అలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేదు
అది 2015.. ‘బాహుబలి’లోని ‘ఇరుక్కుపో..’ పాట విడుదలైంది. గీతం అద్భుతంగా ఉంది. ఇంతకీ ఈ చక్కటి పాట ఎవరి స్వరం నుంచి వచ్చింది? అంటూ ప్రజలు నెట్టింట్లో వెతకడం మొదలు పెట్టారు. పాడింది గాయని మోహన భోగరాజు అని తెలిసింది. ఓ కొత్త గాయని ఇంత బాగా పాడటం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మోహన ‘జై శ్రీరామ్‌’ (2013) సినిమాలోని ఓ పాట పాడారు. కానీ ‘బాహుబలి’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సైజ్‌ జీరో’ సినిమాల టైటిల్‌ సాంగ్స్‌ ఆలపించారు. ‘పిలగా నువ్వు ఇరగ.. ఇరగ..’ అంటూ హుషారు తెప్పించిన ఆమె ‘రెడ్డెమ్మ తల్లి..’ అంటూ భావోద్వేగానికి గురి చేశారు. మోహన గాయనిగా తన కెరీర్‌ గురించి  ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు మీ కోసం..

సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు?
మోహన భోగరాజు: చిన్నప్పటి నుంచి చాలా మంది గురువుల దగ్గర సంగీతం నేర్చుకున్నా. గాయని చిత్ర ఎలా పాడేవారని ఎక్కువగా గమనించేదాన్ని.


చిన్నప్పుడు ఎవరి పాటలంటే మీరు బాగా ఇష్టపడేవారు?
మోహన భోగరాజు: నాకు ప్రత్యేకంగా ఒక్కరు అని ఏమీ లేదు. అందరి పాటలు బాగా వింటుంటాను. ఎక్కువగా చిత్రగారి పాటలు వినేదాన్ని. తర్వాత సునీత, కౌశల్య.. ఇలా అందరి పాటలు వినేదాన్ని. పోటీల్లో అందరి పాటలు పాడేదాన్ని.

స్కూల్లో పాటల పోటీల్లో పాల్గొనేవారా?
మోహన భోగరాజు: పాఠశాల, కాలేజీల్లో జరిగే పోటీల్లో పాల్గొనేదాన్ని.


మీ తొలి బహుమతి?
మోహన భోగరాజు: బాల్యంలో ‘సంఘమిత్ర’ అనే సంస్థ ఏర్పాటు చేసిన పాటల పోటీల్లో పాల్గొన్నా. నేను ఇంటి నుంచి బయటికి వెళ్లి పాడటం అదే తొలిసారి. అప్పుడు సబ్‌ జూనియర్‌ విభాగంలో నాకు మొదటి బహుమతి వచ్చింది. ఇంట్లో పాటలు పాడుతూ ఉండేదాన్ని. అందుకే అమ్మ పోటీకి తీసుకెళ్లారు. అక్కడ బహుమతి రావడంతో బాగా పాడుతోందని ప్రోత్సహించారు. అమ్మానాన్నల ప్రోత్సహం వల్ల నాకు ఆసక్తి బాగా పెరిగింది.


అసలు సంగీతం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది?
మోహన భోగరాజు: నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉండేది. ఇంట్లో జరిగే ఫంక్షన్లకు, పూజలకు పాటలు పాడేదాన్ని. అందరూ బాగా పాడింది అనే వారు. దాంతో నా వాయిస్‌ అందరూ వినాలనిపించింది. అందరూ వినాలి అంటే.. సినిమాల్లోనే పాడాలి కదా. చిన్నతనం నుంచే నేపథ్య గాయని కావాలని ఉంది. కనీసం ఒక్క పాటైనా పాడాలి, అందరూ వినాలి అనుకునేదాన్ని.

ఎవరి సంగీత దర్శకత్వంలో పాడాలని మీ కోరిక?
మోహన భోగరాజు: అందరి దర్శకత్వంలో పాడాలని ఉంది.

