రీల్‌ మాత్రమే కాదు.. రియల్‌ హీరోలు కూడా!!
సినిమా అంటే మనకు వినోదం... కానీ మన హీరోలకి ఒక సవాలు. నిత్యం కొత్తకథల కోసం వెతికే హీరోలు చేసే పాత్రలకి తగ్గట్టు తమని తాము మలచుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. మన తెలుగు హీరోలు తమ సినిమాల కోసం ఎలా కష్టపడుతుంటారో తెలిస్తే మీరూ మెచ్చుకోకుండా ఉండలేరు!

తారక్‌ ‘మంత్రం’

‘అరవింద సమేత’లో ఎంతో ఫిట్‌గా కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ సమయంలో హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లకు పర్సనల్‌ ట్రైనర్‌ అయిన లాయిడ్‌ స్టీవెన్స్‌ నేతృత్వంలో మూడు నెలలపాటు వ్యాయామాలు చేశాడు. ‘జై లవ కుశ... తర్వాత నేను లావెక్కాను. అప్పుడే అరవింద సమేత కోసం ఫిట్‌గా ఉండాలని చెప్పారు త్రివిక్రమ్‌. ఆయన చెప్పినదానికంటే ఎక్కువే శ్రమించి ఫిట్‌నెస్‌ సాధించాను.ఆ శిక్షణ... క్రమశిక్షణ పరంగానూ మేలు చేసింది’ అని చెబుతాడు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరింత ఫిట్‌గా కనిపించాలని మళ్లీ లాయిడ్‌ని పిలిపించారు. ఈసారి రాజమౌళి సూచనలతో తారక్‌కి ట్రైనింగ్‌ ఇచ్చాడు లాయిడ్‌.


నానీ క్రికెటర్‌ అయ్యాడిలా!

నేచురల్‌ స్టార్‌ నానీకి ‘జెర్సీ’ రూపంలో ఓ ఛాలెంజ్‌ వచ్చింది. దీన్లో ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా కనిపించాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కోచ్‌ని పెట్టుకుని 70 రోజులపాటు ప్రాక్టీసు చేసి తనదైన బ్యాటింగ్‌ స్టైల్‌ని సంపాదించాడు. నెట్స్‌లో టెన్నిస్‌ బంతితో మొదలైన ప్రాక్టీసు క్రమంగా లెదర్‌ బంతివైపు మళ్లింది. చూడచక్కని డిఫెన్స్‌తోపాటు డ్రైవ్‌లూ, స్వీప్‌ షాట్‌లూ, పుల్‌షాట్‌లు కొట్టడం నేర్చుకున్నాడు. షూటింగ్‌ సమయంలో బంతి ముక్కు మీద తగిలి రక్తం కారింది కూడా. 22 సినిమాలు చేసిన తర్వాత కూడా మొదటి సినిమా చేస్తున్న హీరోలా పట్టుదలతో పనిచేసిన నానీని ప్రశంసించాల్సిందే!


‘భరత్‌...’ కోసం మహేష్‌


మహేష్‌బాబు రాజకీయాలకు దూరంగా ఉంటాడు. దర్శకుడు కొరటాల శివ ‘భరత్‌ అనే నేను’ కథ చెప్పినపుడు ఆసక్తిగా విని... ‘సారీ, నాకు ఇలాంటి కథలు నప్పవేమో’ అని బదులిచ్చిన మహేష్‌... భరత్‌ పాత్రని కూలంకషంగా వివరించాక చేయడానికి అంగీకరించాడు. ఆ తర్వాత కొన్నిరోజులపాటు పార్లమెంటు, శాసనసభ ప్రసారాల వీడియోల్ని చూస్తూ ఆ వాతావరణాన్నీ, రాజకీయ నాయకుల హావభావాల్నీ పరిశీలించాడట. ముఖ్యంగా తన బావ, గుంటూరు ఎంపీ జయదేవ్‌ ప్రసంగాల వీడియోల్ని గమనించాడట. ‘నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహనలేదు. ‘భరత్‌ అనే నేను’ చేస్తున్నపుడే శివ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాను’ అని చెబుతాడు మహేష్‌.

బ్యాట్‌ పట్టిన చైతూ...

‘మజిలీ’లో నాగ చైతన్య క్రికెటర్‌ అవ్వాలని కలలుగన్న కుర్రాడిగా కనిపించాడు. ఈ సినిమా కోసమే చైతన్య క్రికెట్‌ నేర్చుకున్నాడు. అంతకు ముందు చైతూకి క్రికెట్‌ ఆడిన అనుభవం పెద్దగా లేదట. దాంతో సినిమా చిత్రీకరణకు ఆరు నెలల ముందు నుంచే క్రికెట్‌ పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. రంజీ క్రికెటర్ల దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నాడట. ‘మామూలుగా షూటింగ్‌ అయిపోగానే జిమ్‌కి వెళ్లేవాణ్ని. మజిలీ సమయంలో మాత్రం క్రికెట్‌ క్లాసులకు వెళ్లాను. అఖిల్‌ మంచి క్రికెటర్‌. తను కూడా నాకు బ్యాటింగ్‌ నైపుణ్యాలు నేర్పాడు. ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ ఆలోచనా విధానం, హావభావాలు ఎలా ఉంటాయో... వివరించాడు’ అని గుర్తుచేసుకుంటాడు చైతూ.

‘రాంబో’ చరణ్‌...


ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే నటుడు రామ్‌చరణ్‌. తన హీరోల్ని ఫిట్‌గా చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను. ‘వినయ విధేయ రామ’లో చరణ్‌ని ‘రాంబో’ లుక్‌లో కనిపించాలని సూచించాడట బోయపాటి. దీనికోసం ఆమీర్‌, సల్మాన్‌ఖాన్‌లకూ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేసిన రాకేష్‌ ఉదియార్‌ పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాడు చరణ్‌. రకరకాల వ్యాయామాలు చేస్తూ షూటింగ్‌ సమయంలో 21 రోజులపాటు ప్రత్యేక డైట్‌ని అవలంబించాడు. దాన్లో భాగంగా ఆహారాన్ని 12 గంటల వ్యవధిలోనే తీసుకోవాలన్నది నియమం. ఉదయం ఎనిమిదింటికి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తే రాత్రి ఎనిమిది తర్వాత మంచి నీళ్లు తప్ప మరేమీ తీసుకోకూడదు. ఇదే ఫిట్‌నెస్‌ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కీ కొనసాగిస్తున్నట్టు వినికిడి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.