అమాయకత్వమే అవకాశం ఇచ్చింది..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటి గుర్తుండిపోయే నటీమణుల జాబితాలో గీతాంజలి ఒకరు. తొలి చిత్రంతోనే సీతగా మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో హాస్యనటిగా తన సత్తా చాటారు. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన గీతాంజలి గుండెపోటుతో మరణించారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వం వల్ల ఆమెకు కథానాయికగా అవకాశం వచ్చింది. ఆ అమాయకత్వమే పెళ్లికి కారణమైంది. గీతాంజలి గురించి మరికొన్ని విశేషాలు..


* మణి.. గీతాంజలిగా..
గీతాంజలి తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, హిందీలోనూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అసలు పేరు ఏంటో తెలుసా.. మణి.. హిందీలో ఆమె నటించిన తొలి చిత్రం ‘పారస్‌మణి’. బాబూభాయ్‌ మిస్త్రీ తెరకెక్కించారు. ఆ చిత్ర టైటిల్‌లో మణి అని ఉండటంతో కథానాయిక పేరు సైతం అదే కావడంతో ప్రేక్షకులు తికమక పడకూడదనే ఉద్దేశంతో దర్శకుడే ఆమె పేరును గీతాంజలిగా పెట్టారట. ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఆ పేరుతోనే చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

* ఎన్టీఆర్‌తో అనుబంధం..
 కథానాయికగా గీతాంజలి తొలి చిత్రం ‘సీతారామకల్యాణం’. ఆమెకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది ఆ పాత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను ఎన్టీఆర్‌గారి సీత అనే పిలుస్తారంటూ పలు సందర్భాల్లో చెప్పేవారు గీతాంజలి. ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశం ఎలా వచ్చిందంటే? ‘రాణీ రత్నప్రభ’ అనే చిత్రంలో ఓ పాటలో కనిపించారు గీత. అది చూసిన ఎన్టీఆర్ అమ్మాయి బావుంది. మొహంలో అమాయకత్వం ఉంది. సీత పాత్రకు సరిగ్గా సరిపోతుందని చెప్పడంతో సీతారామకల్యాణంలో హీరోయిన్‌గా మారారు గీతాంజలి.


* అది అన్నగారి నుంచి నేర్చుకున్నారట..
ఓ సారి రామారావు నేషనల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో పనిచేసేలా ఒప్పందం చేసుకున్నారట గీత. డైలాగ్స్‌,డ్యాన్స్‌.. అన్నీ ఆయనే నేర్పించేవారట. ఎప్పుడూ ఎవరితోనూ ‘రా’, ‘పో’ అని ఏకవచనంతో మాట్లాడకుండా రండి, వెళ్లండి అని గౌరవం ఇచ్చి మాట్లాడే పద్ధతి ఎన్టీఆర్‌ నుంచే అలవర్చుకున్నారట.

* పద్మనాభం హీరోయిన్‌గా..
గీతాంజలి పద్మనాభంతో చాలా సినిమాల్లో నటించడంతో ఆమెపై పద్మనాభంగారి హీరోయిన్‌, కమెడియన్‌ అనే ముద్ర పడింది. అప్పట్లో పద్మనాభం- గీతాంజలి ఉంటే సినిమా హిట్‌ అనే టాక్‌ పరిశ్రమలో ఉండేది.

* భానుమతి అంటే భయం..
సావిత్రి, అంజలీదేవి, సూర్యకాంతంతో సన్నిహితంగా ఉండేవారు గీత. భానుమతి అంటే భయపడేవారట. ఆ భయంతోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నారట గీత.


* జయలలిత గీతకు ‘అమ్ము’
జయలలిత, గీత కలిసి చాలా సినిమాల్లో నటించారు. చిన్నప్పటి నుంచే ఇద్దరు స్నేహితులవడంతో గీతాంజలి జయలలితను ‘అమ్ము’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు.

* రామకృష్ణతో పెళ్లి..
నటుడు రామకృష్ణతో కలిసి సుమారు 40 చిత్రాల్లో నటించారు గీత. సినిమా చిత్రీకరణ సమయాల్లో గీతను రామకృష్ణ ఎంతో ప్రత్యేకంగా చూసుకునేవారట. పక్కనున్న వారు అడిగితే ‘ఎందుకో ఆ అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడింది. అమాయకురాలు’ అని అనేవారట. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అలా కొన్నాళ్లు గడిచాక ఇంట్లో ఒప్పించి వారి ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలెక్కించి మూడు ముళ్ల బంధంగా మార్చుకున్నారట.


* సినిమాలకు విరామం ఇవ్వడంతో అనారోగ్యం..
వివాహం అయ్యాక కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు గీత. ఆ సమయంలో రోజూ సినిమా వాతావరణం గుర్తొచ్చి తరచూ అనారోగ్యానికి గురయ్యేవారట. అందరూ కలిసుండి ఒకేసారి విడిపోవడంతో చాలా బాధపడేవారట. ఆ తర్వాత బాబు పుట్టాక మనసు మార్చుకున్నారు.

* పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ..
దాదాపు పదేళ్ల విరామం తర్వాత జగపతి బాబు కథానాయకుడుగా మదన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు గీత. అయితే ముందుగా చేయనన్నా చిత్ర బృందం బలవంతంగా ఒప్పించిందట. ఈ పాత్ర మంచి గుర్తింపు ఇవ్వడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.