి మలుపూ కళ్లకు కట్టాడు. ఆమె విజయాలు చూసి ఉప్పొంగిన ప్రతి తెలుగు హృదయం, ఆమె పతనానికీ ఉలిక్కిపడింది. ‘అయ్యో.. సావిత్రి జీవితంలో ఇంత విషాదం ఉందా?’ అంటూ చెంపలపైనుంచి జారుతున్న కన్నీళ్లని తుడుచుకోవడం మర్చిపోయి కథలో లీనమైపోయేలా ఆయా సన్నివేశాల్ని తీర్చిదిద్దగలిగాడు. సావిత్రి కథని చెప్పాలంటే ఓ అర్హత కావాలి. ఆ అర్హత సావిత్రిని ప్రేమించిన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాటిలేని నటిగా, మనసున్న మారాణిగా సావిత్రిని అర్థం చేసుకున్న నాగ్‌ అశ్విన్‌.. ఆ అర్హత అందరికంటే తనకే ఎక్కువుందని నిరూపించుకున్నాడు.

కీర్తి సురేష్‌, సమంత, సల్మాన్‌ దుల్కర్‌, విజయ్‌ దేవరకొండ, రాజేంద్రప్రసాద్‌, మోహన్‌బాబు.. ఇలా ఎంతమంది గురించి చెప్పాలి? దర్శకుడు ‘ఇదీ నీ పాత్ర’ అని చెబితే.. అందులో లీనమైపోవడానికి అందరూ పోటీ పడ్డారు. ఇప్పటి వరకూ ‘మహానటి’ అనగానే సావిత్రి గుర్తొచ్చినట్టు, ఇక మీదట ‘సావిత్రి’ అంటే కీర్తి సురేష్‌ గుర్తొస్తుంది. ఈ చిత్రంలో రచయిత బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు విన్నప్పుడు చప్పట్లు కొట్టడానికి చేతులతో పాటు హృదయమూ పోటీ పడుతుంది. 1950 - 80ల మధ్య నడిచిన కథ ఇది. ఆ కాలంలోకి ప్రేక్షకుణ్నీ తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. సెట్స్‌, కాస్ట్యూమ్స్‌, కెమెరా వర్క్‌ ఇవన్నీ టైమ్‌ మిషన్‌లా పనిచేసి - ‘మీరు సావిత్రి కాలంలో ఉన్నారు’ అంటూ ప్రేక్షకుణ్ని హిప్నటైజ్‌ చేసినట్టు అనిపిస్తుంది. మొత్తంగా సావిత్రి కథ ఓ ఉద్వేగం, ఓ ఉల్లాసం, ఓ విషాదం. తెరపై అభినయంతో కట్టిపడేసిన ఓ నటి వెనుక ఇంత కథ ఉందా? అంటూ విస్మయపరిచిన ఓ ప్రయాణం. దాన్ని ప్రతి తెలుగు తనువూ పులకించేలా తీర్చిదిద్దారు. జీవిత కథలు తెరకెక్కించే సాహసం మునుముందు ఎవరు చేసినా, ఎవరు చేయాలనుకున్నా, ఎవరి కథ చెప్పాలనుకున్నా.. ‘మహానటి’ ఓ పాఠంగా మిగులుతుంది. సినీ చరిత్రలో ‘సావిత్రి’కి ఇచ్చిన స్థానమే... ఈ ‘మహానటి’కీ దక్కుతుంది.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.