జోరు పెంచిన హీరోలు

చిత్రసీమలో అగ్ర దర్శకుల నుంచి... కొత్తగా మెగాఫోన్‌ పట్టే నవతరం వరకు చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు. సినిమా హిట్టయిందంటే యువ దర్శకుడు తొలి చిత్రంతోనే స్టార్‌ దర్శకుడు అయిపోవచ్చు. అందుకే చిత్రసీమలో దాదాపు కథలన్నీ అగ్ర కథానాయకుల్ని దృష్టిలో ఉంచుకొని  సిద్ధమయ్యేవే. వాళ్లు విని వద్దన్నాకో, లేదా వాళ్లతో తీయడం కుదరకపోతేనో...ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే దర్శకులు చాలామంది. యువ కథానాయకులు మాత్రం ‘మంచి కథ ఎవరు చెబుతారా?’ అని అన్వేషిస్తుంటారు. అగ్ర దర్శకులను ‘మాతో కూడా ఓ సినిమా తీయొచ్చు కదా?’ అని అడుగుతుంటారు. ఇదంతా ఒకప్పటి మాట. నేడు కథలన్నీ యువ కథానాయకుల చుట్టూనే తిరుగుతున్నాయి. చిత్రసీమలో యువ దర్శకుల జోరు పెరగడం... వాళ్లు తమ వయసు, జీవితాల్ని ప్రతిబింబించేలా కథల్ని సిద్ధం చేస్తుండడం యువ కథానాయకులకి కలిసొస్తోంది. ఒకొక్కరు రెండు మూడు కథలకి పచ్చజెండా ఊపేశారు.


యువ కథానాయకుల్లో నాని మినహా మరెవ్వరిలోనూ జోరు కనిపించేది కాదు. ఆయన ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, రెండు మూడు కథల్ని పక్కా చేస్తుంటారు. వరుసగా   సినిమాలు చేయడమే కాదు, ఒకదానికొకటి భిన్నమైన కథల్ని ఎంపిక చేసుకోవడం నాని ప్రత్యేకత. ప్రేక్షకులకు నానిలో నచ్చిన విషయమూ అదే. ప్రస్తుతం ఆయన విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘గ్యాంగ్‌లీడర్‌’ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’లో నటిస్తారు. వీటితో పాటు మరికొన్ని కథల్నీ ఆయన ఖాయం చేసినట్టున్నారు. అందుకే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ‘రాబోయే రెండేళ్ల వరకు సరిపడా సినిమాలున్నాయి’ అన్నారు. ప్రస్తుతం ఇతర హీరోలూ అదే తరహా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఒక సినిమా పూర్తయ్యాకే, మరో సినిమా అంటూ ప్రయాణం చేసిన నితిన్‌ ఇటీవల మూడు     సినిమాల్ని వరుసగా ప్రకటించేశారు. వెంకీ కుడుముల ‘భీష్మ’తో పాటు, చంద్రశేఖర్‌ యేలేటి, కృష్ణ చైతన్యలతో వరుసగా రెండు    సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్నిబట్టి నితిన్‌ కోసం   ఏ స్థాయిలో  కథలు సిద్ధమవుతున్నాయో   అర్థమవుతోంది.

నాగచైతన్య కోసం ఐదుగురు
‘మజిలీ’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య, నటుడిగానూ తన సత్తాని చాటాడు. ప్రస్తుతం   వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’లో నటిస్తున్న ఆయన కోసం అజయ్‌ భూపతి ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇద్దరు కథానాయకులతో ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్టు   తెలుస్తోంది. త్రినాథ్‌రావు నక్కిన, మేర్లపాక గాంధీ కూడా  నాగచైతన్యని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేస్తున్నారు. వీళ్లతో పాటు కల్యాణ్‌కృష్ణ కురసాల తెరకెక్కించనున్న  ‘బంగార్రాజు’లోనూ నాగచైతన్య సందడి చేస్తారు. దిల్‌రాజు సంస్థలోనూ ఓ కొత్త దర్శకుడు నాగచైతన్యతో చేసే సినిమా కోసం కథ రాస్తున్నారు. ఇలా చూస్తే ఇప్పటిదాకా ఐదుగురు దర్శకులు లెక్క తేలారు. అంటే నాగచైతన్య రెండు మూడేళ్ల వరకు కథల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. విజయ్‌ దేవరకొండ త్వరలోనే ‘డియర్‌ కామ్రేడ్‌’తో సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. వీటితో పాటు రెండు ద్విభాషా చిత్రాలకి ఆయన పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. పలువురు అగ్ర దర్శకులు కూడా విజయ్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు సమాచారం.

హిందీ, తమిళంలో నటిస్తూనే...
దగ్గుబాటి రానా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం హిందీ, తమిళం భాషల్లో సినిమాలు చేస్తూనే... తెలుగు దర్శకులు వినిపిస్తున్న కథలకి పచ్చజెండా ఊపుతున్నారు. ఆయన గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్య’ చేయబోతున్నారు. అది అంతర్జాతీయ స్థాయిలో రూపొందున్న చిత్రం. అలాగే యువ దర్శకుడు వేణు ఊడుగులతో ‘విరాటపర్వం 1992’ చేయబోతున్నారు. మరో ఇద్దరు యువ దర్శకులు రానా కోసం కథలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’లో నటిస్తున్న వరుణ్‌తేజ్‌, ఆ తర్వాత కిరణ్‌ అనే యువ దర్శకుడితో బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం చేయబోతున్నారు. శర్వానంద్‌ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం, ‘96’ రీమేక్‌గా రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నారు. సుధీర్‌బాబు ‘వి’తో పాటు, పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చేయబోతున్నారు. ఈ రెండు కాకుండా, ఈ ఏడాదిలోనే ఆయన మరో చిత్రాన్నీ పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో సుధీర్‌ సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. ‘సీత’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సందీప్‌కిషన్‌, కార్తికేయవంటి యువ కథానాయకులు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అగ్ర కథానాయకులు ఏడాదికి ఒక సినిమాని మించి చేయడం లేదు. ముందుగానే కథలు విని, ఖాయం చేసుకుంటున్నప్పటికీ ఆ చిత్రాలన్నీ భారీ వ్యయంతో రూపొందుతున్నవే కాబట్టి పనులు నిదానంగా సాగుతుంటాయి. యువ కథానాయకులకి మాత్రం మెరుపు వేగంతో సినిమాలు చేసే వెసులుబాటు ఉంటుంది. అందుకే యువ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకులు కూడా అగ్ర కథానాయకుల కోసం ఎదురు చూడకుండా, అందుబాటులో ఉన్న యువతరంతోనే సినిమాలు చేస్తున్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘రెండేళ్లుగా నా దగ్గరికొస్తున్న కథల సంఖ్య పెరిగింది. ‘సమ్మోహనం’ తర్వాత మరిన్ని మంచి కథలు విన్నా. మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. కథలు నటుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంటాయి. అందుకే సెట్స్‌పై సినిమాలున్నా.. వీలు చేసుకొని కథలు వింటుంటా’’ అన్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.