చుక్కల్లో చక్కనయ్య
సినిమా ప్రాథమిక సూత్రం... వెండి తెర రంగుల విల్లులా మారడం. ప్రేక్షకుణ్ని ఒక్కసారి కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేయడం. అందం ఆకర్షణ అలంకరణ ఆస్వాదన.. ఇవన్నీ మగువతోనే సాధ్యం. తెరపై ఎంతమంది కథానాయికలుంటే అంత శోభ. ఒక హీరోకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లేంటి? అని ప్రేక్షకుడెప్పుడూ కుళ్లుకోడు. వాళ్లందరినీ తెరపై ఒకేసారి చూడ్డానికి ఇంకో అరడజను కళ్లైనా కావాలని కోరుకుంటాడు. అందుకే... కథానాయకుడు ఒక్కడే అయినా ఇద్దరు ముగ్గురు కథానాయికలకు చోటిస్తారు. అవసరం లేకపోయినా ఐటెమ్‌ సాంగ్‌ అతికించేస్తారు. ఇదంతా గ్లామర్‌ మాయ. నందమూరి బాలకృష్ణ చిత్రాల్లో ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉండడం మామూలే. ‘నారీ నారీ నడుమ మురారీ’ అంటూ బాలయ్య పాడుకుంటుంటే చూడాలని నందమూరి అభిమానుల ఆశ. ఈసారి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది కథా నాయికలతో బాలయ్య జట్టు కడుతున్నాడు. వాళ్లందరితోనూ ఆడి పాడబోతున్నాడు. ఒక్క బాలయ్య.. ఎనిమిది మంది కథానాయికల ముచ్చట.. ‘ఎన్టీఆర్‌’ చిత్రానికి సరికొత్త వన్నె తీసుకురాబోతోంది. ‘రీలుకో హీరోయినా..’ అన్నట్టు వెండి తెరపై కథానాయికల జాతర చూడబోతున్నాం. ‘ఎన్టీఆర్‌’ సినిమా కోసం.


న తండ్రి కథని బయోపిక్‌గా తీయాలన్న ఆలోచన ఎప్పుడైతే బాలయ్యకు వచ్చిందో... అప్పుడే ఓ రసవత్తర చిత్రరాజానికి బాలయ్య బీజం వేసినట్టైంది. ఎన్టీఆర్‌ చరిత్ర అంటే మాటలా? అది పేజీలకు సరిపోదు. అధ్యాయాలతో ఆగదు. ఓ ఉద్గ్రంథం. పుట్టుక, బాల్యం, విద్యాభ్యాసం, కౌమారదశ.. ఇవన్నీ ఒకయెత్తు. సినీ రంగ ప్రవేశం మరోఎత్తు. రాజకీయల మాటంటారా... అది ఎత్తులకే పై ఎత్తు. ఆయా దశల్లో చెప్పాల్సిన పాత్రలెన్నో.. ఎన్నెన్నో.

స్టార్లు ఉండాల్సిందే
‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. బాల్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకూ ‘కథానాయకుడు’గా రాబోతోంది. అక్కడి నుంచి అంతిమ ఘడియల వరకూ ‘మహానాయకుడు’లో చూపించబోతున్నారు. తొలి భాగంలో సినిమా రంగానికే ప్రాధాన్యం ఎక్కువ. సినిమా అంటే మామూలు విషయమా? ఎంతోమంది స్టార్లని చూపించాలి. ఏఎన్నార్‌ నుంచి ఇప్పటి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకూ చాలామంది కథానాయకులతో ఉన్న బంధాన్నీ, అనుబంధాన్నీ తెరపై మళ్లీ చూడాలనుకుంటారు. కథానాయికల సంగతీ అంతే. ఎన్టీఆర్‌ కథంటే ఆయనొక్కడి కథ కాదు. దాదాపుగా తెలుగు చిత్ర స్వర్ణయుగాన్ని చెప్పాలి. అందులో ఎంతోమంది కథానాయికల కెరీర్లు ముడిపడి ఉన్నాయి. అప్పటి సావిత్రి నుంచి.. నిన్నటి జయసుధ, జయప్రద వరకూ ఎన్నో పాత్రల్ని చూపించాలి. ఆయా పాత్రల కోసం ఎవరిని తీసుకోవాలి? ఆ రూపాల్ని ఎవరిలో ప్రతిష్టింపచేయాలి? అనేది చాలా పెద్ద టాస్క్‌. సావిత్రి, శ్రీదేవి లాంటి పాత్రలకు చిన్నా చితకా కథానాయికల్ని తీసుకొస్తే సరిపోదు. ఆ స్టార్‌డమ్‌, స్టేటస్‌ అన్నింటికంటే మించి సారుప్యత ఇవన్నీ చూసుకోవాలి. అందుకే క్రిష్‌ ప్రతి పాత్రని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువగా స్టార్‌డమ్‌కే ప్రాధాన్యం ఇస్తూ... ప్రతి పాత్రకూ పేరున్న నాయికనే తీసుకున్నారు. దాంతో ‘ఎన్టీఆర్‌’లో కథానాయికల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వచ్చింది.
ఆనాటి పాటల్లో..

