ఆ మిథునం పోయినా.. ఇప్పుడెన్నో మిథునాలు తీస్తున్నా!!
ఆయన కలం నుంచి వచ్చే ప్రతి మాట మిద్దె తరగతికి, మధ్య తరగతికి, అద్దె తరగతికి ఎదురైన అనుభవాలే. ప్రతి మనిషి ఈదే సాగరాలే. అదే ఆయన మాటల్లో ఉన్న మత్తు.. ఆయన మాటలు చేసే గమ్మత్తు.. మాటలతోనే కాదు, తన నటనతోనూ అన్ని తరగతుల వారినీ మెప్పించారు. ఆయనే ఎల్బీ శ్రీరామ్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

ఎల్‌.బి. శ్రీరామ్‌ అంటే.. మీ పూర్తి పేరు చెప్పండి!
ఎల్బీ శ్రీరామ్‌: లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి.

పేరులో లంకని, రాముడిని పెట్టుకుని తిరుగుతున్నారు? అసలు లంకలో రాముడు ఏంటి?
ఎల్బీ శ్రీరామ్‌: సరదాగా చెప్పుకోవాలంటే లంకను జయించిన రాముడు అని అనుకోవచ్చు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 'లంక' ఇంటి పేరు కలిగిన వాళ్లు అన్ని వర్ణాల్లో ఉన్నారు. నేను కూడా లంక అనే ఇంటి పేరు కలిగిన కుటుంబంలో పుట్టానంతే. మేము ఏడుగురం అన్నదమ్ములం. ఏడు పేర్లు కావాలి. నా వాటాగా రాముడి పేరు వచ్చింది. శ్రీరామచంద్రమూర్తి అని మా నాన్నగారు ఈ పేరు పెట్టారు.

అసలు మీ సొంత ఊరు ఏది?
ఎల్బీ శ్రీరామ్‌: కోనసీమలోని నేదుమూరు అగ్రహారం. అప్పట్లో అక్కడి జమీందారు మా నాన్నగారిని పిలిచి ఈ అగ్రహారం ఇచ్చారు. నేను అక్కడే పుట్టాను.

మీ గొడుగును నేను(ఆలీ) కొట్టేశానా?
ఎల్బీ శ్రీరామ్‌: ఆలీ నా గొడుగు కొట్టేశాడా? లేదా? అన్న విషయం మీరే(ప్రేక్షకులు)చెప్పాలి. 'జయం మనదేరా' షూటింగ్‌ నిమిత్తం 20రోజుల పాటు యూరప్‌ వెళ్లాం. బస్సులో రోజుకొక ఊరు తిప్పుతూ ఉండేవారు. సాధారణంగా నేను విదేశాలకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ఉన్న వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తా. అలా ఒకరోజు షూటింగ్‌ జరుగుతుండగా నా దృష్టి ఓ గొడుగుపై పడింది. అది ఆకుపచ్చ రంగులో చూడ ముచ్చటగా భలే ఉంది. వెంటనే కొనేశా. విదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైనా చివరి రోజున వస్తువులను కొనుగోలు చేస్తారు. కానీ, నేను మొదటిరోజే కొన్నా. పైగా నాతో తెచ్చుకున్న సామాన్లు చూసి బ్రహ్మానందంగారు, ఆలీ అందరూ నవ్వేవారు. ఉన్నన్ని రోజులూ గొడుగు కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఒకరోజు షూటింగ్‌ అయిపోయిన తర్వాత గొడుగు మర్చిపోయి వెళ్లిపోయా. రూమ్‌కు వెళ్లి నీరసంగా ఉంటే ఈయన(ఆలీ)వచ్చి 'ఏమైంది' అని అడిగారు. 'గొడుగు కొన్నాను. పోయింది' అని చెప్పగానే 'ఇదేనా' అని తీసి ఇచ్చాడు. ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. అలా రోజూ నేను ఎక్కడో ఒక చోట గొడుగు మర్చిపోవడం.. ఆలీ తీసుకొచ్చి ఇవ్వడం. ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎయిర్‌పోర్ట్‌లో గొడుగు మర్చిపోయా. ఇంటికొచ్చి దిగాలుగా కూర్చొంటే, ఫోన్‌ మోగింది. 'ఎల్బీ గొడుగు పోయిందా? కింద మా డ్రైవర్‌ నీ గొడుగుతో ఉన్నాడు చూడు' అని ఆలీ ఫోన్‌. ఇప్పుడు చెప్పండి. నా గొడుగు నిజంగా నేను పొగొట్టుకున్నానా? లేక ఆలీ కొట్టేసి నాకే ఇస్తున్నాడా? (నవ్వులు)


మీలో రచయిత, నటుడు, నిర్మాత కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు?

