హిట్టా...ఏదీ!
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. వ్యాపార స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం మన టాలీవుడ్‌ గురించే మాట్లాడుకొంటోంది. - మొన్నటిదాకా చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపించిన మాటలు ఇవి. వినూత్నమైన కథలు, రూ.వందల కోట్ల వసూళ్ల లెక్కలు, అబ్బురపరిచే సాంకేతికత... తెలుగు చిత్ర పరిశ్రమని ఒక్కసారిగా బాహుబలిగా మార్చేశాయి. ఆకర్షించే కలయికలో సినిమా వస్తుందన్న ప్రతిసారీ అంచనాలు పెంచేసుకొని కళ్లు పెద్దవి చేసుకొని థియేటర్‌వైపు అడుగులేశారు ప్రేక్షకులు. అది చూసి దర్శకనిర్మాతలు కూడా రెట్టించిన ఉత్సాహంతో, రూ.వందల కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమాలు నిర్మించడం ఆరంభించారు. ఆ చిత్రాలన్నీ సెట్స్‌పై ఉన్న దశలోనే తెలుగు చిత్రసీమ మళ్లీ డీలా పడిపోయింది. ఈ ఏడాది తొలి మూడు నెలల ఫలితాల్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హిట్టు అనే మాట టాలీవుడ్‌లో గట్టిగా వినిపించడమే లేదు. కథల్లోనూ కొత్తదనం కొరవడింది. నెలకో విజయం రావడమే గగనం అన్నట్టుగా మారింది పరిస్థితి.

చిత్రసీమలో విజయశాల శాతం సాధారణంగా తక్కువే. కానీ అంచనాలున్న సినిమాలు బాగా ఆడాయంటే పరిశ్రమ వర్గాల్లో కనిపించే జోష్‌ వేరు. కానీ రెండు మూడేళ్లుగా స్టార్ల చిత్రాలతో పాటు అంచనాలు లేని చిత్రాలూ సత్తా చాటుతుండడంతో హిట్టు ఎప్పుడైనా ఏ సినిమా రూపంలోనైనా రావొచ్చనే నమ్మకాలు పెరిగాయి. అలాంటి ఆశలు, అంచనాల మధ్యే ఈ ఏడాది ఆరంభమైంది. కీలకమైన సంక్రాంతి సీజన్‌లో సినిమాల వ్యాపారం తారస్థాయిలో జరిగింది. కానీ ఫలితాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి.  సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైతే వాటిలో ‘ఎఫ్‌2’ ఒక్కటే లాభాలు సంపాదించింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీసుపై ఏమాత్రం ప్రభావం చూపించ లేకపోయాయి. ‘వినయ విధేయ రామ’,  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ సినిమాలపైనున్న అంచనాలతో పంపిణీదారులు పెద్దఎత్తున డబ్బు పోసి కొన్నారు. కానీ ఆ చిత్రాలు నష్టాల్నే మిగిల్చాయి. అనువాద చిత్రంగా విడుదలైన రజనీకాంత్‌ ‘పేట’ కూడా వసూళ్లు సాధించలేకపోయింది. సంక్రాంతి తర్వాత వచ్చిన అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ ఒక స్థాయి వినోదాన్ని పంచినా విజయాన్ని అందుకోలేకపోయింది. అలా తొలి నెల ఒక్క విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘మణికర్ణిక’తోపాటు మరికొన్ని అనువాద చిత్రాలు వచ్చినా వాటికి వసూళ్లు దక్కలేదు.


 ఫిబ్రవరిలో ప్రధానంగా మూడు చిత్రాల గురించే మాట్లాడుకున్నారు ప్రేక్షకులు. వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర కథాంశంగా తెరకెక్కిన ‘యాత్ర’, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో భాగంగా వచ్చిన ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’తోపాటు కార్తీ నటించిన ‘దేవ్‌’ ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. ‘యాత్ర’ విమర్శకుల మెప్పు పొందినప్పటికీ, మరింతమంది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. ఇక ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’, ‘దేవ్‌’ చిత్రాలు ప్రేక్షకుల్ని, వ్యాపార వర్గాల్ని నిరాశ పరిచాయి. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే చిత్రాలు కూడా  పరిశ్రమకి ఊపునిస్తుంటాయి. ఈసారి ‘లవర్స్‌ డే’, ‘అంజలి సీబీఐ’, ‘విచారణ’, ‘సీమరాజా’, ‘అమావాస్య’ తదితర అనువాద చిత్రాలు  విడుదలైనా బాక్సాఫీసు దగ్గర నిలబడలేదు.


మార్చి నుంచి వేసవి సినిమాల జోరు మొదలవుతుంది. సంక్రాంతి తర్వాత మరో కీలకమైన సీజన్‌ వేసవే కాబట్టి అందరి చూపూ ఎండాకాలం విడుదలయ్యే సినిమాలపైనే. ఈ సీజన్‌ని విజయవంతంగానే  ఆరంభించాడు కల్యాణ్‌రామ్‌. ‘ఎఫ్‌2’ తర్వాత మళ్లీ అలా లాభాల గురించి మాట్లాడే అవకాశమిచ్చింది కల్యాణ్‌రామ్‌ నటించిన ‘118’ సినిమానే. నిర్మాతకి రూపాయికి రెండు రూపాయలు తెచ్చిపెట్టింది. కానీ ఆ జోరు కొనసాగలేదు. అనువాదాలతో కలుపుకొంటే దాదాపు 20 సినిమాలు ఈ నెలలో వచ్చాయి. వీటిలో ‘జెస్సీ’, ‘సర్వం తాళమయం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ఒక వర్గం ప్రేక్షకుల్ని మెప్పించినా వసూళ్లు రాలేదు. నెలాఖరున ‘సూర్యకాంతం’, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలయ్యాయి. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాలేదు. వీటికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే లభించింది. వీటి లాభనష్టాలపై ఓ అంచనాకి రావాలంటే మరికాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడందరి దృష్టి ఏప్రిల్‌లో విడుదలయ్యే సినిమాలపైనే. ‘మజిలీ’, ‘జెర్సీ’, ‘చిత్రలహరి’తో పాటు పలు చిత్రాలు ఈ నెలలో రాబోతున్నాయి. కానీ ఈ మూడు నెలల్లో వచ్చిన ఫలితాలు పరిశ్రమపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి. ఇదివరకు ఓవర్సీస్‌ హక్కుల కోసం పోటీపడేవారు పంపిణీదారులు. అక్కడ కొంతకాలంగా   సినిమాలకి సరైన వసూళ్లు రాక నష్టాలే మిగులుతున్నాయి. అందుకే పంపిణీదారులు సినిమాపై ఓ అంచనాకి వచ్చాక కానీ హక్కులు కొనుగోలు చేయడం లేదు. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకి ఇదివరకటిలా ముందస్తు వ్యాపారం జరగడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.