వెండితెర ప్రేమా... నీకు వేయి వందనాలు
      చిరునవ్వులిస్తే... చితినుంచి బతికొస్తా... మరుజన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా!  -ఓ ప్రేమికుడి ఆకాంక్ష                                                                                                
ప్రేమ రెండు గుండెల చప్పుడు. రెండు హృదయాల స్పందన. నాలుగు పెదవుల ఏక తాళం. ఇద్దరు వ్యక్తుల గాఢానుబంధం. యుగయుగాలుగా ఎంతోమంది ఎంతలా నిర్వచించినా... ఇంకా మిగిలే ఉన్న రసవత్తర, మహత్తర కావ్యం. ఇక వెండితెర ప్రేమ మహిమ ఎన్న తరమా? భాషా బేధం లేకుండా అన్ని ప్రాంతాల వారిని అలరించే ఒకే ఒక్క జోనర్‌ లవ్‌ అండ్‌ రొమాన్స్‌. బాలీవుడ్‌ మొదలుకుని టాలీవుడ్‌ వరకూ ఈ సినిమాలు నమోదు చేసిన సంచలన విజయాలు కోకొల్లలు. ప్రేక్షకులని భావోద్వేగాలతో కట్టి పడేసి కనికట్టు చేసే చిత్రాలు ఎన్నో... ఎన్నెన్నో? ఆడమ్, ఈవ్‌ ఆపిల్‌పై వ్యామోహం పెంచుకున్నప్పటి నుంచి రెండక్షరాల ప్రేమ అటు గగనానికి, ఇటు భువనానికి అందమైన వంతెన వేసింది. సరిగ్గా అలాగే... కదిలే బొమ్మలు కబుర్లు చెప్పడం మొదలు పెట్టినప్పటి నుంచి అదే ప్రేమ తెరంతా ఆక్రమించుకుని విశ్వ రూపాన్ని చూపింది. ఇంకా... ఇంకా చూపుతోంది. వేలకొద్దీ సినిమాల్లో టన్నుల కొద్దీ ప్రేమ, ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తూనే ఉంది. ప్రేమ సినిమాలకు ఎక్స్‌పైర్‌ డేట్‌ లేనేలేదు. కొత్తగా వయసు వసంతాల ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న కొత్త తరానికి ఎప్పుడూ ప్రేమకథలు కొంగ్రొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే... నిర్మాతలు దర్శకులు ఎలాంటి సినిమాలు తీసినా యువతరాన్ని ఆకర్షించేందుకు ప్రేమ కధల్ని నడిపిస్తుంటారు. ఎలాంటి సినిమా తీసినా... ఈ ప్రేమ తప్పనిసరి. ఇదే సమయంలో... కేవలం ప్రేమకథల్ని మాత్రమే తీసి అలరించే దర్శకులు కూడా ఉన్నారు. వారందించిన ప్రేమ సినిమాలు సినీ ధరిత్రిలో సరికొత్త చరిత్ర లిఖించాయని చెప్పొచ్చు. ఆకుపచ్చని వనాలు, చెట్టాపట్టాలు వేసుకున్న జంటలు, మనసుకు హత్తుకునే పాటలతో అలరించే ప్రేమ సినిమాల్ని ఆదరించే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఫిబ్రవరి 14 వాలెంటయిన్స్‌ డే ప్రేమ వారోత్సవాల సందర్భంగా అప్పటికీ... ఇప్పటికీ... ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెదరని స్థానాన్ని సముపార్జించుకున్న కొన్ని ప్రేమ చిత్రాల విహంగ వీక్షణం.


* విషాద ప్రేమికుడు దేవదాసు
సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్‌ చంద్ర రచించిన ‘దేవదాసు’ చిత్రం ప్రేమ కథా చిత్రాల్లో అగ్రస్థానంలో ఇప్పటికీ ఉంది. బహుభాషల్లో మళ్లీ మళ్లీ నిర్మించినా... ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన ‘దేవదాసు’ మాత్రం తెలుగు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే దక్కుతుందంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆ తరువాత తెలుగులోనే కృష్ణ, బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌ కధానాయకులుగా లేటెస్ట్‌గా చేసినా... అక్కినేని సృష్టించిన చరిత్రను తిరిగి రాయలేకపోయారు. ధనవంతుడయిన కథానాయకుడు పొరుగున ఉన్న పేద అమ్మాయిని ప్రేమించడం... ఆ ప్రేమ విషాదాంతం కావడం దేవదాసు ఇతివృత్తం. ఇందులో... అక్కినేనికి జతగా అలనాటి మేటి నటి సావిత్రి నటించడం... ఆ జంటకు ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన చిత్ర విజయానికి ప్రధాన కారణమయింది.* మధుర ప్రేమ- ప్రేమ
1989లో విడుదలైన మ్యూజికల్‌ రొమాంటిక్‌ మూవీ ‘ప్రేమ’. రాజేశ్వరి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకటేష్, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమకి పట్టం కట్టింది. సుశ్రావ్య గీతాలు విజయానికి సహకరించాయి. అప్పట్లో ఎక్కడ విన్నా... ఈ చిత్ర గీతికలు హల్చల్‌ చేశాయి. సంగీతాభిరుచి ఉన్న ఓ అనాథకి, ఓ అందమైన అమ్మాయికి మధ్య సాగిన ప్రేమ ప్రయాణం ఈ చిత్రం. ఇళయరాజా సంగీతం మెస్మరైజ్‌ చేసింది. ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో తరచూ ప్రసారం అవుతూ తన ఉనికిని చాటుకుంటోంది.