ఎల్బీ శ్రీరామ్‌: 24 క్రాఫ్ట్‌ల్లో ఒక నాలుగు లేవేమో.. మిగిలిన అన్నింటిలోనూ నాకు అనుభవం ఉంది. అవసరమైతే కుట్టు పని కూడా చేస్తా. నా సినిమాలకు అవసరమైన కాస్ట్యూమ్స్‌ కుడతా కూడా. ఆత్రేయపురం పూతరేకుల దుకాణం అంత చిన్నది నా సినిమా. అందుకే అన్నీ నేనే చేసుకోవాలి.

చిన్నప్పటి నుంచి ఒక కల మిమ్మల్ని బాగా వేధించేదట! ఏంటా కల?
ఎల్బీ శ్రీరామ్‌: హైస్కూల్లో నేను బెస్ట్‌ స్టూడెంట్‌. కాలేజ్‌కు వెళ్లిన తర్వాత స్టైల్‌ పెరిగింది. తిరిగి తిరిగి ఇలా వచ్చా. చిన్నప్పుడు నన్నందరూ 'భద్రాద్రి' అని పిలిచేవారు. నేను ఆరో, ఏడో చదువుతుండగా నేను చనిపోయినట్టు ఒక కల వచ్చేది. ఆ కలలో పిల్లలందరూ పెద్ద పండగా చేసుకుంటున్నారు. నాకు పాడె కట్టి 'భద్రాద్రికి జై.. భద్రాద్రికి జై' అని మోసుకెళ్తున్నారు. ఊరంతా తిప్పి మా ఇంటికి తీసుకు రాగానే, నేను లేచి ఇంట్లోకి వెళ్లి, 'నేను చచ్చిపోయా. అందరికీ చెప్పి వెళ్దామని వచ్చా' అని ఇంట్లో వాళ్లకు చెప్పేవాడిని. ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె నేను వెళ్లిపోయేందుకు ఒప్పుకొనేది కాదు. 'కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి నాకు సమయం ఉంది. నేను వెళ్లిపోవాలి' అని ఆమె చెప్పేవాడిని'' ఇలా ఈ కల నెలకొకసారైనా వచ్చేది.(నవ్వులు)

ఇటీవల యూనిఫాం వేసుకుని స్కూల్‌కు వెళ్లినట్లున్నారు?
ఎల్బీ శ్రీరామ్‌: నేను చదువుకున్న పాఠశాల పెట్టి 2015 నాటికి 50ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేద్దామని నిర్వాహకులు ప్రతిపాదించారు. నేను చిత్ర పరిశ్రమలో ఉండటంతో వినూత్నంగా చేయడానికి సలహాలు ఇవ్వమని అడిగారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చే వారందరూ యూనిఫాంతో వస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. వారికీ నచ్చింది. అయితే, సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేను ఇచ్చిన సలహా గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అడిగితే, 'ఇప్పుడు యూనిఫాం వేసుకొని వస్తే ఏం బాగుంటుంది' అని అందరూ సిగ్గుపడుతున్నారని చెప్పారు. అరే! భలే ఐడియా ఇలా తుస్సుమన్నదేంటి? అనుకున్నా. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న వాళ్లైనా యూనిఫాంలో వస్తే బాగుంటుందని చెప్పా. 'అతిథులందరూ మంచి బట్టల్లో వస్తే, మేం యూనిఫాం వేసుకుని రావాలా' అని పిల్లలు అడిగారట. దాంతో ఆ ప్రతిపాదన కూడా పోయింది. దాంతో నేనే ధైర్యం చేసి, 'నేను ఇప్పటివరకూ దాదాపు 500 సినిమాల్లో వివిధ వేషాలు వేశాను. ఇది 501వ వేషంగా స్కూల్‌ యూనిఫాం వేసుకుని వస్తా' అని చెప్పా. అందరూ ఆశ్చర్యపోయారు. కార్యక్రమం రోజున స్కూల్‌ యూనిఫాం వేసుకుని, నోట్లో బూర ఊదుకుంటూ సైకిల్‌ వేసుకుని పాఠశాలకు వెళ్లా. ఇక ఈ కార్యక్రమానికి వచ్చే గురువులను పల్లకిలో తీసుకెళ్లాలని ఆలోచన చెబితే, అందరూ నన్ను కూడా దానిలో ఎక్కించుకుని వేదిక వద్దకు తీసుకెళ్లారు.