క్రిష్‌ తొలి ఎంపిక విద్యాబాలన్‌. ‘ఎన్టీఆర్‌’ నిజ జీవిత కథానాయిక, ఆయన అర్ధాంగి బసవతారకం పాత్ర ఆమెకు దక్కింది. ఎప్పుడైతే విద్యాబాలన్‌ ఎంట్రీ ఇచ్చిందో... ‘ఎన్టీఆర్‌’ సౌండ్‌ బాలీవుడ్‌కి చేరినట్టైంది. ఆ తరవాత ప్రతి చిన్న పాత్రకూ.. పేరున్న కథానాయికనే తీసుకోవడం మొదలెట్టింది చిత్రబృందం. ఒకట్రెండు సన్నివేశాల పాత్ర అయినా సరే క్రేజీ కథానాయికనే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సమంత, నిత్య మేనన్‌, శ్రియ.. ఇలా స్టార్లంతా వరుస కట్టారు. ఈ చిత్రంలో శ్రీదేవిగా రకుల్‌ కనిపించనున్న సంగతి తెలిసిందే. ‘వేటగాడు’లో ‘ఆకుచాటు పిందె తడిసె’ అనే పాటకు బాలయ్యతో కలసి స్టెప్పులేయబోతోంది రకుల్‌. నిత్య మేనన్‌.. సావిత్రిగా మారిపోయింది. ‘గుండమ్మ కథ’లో ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం’ అనే పాట ఎన్టీఆర్‌ - సావిత్రిపై తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటలో బాలయ్య - నిత్య కనిపిస్తారన్నమాట.


దుర్యోధనుడికే డ్యూయెట్‌ పెట్టిన ఘనత ఎన్టీఆర్‌ది. ‘దానవీర శూరకర్ణ’లో ‘చిత్రం అయ్యారే విచిత్రం’ అంటూ ఎన్టీఆర్‌, ప్రభ పాట పాడుకున్నారు. ఆ పాట ఇప్పుడు ‘ఎన్టీఆర్‌’లో కూడా ఉంది. ఈసారి బాలకృష్ణ- శ్రియలపై తెరకెక్కించినట్టు సమాచారం. జయప్రదగా రాశీఖన్నా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. తమన్నా, సమంతల్ని కూడా చిత్రబృందం సంప్రదిస్తోంది. వాళ్లు ఎవరి పాత్రల్లో కనిపిస్తారో చూడాలి. కృష్ణకుమారిగా మాళవిక నాయర్‌ కనిపించబోతోందట. ‘ఎన్టీఆర్‌’ జీవిత కథలో భానుమతి పాత్రకూ సమప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికైతే ఎనిమిదిమంది కథా నాయికలు ‘ఎన్టీఆర్‌’లో కనిపించబోతున్నట్టు తెలిసింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తెలుగు చిత్రసీమలోని కథానాయికలంతా ‘ఎన్టీఆర్‌’ కోసం మేకప్‌ వేసుకోవడానికి సిద్ధమైనట్టే తెలుస్తోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.