* బాలచందర్‌ ‘మరో చరిత్ర’

భీమ్లీ అందాలు తెరకి ఎక్కిస్తూ బాలచందర్‌ తీసిన చిత్రం ‘మరో చరిత్ర’. 1978లో విడుదలైన రొమాంటిక్‌ ట్రాజెడీ మూవీ ఇది. కమలహాసన్, సరిత, మాధవి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేమకథా చిత్రాల్లో తలమానికంగా నిలిచిందని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో ‘ఏక్‌ దూజేకే లియే’ పేరుతో అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. బాలచందర్‌కి ఉత్తమ దర్శకుడు అవార్డుని సదరన్‌ ఫిలిం ఫేర్‌ అందించి సత్కరించింది. ప్రేమో... ఆకర్షణో తేలాలంటే ఒక్క సంవత్సరం నాయికా నాయకులు కలవకుండా దూరంగా ఉండాలనే షరతు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం చివరికి విషాదాంతమవుతుంది. ఇందులో కమల హాసన్‌ నటనతో పాటు ప్రేమికురాలిగా తొలిసారి సినీ రంగ ప్రవేశం చేసిన సరిత కూడా అంటే చలాకీగా నటించి ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఆత్రేయ పాటలు అల్లరి అల్లరిగానే కాదు... గుండెను పిండేసే విధంగా కూడా ఉన్నాయి.

* కళాతపస్వి ‘శంకరాభరణం’

ప్రేమలో మరో కోణాన్ని అందంగా... అందరికీ ఆమోదయోగ్యంగా అందించిన చిత్రం కె.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’. పూర్ణోదయా ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని దేశదేశాల్లో చాటి చెప్పింది. చాలా క్లిష్టమైన సబ్జెక్టు. ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదో... తెలీని మీమాంస. అయినా... సాహసించి చిత్ర యూనిట్‌ ఈ సినిమాని తెరకి ఎక్కించింది. సంచలన విజయాల్ని మూటగట్టుకుంది. దేవదాసి పాత్రలో మంజుభార్గవి నటించగా ఆమె సరసన జెవి సోమయాజులు నటించడమే ఈ చిత్రంలో కీలకాంశం. కర్ణాటక సంగీత కళాకారుడిగా ఆయన నటన రక్తి కట్టిస్తుంది. నాయికా నాయకుల మధ్య ప్లేటోనిక్‌ లవ్‌ హైలెట్‌. జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమా సాధించిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత నటన ప్రదర్శించిన 25 చిత్రాల్లో ఒకటిగా జెవి సోమయాజులు కీర్తిని ఇనుమడింపచేసిన చిత్రంగా ‘శంకరాభరణం’ నిలిచిపోయింది. కె.విశ్వనాధ్‌ సినిమాల్లో మరికొన్ని మణిపూసలనదగ్గ ప్రేమ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ‘సప్తపది’, ‘శుభోదయం’ చిత్రాలు ఉన్నాయి.


* మణిరత్నం ‘గీతాంజలి’
దర్శకుడు మణిరత్నం ప్రేమకథ చిత్రాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. హృదయాల్ని మెలిపెట్టే సన్నివేశాల కల్పనలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సినిమాల్లో ‘గీతాంజలి’ చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని సంపాందించుకుంది. మంచి పాటలు, ఆర్ద్రత గల సందర్భాలు, గుండెల్లో సూటిగా దిగే సంభాషణలు, కళాకారుల నటన... ఇవీ ఈ సినిమాని శిఖరం అంచున నిలబెట్టాయి. ప్రత్యేకించి వేటూరి కలం విరచించిన గీతాలు ఆపాతమధురాలు. ఎంతటి విషాదం గుండెల్లో గూడు కట్టి ఉన్నా మృత్యువు వరించేవరకూ ప్రతి క్షణాన్ని ఆనంద క్షణంగా మలచుకోవాలని సందేశాన్ని ప్రేమపూర్వకంగా అందించిన చిత్రం ‘గీతాంజలి’. ఇదే దర్శకుడు ‘రోజా’, ‘బొంబాయి’, ‘ఓకె బంగారం’లాంటి చిత్రాల్లోనూ ప్రేమను పండించారు.
* గౌతమ్‌ మీనన్‌ ‘ఏ మాయ చేసా
గౌతమ్‌ మీనన్‌ కూడా ప్రేమ కథాచిత్రాల్ని సృజనాత్మకంగా చెక్కిన శిల్పి. ఈయన ‘ఏ మాయ చేసావే’..., ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’...లాంటి ప్రేమకథ చిత్రాలు తీశారు. ‘ఏ మాయ చేసాî’ే చిత్రంలో కధానాయకుడి కన్నా కాస్త ఎక్కువ వయసు ఉన్న కథానాయిక ప్రేమ ఇతివృత్తం. రెహమాన్‌ సంగీతంలో పాటలు ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. అలాగే... నాని, సమంత జంటగా వచ్చిన ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం కూడా ఆద్యంతం ప్రేమలో తడిసి ముద్దయినవే.