యూరప్‌లో హోటల్‌ గది తాళం పోగొట్టుకుంటే పైపు పట్టుకుని వెనకనుంచి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది?
ఎల్బీ శ్రీరామ్‌: చాలా పెద్ద హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశారు. ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు. ఒకసారి కింద వెళ్లి వచ్చిన తర్వాత నా గది నంబరు మర్చిపోయా. తాళం కూడా ఎక్కడ పెట్టానో గుర్తు లేదు. ఆ రోజు నువ్వు(ఆలీ) కనపడ్డావు. లేకపోతే ఎటు వెళ్లిపోయేవాడినో.

సినిమాలో మీరు మాట్లాడే విధానం, మేనరిజానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా?
ఎల్బీ శ్రీరామ్‌: అలా మాట్లాడేవాడు మా ఊళ్లో ఒకడున్నాడు. చెరువు నుంచి నీళ్లు తెచ్చి, ప్రతి ఇంటికి పోస్తాడు. 'నువ్వంటే నాకిష్టం' సినిమాలో కూడా ఆ పాత్రను నేను చేశా. ఈ పాత్ర గురించి ఈవీవీ గారికి చెప్పక ముందే, వి.వి. వినాయక్‌కు చెప్పా. అతను కో-డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఇద్దరం కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఈవీవీ సత్యనారాయణగారి తర్వాత మంచి స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తి వినాయక్‌. మేం కూర్చొని మాట్లాడటం మొదలు పెడితే, సమయమే తెలిసేది కాదు.

'చాలా బాగుంది' మీ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ కదా!
ఎల్బీ శ్రీరామ్‌: రచయితగా నాకు నేను చిన్న విరామం ఇచ్చి, చేసిన సినిమా అది. అందులో రెండు సీన్ల పాత్ర అది. తొలుత ఈ పాత్రను 'రామసక్కనోడు'లో పెట్టాం. సినిమా ఆడలేదు కానీ, ఆ పాత్ర ఈవీవీ గారికి బాగా నచ్చింది. దాంతో 'చాలా బాగుంది'లో ఏకంగా 20 సీన్లు రాశారు. అలా ఆ పాత్ర మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకన్నా ముందు నేను కూడా వేషాల కోసం తిరిగాను. దాదాపు 50 పాత్రలకు సంబంధించిన గెటప్‌లు వేసుకుని, ఒక ఫొటో గ్రాఫర్‌తో ఫొటోలు తీయించా. వాటిని పట్టుకుని వెళ్లి కృష్ణవంశీ గారికి కలిశా. 'రండి.. రండి.. కథ ఏమైనా పట్టుకొచ్చారా' అని ఆయన అడిగారు. 'కాదండీ. నేను ఆర్టిస్ట్‌ను అవుదామని అనుకుంటున్నా. అందుకే ఫొటోలు పట్టుకొచ్చా' అని చెప్పా. వాటిని చూసి, 'చాలా బాగున్నాయి. ప్రతి దానిలో ఒక మంచి పాత్ర ఉంది' అని కితాబిచ్చారు. 'మీరు సినిమా చేస్తే, మీకు ఇందులో ఏ పాత్ర సరిపోతే, ఆ పాత్ర నాతో వేయించాలి' అని అడిగా. అందుకు ఆయన 'నేను ఏదైనా పాత్ర అనుకున్న తర్వాత ఆ పాత్రకు ఎవరు సరిపోతారా? అని వెతుక్కుంటూ వెళ్తాను తప్ప. ఎల్బీ శ్రీరామ్‌ కోసం ప్రత్యేకంగా పాత్రను రాయలేను. మీరు ఈవీవీ గారిని కలవండి' అని సమాధామిచ్చారు. అప్పటికే రచయితగా ఆయన దగ్గర పనిచేసి ఉండటంతో అడగటానికి మొహమాటం అడ్డం వచ్చింది. ఎలాగో వెళ్లి నేను దిగిన 50 ఫొటోలను ఆయన ముందు పెట్టా. వాటిల్లో 20 ఫొటోలను తన దగ్గర పెట్టుకుని, తన సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎంతమందిని పేరు పెట్టి పిలిచినా, నన్ను మాత్రం, 'మీరు..' 'ఎల్బీగారు' అని పిలిచేవారు.


ఎల్బీ శ్రీరామ్‌ డైలాగ్‌లు చాలా ఆలస్యంగా ఇస్తారని టాక్‌. మీరేం అంటారు?
ఎల్బీ శ్రీరామ్‌: ఇండస్ట్రీ చాలా చిన్నది. ఆ విషయం చెప్పాల్సింది ప్రపంచం. నేను రాసింది 40 సినిమాలే అయినా, మంచి గుర్తింపు ఉన్న చిత్రాలే రాశా. అందుకే నేను చెబుతుంటా. 'తపనలేని ప్రతిభ కంటే, ప్రతిభ లేని తపన గొప్పది'.

