నాయిక కథే ‘మౌన పోరాటం’
హీరోయిన్‌ అంటే హీరో కోటుపై మెరిసే గులాబీ. హీరోని చూసీ చూడగానే ఒళ్లు మరిచి పరవళ్లు తొక్కి వాటేసుకుని పాటేసుకునే అందాల రాశి. చెట్టాపట్టాలేసుకుని చెట్టూ పుట్టా తిరుగుతూ సొంపులు సోయగాలను తెరపై పరిచేసే వయ్యారి. థియేటర్లో ముందు వరుస ప్రేక్షకులను అలరించే సొగసుగత్తె. ఇప్పటికీ ఇదే దృక్పథంతో తయారవుతున్న వేలవేల సినిమాల్లో నాయిక పరిస్థితి ఇదే. సినీ సృజనకు కధానాయకుడు ఎంత అవసరమో... కథను నడిపించే నాయిక కూడా అంతే అవసరమన్న కనీసాలోచన లేని కమర్షియల్‌ చక్ర బంధంలో హీరోయిన్‌ అంటే అందాల ప్రదర్శనతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే ఒకానొక సక్సెస్‌ మంత్ర. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ హీరోయిన్లకి మనసు ఉంటుందని.. అది స్పందిస్తుందని, మెదడు ఉంటుందని... అది ఆలోచిస్తుందని, వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉంటాయని నిక్కచ్చిగా చెప్తూ కొంతమంది హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు నాయికా ప్రాధాన్య చిత్రాలు రూపొందిస్తూ మహిళా ఔన్నత్యాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో? మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు కొన్ని వస్తున్నా... ఈ సంఖ్య మరింతగా పెరగాలన్నదే సినీ పరిశీలకుల ఆశ. నాటి నుంచి నేటి వరకూ మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై విహంగ వీక్షణం చేస్తే... అప్పుడూ ఇప్పుడూ మంచి చిత్రాల ఒరవడి కొనసాగుతూనే ఉంది. అయితే, ఆ ఒరవడి ఉద్ధృతంగా ఉండాలన్నదే చాలామంది అభిప్రాయం.



తారలు... కాంతిధారలు
అలనాటి నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి మొదలుకుని ఎందరో తారలు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వివిధ పాత్రల్లో అనుపమాన ప్రతిభ ప్రదర్శించారు. కాంచనమాల, వెండి తెర సీతమ్మ అంజలి, జి.వరలక్ష్మి, కన్నాంబ, శాంత కుమారి, కమ్మని కథలు చెప్పే కళ్లతోనే శతకోటి భావాలు వ్యక్తీకరించే సావిత్రి, అల్లరల్లరి పాత్రల్లో హుషారుగా మెరిసే జమున, మొదటి సినిమానే ఇంటి పేరుగా మలచుకుని చిత్రసీమలో తిరుగులేని నటిగా తన ఉనికిని చాటుకున్న షావుకారు జానకి, ముద్దుముద్దుమాటలతో అలరించే బి.సరోజాదేవి, రాజకుమారి పాత్రల్లో మెప్పించిన కృష్ణకుమారి, రాజశ్రీ, విలక్షణ నటి శారద, కళాభినేత్రి వాణిశ్రీ, నటిగానే కాకుండా దర్శకత్వ బాధ్యతల్ని అలవోకగా మోసి గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కిన విజయ నిర్మల, సహజనటి జయసుధ, లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి, భారతీయ అందానికి నిలువెత్తు నిదర్శనం అంటూ సత్యజిత్‌ రే లాంటి దిగ్గజాల అభినందన అందుకున్న జయప్రద, భారతీయ చలన చిత్ర తారకగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన శ్రీదేవి, రమ్యకృష్ణ, రోజా, సౌందర్య, రంభ, సుహాసిని, సుధా చంద్రన్‌ ... ఇలా చాలామంది ఉన్నారు. వర్తమానంలో అనుష్క, నిత్యా మేనన్‌, నయనతార, సమంత, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, ఇలియానా, కమలిని ముఖర్జీ, తమన్నా, రకుల్‌, శ్రుతి హాసన్‌, కీర్తి సురేష్‌... ఇలా ఎంతో మంది చలన చిత్రాలకు ప్రతిభను అద్దుతున్నారు.

మహిళా వ్యక్తిత్వ సిరి...
‘ఆనంద్‌’, ‘గోదావరి’ చిత్రాల్లో నాయిక వ్యక్తిత్వాన్ని దర్శకుడు శేఖర్‌ కమ్ముల మలిచిన తీరు ఆద్యంతం అద్భుతం. నాయికగా కమలిని ముఖర్జీ అభినయం అభినందనీయం. శేఖర్‌ కమ్ముల తీసిన ‘ఫిదా’ చిత్రం కూడా విలక్షణం. తండ్రి పట్ల ఓ కూతురు చూపించే ప్రేమని తెరపై చూపించిన తీరు ప్రశంసనీయం. మహిళా ప్రాధాన్య చిత్రాలు మరిన్ని రావాలని... వినోదసీమలోనూ మహిళ తలెత్తుకుని నిలబడాలని ఎంతోమంది అభిలషిస్తున్నారు.

