‘మీటూ’ స్ఫూర్తితో.. ఒక్కొరొక్కరిగా!
మీటూ ఉద్యమం స్ఫూర్తితో మహిళలు ఒక్కరొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. నానాపటేకర్‌పై తనుశ్రీదత్తా చేసిన లైంగిక ఆరోపణలతో నెమ్మదిగా మొదలై..దర్శకుడు వికాస్‌భల్‌పై కథానాయిక కంగనా రనౌత్‌ చేసిన ఆరోపణలతో ఈ ఉద్యమం  ఊపందుకొంది. బాలీవుడ్‌, దక్షిణాది అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా బాలీవుడ్‌ గాయని సోనా మొహాపాత్ర ముందుకొచ్చారు. గాయకుడు కైలాస్‌ఖేర్‌ తనతో  అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె సోషల్‌  మీడియాలో ఆరోపించారు.

‘‘ కచేరీ విషయమై కాఫీ షాపులో కైలాస్‌ను కలిసినప్పుడు ‘మీరు చాలా అందంగా ఉన్నారంటూ నాపై చేతులు వేశాడు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఢాకా వెళ్లినపుడు పదే పదే ఫోన్‌ చేసి తన గదికి రావాలని అడిగాడు’’అని చెప్పారు సోనా. కైలాస్‌పై ఓ పాత్రికేయురాలు కూడా ఆరోపణలు చేశారు. దానికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ విషయం గురించి సోనా మాట్లాడుతూ ‘‘మీరు ఎంతమంది ఆడ వాళ్లకు క్షమాపణలు చెబుతారు కైలాస్‌? క్షమాపణలు చెప్పుకుంటూ పోతే మీ జీవితం సరిపోదేమో’’ అని వ్యాఖ్యానించారు. నటుడు అలోక్‌నాథ్‌పై మరో నటి సంధ్యా మృదుల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ‘‘ఓ ధారావాహికలో నాకు తండ్రి పాత్రలో ఉన్న అలోక్‌, కొడైకెనాల్‌లో మద్యం సేవించి నా గదిలోకి వచ్చి నన్ను తనవైపు లాక్కోబోతుంటే ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను. తను చెప్పినట్టు వినకపోవడంతో ముంబయి వచ్చాకా నా గురించి అందరికీ చెడుగా చెప్పాడు’’ అని తెలిపారు సంధ్య. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో తనూ వేధింపులకు గురయ్యానని తెలిపారు నటి అమైరా దస్తూర్‌. ‘క్వీన్‌’ దర్శకుడు వికాస్‌భల్‌పై ఆ చిత్రంలో నటించిన కంగనా, నైనా దీక్షిత్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్‌ సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగిని కూడా భల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఫాంటమ్‌ భాగస్వాముల్లో ఒకరైన ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మామి’ బోర్డు సభ్యుడిగా ఉన్న  అనురాగ్‌ ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేవరకు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వికాస్‌సై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయన తెరకెక్కిస్తున హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘సూపర్‌ 30’ నుంచి దర్శకుడిగా తన పేరును తొలగించినట్లు సమాచారం. తమిళ రచయిత వైరముత్తు తనపై వస్తున్న ఆరోపణలపై ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘గతంలోనూ నాపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో ఇదీ ఒకటి’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ప్రముఖ గాయని చిన్మయి పలువురు బాధిత మహిళలు, యువతుల కథల్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ గాయని ఆరోపించారు. కర్నాటక సంగీత విధ్వాంసుడు ఒ.యస్‌.త్యాగరాజన్‌ తనపై లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆరోపించింది. అలాగే శశికిరణ్‌ అనే సంగీత విధ్వాంసుడిపై కూడా ఓ యువతి ఆరోపణలు చేశారు. మరోపక్క రచయిత వైరముత్తు బాధితులు మరికొంత మంది తమకి ఎదురైన అనుభవాల్ని చిన్మయి ద్వారా బయటపెట్టారు. ‘మీటూ’ ఉద్యమానికి సినీ తారల మద్దతు పెరుగుతుంది. బాలీవుడ్‌ కథానాయికలు ఐశ్వర్యరాయ్‌, సోహా అలీఖాన్‌, నేహా ధూపియా, సోఫి చౌదరి ‘మీటూ’కు మద్దతుగా  నిలిచారు.

 * సైరాట్‌ దర్శకుడిపై మాజీ భార్య ఆరోపణలు..
 మరాఠీ చిత్రం ‘సైరాట్‌’తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులేపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన మాజీ భార్య సునీత. నాగ్‌రాజ్‌ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడంటూ సునీత మీడియాతో చెప్పారు. ‘‘నాకు 18 ఏళ్లకే నాగ్‌రాజ్‌తో పెళ్లైంది. ఆయన ఇంటికి అమ్మాయిల్ని తెచ్చుకొనేవాడు. వాళ్లకూ నేనే వండిపెట్టాల్సి వచ్చేది. గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చాలా వేధించాడు. అతని కారణంగా మూడుసార్లు గర్భాన్ని పోగొట్టుకున్నాను. ఇక భరించలేక 2014లో చట్టప్రకారం విడిపోయాం’’ అని చెప్పారు సునీత.


* దర్శకుడి చెంప చెళ్లుమనిపించింది..
తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బాలీవుడ్‌ దర్శకుడి చెంప చెళ్లుమనిపించింది సినీ నటి గీతిక త్యాగి. బాలీవుడ్‌లో వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ దర్శకుడు సుభాష్‌ కపూర్‌ తనను లైంగికంగా వేధించాడని గీతిక ఆరోపిస్తున్నారు. సుభాష్‌కు ఎడమ చేయి లేదు. అయినప్పటికీ ప్రతిభతో మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారని బాలీవుడ్‌లో అతనికి పేరుంది. కానీ సుభాష్‌ నిజ స్వరూపం ఇది అంటూ ఆయనకు సంబంధించిన ఓ వీడియోను గీతిక ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. సుభాష్‌ ఎలాంటివాడో చెప్పడానికి గీతిక అతన్ని, అతని భార్య డింపుల్‌ను ఓ స్టూడియోకు రమ్మన్నారు.

 ఆ సమయంలో సుభాష్‌ తన భార్యకు జరిగినదంతా చెబుతూ తన తప్పేంలేదని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు వీడియోలో కన్పించారు. సుభాష్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ గీతిక ఏడ్చారు. భార్య పక్కనుండగానే గీతిక అతని చెంపపై కొట్టారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటకు వచ్చింది. సుభాష్‌ తన భార్య ముందు ఏదో చెబుతున్న వీడియోను గీతిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే గీతిక పోస్ట్‌ చేసిన వీడియోలో సుభాష్‌ను తిడుతున్నట్లు మాత్రమే ఉంది. అతన్ని కొట్టిన దృశ్యాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఆ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌లో వచ్చిన ‘ఆత్మ’ అనే చిత్రంలో గీతిక నటించారు. ఇందులో సినీ నటి బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఆరోపణలు బయటికి రావడంతో సుభాష్‌ కపూర్‌తో దర్శకత్వం వహిస్తున్న ‘మొఘల్’ సినిమా నుంచి ఆమిర్ ఖాన్‌ తప్పుకొన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌.. సుభాష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.