* వన్‌ సైడ్‌ లవ్‌కి అర్ధం చెప్పిన ‘ఆర్య’

ప్రతీ ప్రేమ సక్సెస్‌ కాదు. వన్‌ సైడ్‌ ప్రేమ నరకాన్ని తలపిస్తుంది. వన్‌ సైడ్‌ ప్రేమికులకు ఊరట కలిగించేలా సుకుమార్‌ దర్శకత్వంలో వెలువడిన చిత్రం ‘ఆర్య’. అల్లు అర్జున్‌ ఎనర్జిటిక్‌ ఫెర్పార్మెన్స్, సుకుమార్‌ సృజనాత్మక ప్రతిభ ఈ చిత్రాన్ని సుందరంగా, సురుచిరంగా తీర్చిదిద్దాయి. నాయిక అను మెహతా అభినయం కూడా ప్రశంసించదగ్గదే. పాటలు కూడా జనరంజకంగా రూపొందాయి. దాంతో... ఈ సినిమా విజయాన్ని అందుకుంది.


* ‘అర్జున్‌ రెడితో మరో తరహా ప్రేమ
ఇలా చెప్పుకుంటూ పోతే వేలకొద్దీ సినిమాలు ప్రేమకు పట్టాభిషేకం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’? ‘బొమ్మరిలు’్ల, ‘గీత గోవిందం’, ‘అలా మొదలైంది’, ‘మళ్ళీ మళ్ళీ రాని రోజు’, ‘పెళ్లి చూపులు’, ‘నువ్వు నేను’, ‘బాలు’, పవన్‌ కళ్యాణ్‌ ‘తొలి ప్రేమ’, ఇటీవల వరుణ్‌ తేజ్, రాశీ ఖన్నా జంటగా వచ్చిన మరో ‘తొలి ప్రేమ’ ఇలా అనేకానేక సినిమాలు వచ్చాయి. అయితే బోల్డ్‌ నెస్‌ని జత చేస్తూ ప్రేమకథల దశ, దిశ మారుస్తున్న కొన్ని చిత్రాల్లో ‘అర్జున్‌ రెడ్డి’ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ బాటలో వరుస సినిమాలు చిత్రసీమను ఊపేస్తున్నాయి. బోల్డ్‌ నెస్‌ను ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నట్లు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ తరహా చిత్రాలే సాక్ష్యం. కాగా...ఒకప్పుడు సున్నితంగా ఉన్న ప్రేమ ఈ మధ్య రాక్షసానందాన్ని అందిస్తోందని విమర్శకులు కూడా ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఉపేంద్ర ఈ తరహా ప్రేమలకు ఆజ్యం పోశారు. ‘ఓంకారం’ చిత్రంలో ఆయన శాడిస్ట్‌ లవర్‌ని పరిచయం చేశారు. ఆలాగే... శాడిస్ట్‌ ప్రేమలు కూడా తెరకి ఎక్కుతున్నాయి. శక్తివంతమైన సినిమా ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలిసిన విషయమే. అలాంటి శక్తివంతమైన మీడియాని వినియోగించుకుంటున్న ప్రతికూల ఫలితాలు పడనీయని మంచి చిత్రాలను బాధ్యతాయుతంగా నిర్మించాలని సామాజికవేత్తలు కోరడంలో తప్పు లేదు. కొన్ని ప్రేమకథా చిత్రాలకు ప్రభావం పొందిన యువత శాడిస్టులుగా మారి ప్రేమ పేరుతో యువతుల్ని వేధించడం, సాధించడం, దాడులు సైతం చేయడంలాంటి సంఘటనలు కూడా వార్తా పత్రికల్లో పతాక శీర్షికలు అవుతుండడం అందరూ గమనిస్తున్నదే.


* ఉప సంహారం
మంచులో తడిసిన గులాబీ పువ్వులా మనోహరంగా ఉండాలి ప్రేమ. మనసును చిదిమేసే కత్తి మొనలా ఉండకూడదు కదా? మనసుని తట్టే మధుర ప్రేమలకు ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. మంచి ప్రేమకథల్ని సమాదరిద్దాం... సత్కరిద్దాం. ప్రేమా... నీ మహిమ ఎన్న తరమా? అంటూ అభినందిద్దాం.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌ 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.