పాటలేనా? డబ్బింగ్‌ చెప్పే అవకాశం కూడా ఉందా?
మోహన భోగరాజు: లేదు. ప్రస్తుతానికి పాటలే.


మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏది?

మోహన భోగరాజు: ‘మనోహరి..’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ‘మనోహరి..’ విన్న తర్వాత పాడింది ఎవరని వెతికామని ఈ రోజుకీ నాతో చెబుతుంటారు. ఆ పాట వచ్చినప్పుడు నాకు సోషల్‌మీడియా ఖాతాలు లేవు. అప్పట్లో నాకు వాటి గురించి పెద్దగా తెలియదు. పాట బాగుందన్నారు అనుకున్నా. కానీ, నా కోసం వెతుకుతున్నారని తెలియదు. ‘మీ కోసం చాలా వెతికాం’ అని ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా కొందరు అన్నారు. ‘బాహుబలి’ పాటతోపాటు ‘భలే భలే మగాడివోయ్‌..’, ‘ఇరగ ఇరగ..’, ఇటీవల వచ్చిన ‘రెడ్డెమ్మ తల్లి’ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చాయ్‌.

మీరు పాడిన వాటిల్లో మీకు నచ్చిన పాట?
మోహన భోగరాజు: నాకు అన్ని పాటలు ఇష్టం.


పాట పాడే అవకాశం వచ్చి చేజారిన సందర్భం?
మోహన భోగరాజు: అలాంటి సందర్భాలు ఉన్నాయి. గాయకులకు అది సాధారణం. సంగీత దర్శకుడు పాట ఎలా కావాలి అనుకుంటారో, దానికి ఎవరు పాడితే బాగుంటుందో వారి దగ్గరే పాడిస్తారు.

మీ తొలి పాట?
మోహన భోగరాజు: నేను ‘జై శ్రీరామ్‌’లో పాట పాడా. తర్వాత కాస్త బ్రేక్ వచ్చింది. కానీ నిజానికి ‘మనోహరి..’తో నా కెరీర్‌ ప్రారంభమైంది.


మీకు ఇష్టమైన హీరో?, హీరోయిన్‌?
మోహన భోగరాజు: నాకు ప్రభాస్‌ అంటే ఇష్టం. కానీ, ఆయన సినిమాలో పాడతానని ఊహించలేదు. అలాగే అల్లు అర్జున్‌ అంటే కూడా ఇష్టం. ఆయన డ్యాన్స్‌ బాగుంటుంది. ఎప్పుడూ అనుకునేదాన్ని అల్లు అర్జున్‌ పాట పాడాలని. ఈ కోరిక ‘ఇరగ ఇరగ..’తో తీరింది. తారక్‌ నటన అంటే కూడా నాకిష్టం. ‘రెడ్డెమ్మ తల్లి..’ వల్ల ఆయన సినిమాకు పాడే అవకాశం కూడా వచ్చింది. నిజంగా ఈ విషయంలో చాలా సంతోషంగా అనిపించింది. హీరోయిన్లలో అనుష్క, శ్రీదేవి అంటే ఇష్టం.


పలువురు గాయకులు నటులు అయ్యారు? మీకు నటించాలనే ఆసక్తి ఉందా?
మోహన భోగరాజు: నటనా..! లేదండీ (నవ్వుతూ). ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సింగింగ్‌పైనే ఉంది.

గాయని కాకపోయి ఉంటే, మీ కెరీర్‌ ఎలా ఉండేది?
మోహన భోగరాజు: చదువుకున్నా కాబట్టి ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని.

చిత్ర పరిశ్రమలో మీ స్నేహితులు?
మోహన భోగరాజు: కీరవాణి సర్‌ స్కూల్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో కూడా అందరూ స్నేహంగా ఉంటారు. సహాయం కూడా చేస్తుంటారు. అందువల్లే అందరితో త్వరగా కలిసిపోయా.