హార్ట్‌ మూవీ(లఘు చిత్రాలు) లు ఎందుకు చేస్తున్నారు? వాటి వల్ల మీకు నష్టమా? లాభమా?
ఎల్బీ శ్రీరామ్‌: డబ్బు ఒక్కటే రాదు. మిగతా అన్నీ లాభాలే. పేరుతో పాటు, చాలా వస్తాయి. అన్ని విభాగాలు నేనే చూసుకుంటా. ఎడిటింగ్‌ కూడా నేనే చేస్తా. నా అభిరుచికి తగ్గట్టు కథలు ఎంచుకుంటా. నా రచనా ప్రతిభ అంతా వీటిల్లోనే చూపిస్తున్నా. ఇప్పటివరకూ దాదాపు 25 సినిమాలు చేశా. నేను కేవలం కథ మాత్రం వేరే వాళ్లది తీసుకుంటా. మిగిలిన విషయాలన్నీ నేనే చూసుకుంటా. పెద్ద సినిమాల్లో నేను చేయలేకపోయిన పాత్రలు ఇందులో చేస్తున్నా.

ఈ సినిమాల ద్వారా సమాజానికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు?
ఎల్బీ శ్రీరామ్‌: తరం ఏదైనా.. కొత్తని పట్టుకోవాలి, పాతని పట్టుకెళ్లాలి. చాలా మంది ఎన్నారై యువత ఏడాది పాటు అమెరికాలో ఉద్యోగం చేసి, విసుగొచ్చి సినిమాల్లోకి వద్దామని అనుకుంటున్నారు. అలా చాలా మంది నేర్చుకుందామని నా దగ్గరకు వచ్చారు. అయితే, నేనేమీ ప్రత్యేకంగా క్లాస్‌లు చెప్పను. చూసి నేర్చుకోవాల్సిందే.


మీకు తృప్తి రచయితగానా? నటుడిగానా?
ఎల్బీ శ్రీరామ్‌: రచయితకు తృప్తి ఉంటుంది... నటుడికి సుఖం ఉంటుంది. నటుడికి సౌకర్యాల కారణంగా ఈ సుఖం వస్తుంది. అదే రచయితకు ఒక మాట రాయడానికి ప్రసవవేదన ఉంటుంది. కానీ రేపు ఆ మాటకు వచ్చే స్పందన ఆ కష్టాన్ని మరిపిస్తుంది. తృప్తినిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏ పాత్ర వచ్చినా చేసేవాడిని. వాటిలో హాస్య పాత్రలే ఎక్కువ ఉండేవి. కానీ తర్వాత ఇండస్ట్రీనే నన్ను సెంటిమెంట్‌ వైపు మళ్లించింది. అలాంటి పాత్రల్లో పేరు వచ్చింది కూడా. కానీ అవి కూడా రాన్రాను మూసలో పోసినట్లు వస్తుండడంతో నాకు నేను వద్దనుకున్నాను. ఇప్పుడీ లఘుచిత్రాలతో ఒక సంతృప్తి ఉంది. ఇక్కడ నేనే రాజు, నేనే మంత్రి కాబట్టి... నాకు నచ్చిన ఆవిష్కరణలు చేయగలుగుతున్నాను. ఇప్పుటికీ ఇండస్ట్రీలో నా గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఏ మాత్రం చెక్కుచెదరలేదు.