మహిళా చిత్రాల్లో మణిపూసలు

హీరోయిన్‌ అంటే హీరో చుట్టూ తిరిగే గ్లామర్‌ డాల్‌గానే చూపించకుండా... వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే చిత్రాలు కూడా అడపాదడపా వస్తూ అపఖ్యాతిని దూరం చేస్తున్నాయి. అభిరుచి ఉన్న ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ రూపొందించిన పలు చిత్రాల్లో హీరోయిన్ల వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ఈ సంస్థ ద్వారా వచ్చిన ‘మయూరి’ మహిళా చిత్రాల్లో మణిపూస అనదగ్గదే. వార్తా పత్రికలో ఎక్కడో ఓ మూల ప్రచురించిన ఓ కథనాన్ని... ‘మయూరి’ చిత్రంగా మలచడమే ఓ సంచలనం. ఓ నర్తకి ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా నర్తనం మీద అభిలాషతో ఆ అవరోధాన్ని అధిగమించి తిరిగి డాన్స్‌ కెరీర్‌ కొనసాగించడమే ఈ చిత్ర కథ. నిజానికి ఇది ఓ వాస్తవ కథ. అదే తరహాలో ఇదే సంస్థ నుంచి వచ్చిన చిత్రం ‘మౌన పోరాటం’. ఇది కూడా వాస్తవ జీవితం నుంచి తీసుకున్న ఇతివృత్తమే. ఓ అధికారిని నమ్మి వారసుడిని కని మోసపోయిన ఓ గిరిజన యువతి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చి... తన బిడ్డకి తండ్రి ఉన్నాడనే గుర్తింపు తెచ్చిన నాయిక కథే ‘మౌన పోరాటం’. ఇదే సంస్థ నుంచి వచ్చిన మరో చిత్రం ‘ప్రతిఘటన’. మూస చిత్రాల జడిలో కొట్టుకుపోతున్న చిత్రసీమకు దిక్సూచి లాంటి సినిమాగా ‘ప్రతిఘటన’ని అభివర్ణించవచ్చని విశ్లేషకులు చెప్తారు. లాయర్‌ భార్య ఝాన్సీ లెక్చరర్‌గా పనిచేస్తుంటుంది. వీధి రౌడీలతో ఎప్పుడూ అశాంతితో అలమటించే ఆ ఊళ్లో అధికార పార్టీకి చెందిన కొందరు దుండగుల ఆగడాలకు గురైన ఓ సాధారణ మహిళ, అన్యాయాన్ని ప్రతిఘటించి, సమాజంలో మార్పు కోసం చేసిన విశ్వరూప ప్రదర్శనే ఈ చిత్ర కథ. విజయశాంతి సినీ జీవితానికి ఎంతగానో ఉపకరించిన చిత్రం ‘ప్రతిఘటన’. విజయశాంతి కెరీర్‌లో ఇలాంటి చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. ‘నేటి భారతం’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘వందే మాతరం’, ‘రేపటి పౌరులు’, ‘ఆశయం’ లాంటి చిత్రాలు మహిళా ప్రాధాన్యత ఉన్నవే. అశ్వని నాచప్ప పరుగుల రాణిగా ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. ఆమెని నాయికగా తీసుకుని ఉషా కిరణ్‌ మూవీస్‌ రూపొందించిన చిత్రం ‘అశ్వని’ కూడా నాయికా ప్రాధాన్య చిత్రమే. ఇవేకాదు.. ‘మాతృదేవో భవ’, ‘అమ్మోరు’, ‘అరుంధతి’, ‘9 నెలలు’, ‘మనోహరం’, ‘అనుకోకుండా ఓ రోజు’, ‘అంతఃపురం’, ‘అమ్మ రాజీనామా’, ‘అంతులేని కథ’. ‘నాటి సావిత్రి’, భూమిక ‘మిస్సమ్మ’చిత్రాలు కూడా నాయికా ప్రాధాన్య చిత్రాలే. జయసుధ ‘జ్యోతి’, అనుష్క ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, మీనా ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘ముద్దుల మనవరాలు’, ‘ఆహ్వానం’, బాపు ‘మిస్టర్‌ పెళ్లాం’, దాసరి ‘శివరంజని’, ‘కంటే కూతుర్నే కను’, బాలచందర్‌ ‘ఆడాళ్లూ మీకు జోహారు’్ల, ‘కోకిలమ్మ’, ‘గుప్పెడు మనసు’, ‘ఇది కథ కాదు’...ఇలా మహిళా ప్రాధాన్య చిత్రాలు అడపాదడపా వస్తూ నాయికల గౌరవాన్ని పెంచుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.