మీకు ఇష్టమైన ప్రదేశం?
మోహన భోగరాజు: మా ఇల్లే

మీకు ఇష్టమైన రంగు?
మోహన భోగరాజు: ఎరుపు, నలుగు

రాబోయే గాయకులకు మీరిచ్చే సలహా?
మోహన భోగరాజు: నేను ఇంకా సలహాలు ఇచ్చే స్థాయికి రాలేదు. నేర్చుకుంటున్నా, చాలా నేర్చుకోవాలి. ఎవరైనా సరే.. కష్టపడాలని మాత్రమే చెబుతా.


చిన్నప్పుడు జరిగిన ఏదైనా సరదా సంఘటన?
మోహన భోగరాజు: చిన్నప్పుడు నాకు పాఠశాలకు వెళ్లడం అంతగా ఇష్టం ఉండేది కాదు. చినుకులు పడినా.. సాకు చెప్పి ఆగిపోవాలి అనుకునేదాన్ని. కానీ బలవంతంగా పంపేవారు (నవ్వుతూ). ఎప్పుడైనా భారీ వర్షం పడితే.. ఇవాళ స్కూల్‌ లేదు అని చెబుతుంటారు కదా. అప్పుడు చాలా సంతోషపడేదాన్ని.

మీ డ్రీమ్?
మోహన భోగరాజు: నేపథ్య గాయని కావాలి అనుకున్నా. అదే నా డ్రీమ్‌. చిన్నతనం నుంచి దాని కోసం కలలు కన్నా. అదృష్టవశాత్తూ ఇప్పుడు పాడుతున్నా. నా వరకు వచ్చిన అవకాశాలు నావి అనుకుంటాను.

                           

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్‌. రాజమౌళి సినిమా కోసం పనిచేయడం ఎలా అనిపించింది?

మోహన భోగరాజు: చాలా సంతోషపడ్డా. ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమాలో నాకు అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కీరవాణి సర్‌ నాతో పాడిస్తారని కూడా అనుకోలేదు. కెరీర్‌ ప్రారంభంలో అలా జరగడం నాకు చాలా పెద్ద విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కీరవాణి సర్‌కి, రాజమౌళిగారికి ధన్యవాదాలు. అదేవిధంగా ‘రెడ్డెమ్మ తల్లి..’ పాడించిన తమన్‌ సర్‌, త్రివిక్రమ్‌గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఇక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో మంచి పాట పాడే అవకాశం ఇచ్చారు కల్యాణిమాలిక్‌ గారు. ఈ పాటను లెజెండరీ సింగర్‌ బాలుగారితో షేర్‌ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, ‘ఇరగ ఇరగ’ పాటకి మ్యూజిక్‌ ప్రొడ్యూస్‌ చేసిన జేబీగారికి కూడా థ్యాంక్స్‌. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి సంగీత దర్శకుడికీ రుణపడి ఉంటాను.

తొలి అవకాశం ఎలా వచ్చింది?
మోహన భోగరాజు: నేను కీరవాణిగారికి డెమో ఇచ్చాను. అప్పుడు నన్ను రికార్డింగ్‌కు పిలిచారు. 2013లో కోరస్‌ పాడుతూ ఉండేదాన్ని. 2015లో ‘మనోహరి..’లో పాడే అవకాశం వచ్చింది.

ఇప్పుడు ఏ సినిమాలకైనా పాడుతున్నారా?
మోహన భోగరాజు: ఓ నాలుగు, ఐదు పాటలు పాడుతున్నా. వాటి గురించి త్వరలోనే ప్రకటిస్తారు.

ఎప్పుడైనా నిరాశకు గురయ్యారా?
మోహన భోగరాజు: అంత నిరాశకు గురైన సందర్భాలు ఏమీలేవు. ఎప్పుడైనా పోటీల్లో ముందుకు వెళ్లకపోతే.. మిస్‌ అయ్యానే అని బాధపడేదాన్ని. తర్వాత మరో దాని కోసం సిద్ధమయ్యేదాన్ని.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.