'మిథునం'లో మీ స్థానంలో బాలూ ఎందుకు వచ్చారు?
ఎల్బీ శ్రీరామ్‌: మామూలుగా భరణి రచయిత. ఆయన శ్రీ రమణి రాసిన 'మిథునం' తీసుకుని చేశారు. అమెరికాలోని మన తెలుగు వారందరికీ ఇళ్లలో ఈ పుస్తకం తప్పకుండా ఉంటుంది. అంత పాపులర్‌ అక్కడ. ఈ కథను బాపుగారు తన స్వహస్తాలతో రాశారు. అలాంటి కథలో మరో రచయిత అయిన నన్ను ఎంచుకున్నారు. మేం ముగ్గురం కలిసి రెండు వెర్షన్లు రాశాం. వేసవి కాలంలో అయితే, షూటింగ్‌ సరిగా చేయలేమని అక్టోబరు నెలకు మార్చమని నిర్మాత సలహా ఇచ్చారు. నన్ను అడిగితే, వద్దని చెప్పా. ఆ తర్వాత ఇదే విషయాన్ని భరణి నిర్మాతకు చెబితే, ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. నేను కూడా భరణిని పిలిచి 'అన్నయ్యా.. కానీయండి. ఒకవేళ రేపు సినిమా సరిగా ఆడకపోతే, ఆ నెపం మన మీదకు వస్తుంది. ఆడేది ఎప్పుడైనా ఆడుతుంది. పోయేది ఎప్పుడైనా పోతుంది. నిర్మాత చెప్పినట్లు కానీయండి' అని చెప్పా. అందరూ ఒప్పుకొన్నారు. నాకు జోడీగా మృణాళిని అనే ఆవిడను అనుకున్నారు. అయితే, ఆమెకు సినిమాలు చేసిన అనుభవం లేదు. దీంతో లక్ష్మిగారిని అనుకున్నాం. అక్టోబరుకు చాలా సమయం ఉండటంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. 'ఎల్బీ పక్కన లక్ష్మిగారు.. అన్న దగ్గరి నుంచి లక్ష్మీగారి పక్కన ఎల్బీ శ్రీరామ్‌ ఏంటీ' అనే స్థాయికి వెళ్లింది. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భరణి వచ్చి నన్ను అడిగితే, 'ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ నువ్వు. ముందు నిర్మాతను కాపాడుకో.' అని సలహా ఇచ్చా. భరణి మాత్రం నేను లేనిదే చేయనని చెప్పాడు. ఆ ప్రాజెక్టు పోయింది. వేరే నిర్మాతలు వచ్చి, దాన్ని టేకప్‌ చేశారు. వాళ్లు మొదటి నుంచీ బాల సుబ్రహ్మణ్యంగారిని అనుకున్నారు. దాంతో అలా ఆ సినిమా తీశారు. 'మిథునం'లో మీరు చేసినా బాగుంటుంది' అని చాలా మంది అంటారు. 'ఒక్క మిథునం పోయినా, ఎన్నో మిథునాలు తీస్తున్నా.. నాకేమీ బాధ లేదు' అని చెబుతుంటా.


ఇలాంటి కేరెక్టర్‌ చేయలేదనే అసంతృప్తి ఉందా?
ఎల్బీ శ్రీరామ్‌: నిజానికి అలాంటి అవకాశం లేదండి. ఎందుకంటే నేను అలాంటి పాత్రలు సృష్టించుకోగలను. వాటిని చేయగలను కాబట్టి. మిథునం సినిమాలో మొదట నేను చేయాల్సింది. తర్వాత మారిపోయింది. అప్పుడు కొందరు 'మిథునం' చేయకపోవడం నా సినీ జీవితంలో లోటని వ్యాఖ్యానించారు. కానీ నాకా అసంతృప్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అలాంటి లఘుచిత్రాలే తీస్తున్నాను. ఎన్నో మిథునాలను సృష్టిస్తున్నాను. 'సొంత ఊరు' సినిమాలో కాటి కాపరి పాత్ర అంటే చాలా ఇష్టం. కానీ నా కోసం అలాంటి పాత్ర ఎవరు సృష్టిస్తారు. అందుకే నేను లఘుచిత్రంలో దాన్ని చేశాను.

మీకు ఎంతమంది పిల్లలు?
ఎల్బీ శ్రీరామ్‌: ఇద్దరు. అబ్బాయి గ్రాఫిక్స్‌ విభాగంలో సినిమా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాడు. అమ్మాయికి వివాహం అయింది.

ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తున్నారా?
ఎల్బీ శ్రీరామ్‌: చేయటం లేదు. అవకాశాలు వచ్చినా, నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే, గతంలో 10 కామెడీ పాత్రలు చేస్తే, మధ్యలో ఒకటో రెండో సెంటిమెంట్‌ రోల్స్‌ వచ్చేవి. సరదాగా గడిచిపోయేది. నాతో కాంబినేషన్‌ ఉన్న హాస్యనటులు వెళ్లిపోయారు. కామెడీ ట్రాక్‌లు, పాత్రలు ఉండటం లేదు. దాని వల్ల నన్ను కమెడియన్‌గా మర్చిపోయారు. దీంతో సెంటిమెంట్‌ పాత్రలకు నన్ను పిలుస్తున్నారు. అలాంటి పాత్రలు చేసి విరక్తి వచ్చేసింది. అందుకే చేయడంలేదు. విభిన్న పాత్రలు ఇస్తే సినిమాలు చేయడానికి నేను ఇప్పటికీ రెడీ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.