కథానాయికలు కావలెను..
కథానాయిక లేని సినిమా ఉప్పు కారం లేని వంటకంలాగే ఉంటుంది మన ప్రేక్షకులకి. వాణిజ్యాంశాల్లో కథానాయిక అందానిదే అగ్రపీఠం. అందుకే నాయికల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకొంటుంటారు దర్శకనిర్మాతలు. అగ్ర కథానాయకుల చిత్రాల విషయంలో అయితే ఆ శ్రద్ధ మరీ ఎక్కువ. ఫలానా కథానాయికే బాగుంటుందని భావిస్తే... వాళ్లు దొరికేవరకు చిత్రీకరణలు కూడా వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకులు కూడా ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టారని తెలియగానే ముందు జోడీ ఎవరనే ఆరా తీస్తారు. అందుకే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే నాయికల ఎంపిక పూర్తి చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చాలామంది ఆ పనిలోనే ఉన్నారు. పలువురు అగ్ర కథానాయకుల చిత్రాల్లో తగిన జోడీ కోసం వేట ముమ్మరంగా సాగుతోంది.


కథానాయకుడికి తగ్గ జోడీగా ఉండాలి.. వెనక విజయాలుండాలి.. గ్లామర్‌ పరంగా ఆకర్షించే శక్తి ఉండాలి.. - ఇలా కథానాయిక ఎంపికలో చాలా లెక్కలుంటాయి. సినిమా వ్యాపారం ప్రధానంగా కాంబినేషన్ల ఆధారంగానే జరుగుతుంది. కాంబినేషన్‌లో దర్శకుడు, కథానాయకుడు తర్వాత కనిపించేది నాయికలే. అందుకే వాళ్లతో ముందు నుంచే సంప్రదింపులు జరుపుతూ - తమ కథ, పాత్ర, కథానాయకుడికి తగిన... జోరు మీదున్న తారల్నే ఎంపిక చేసుకుంటుంటారు. నచ్చినవాళ్లకి అడ్వాన్సులు ఇచ్చేసి, ముందుగానే కాల్షీట్లు ఖాయం చేసేస్తుంటారు. చిరంజీవితో పాటు, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ తదితర కథానాయకుల సినిమాల కోసం ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ జోరందుకొన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, మహేష్‌ల సినిమాల ఆరంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా ఇప్పటికే కథానాయిక ఎంపిక ప్రక్రియపై దర్శకులు కసరత్తులు మొదలుపెట్టినట్టు ప్రచారం సాగుతోంది.


ముగ్గురు ఎవరు?
ఒకొక్క సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు సందడి చేయడం తెలుగులో కొత్తేమీ కాదు. విజయ్‌ దేవరకొండ - క్రాంతి మాధవ్‌ చిత్రంలో, రాజశేఖర్‌ - ప్రశాంత్‌ వర్మల ‘కల్కి’లో ముగ్గురు భామల చొప్పున ఆడిపాడుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించనున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ముగ్గురు కథానాయికలు మెరవనున్నట్టు సమాచారం. పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని 11.11.11... అంటే ఈ నెల 11వ తేదీ, 11 గంటలకి ప్రారంభిస్తారు. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం, అదీ మల్టీస్టారర్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జాతీయ స్థాయిలో ఈ చిత్రం గురించి చర్చ నడుస్తోంది. ఇందులో అవకాశం అందుకొనే కథానాయికలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించనున్న కొత్త చిత్రంలోనూ ముగ్గురు ఆడిపాడనున్నారు. ఇందులో ఇప్పటికే నభా నటేష్‌ ఎంపికైంది. మరో స్థానాన్ని ‘ఆర్‌.ఎక్స్‌.100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ భర్తీ చేస్తున్నట్టు సమాచారం. వాళ్లు కాకుండా రవితేజకి జోడీగా మరో భామ కావాలి.

బన్నీ సరసన ఎవరు?
త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అందుకే కథానాయిక ఎంపిక గురించి జోరుగా కసరత్తులు మొదలైనట్టు సమాచారం. ‘భరత్‌ అనే నేను’తో విజయాన్ని అందుకొని, ప్రస్తుతం రామ్‌చరణ్‌ సినిమాతో బిజీగా ఉన్న కైరా అడ్వాణీ నటిస్తుందని ప్రచారం సాగుతున్నా.. చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం లేదు. ఇందులో కథానాయికలు ఒక్కరా ఇద్దరా అనేదీ ఇంకా తేలలేదు.

సమయం ఉంది కానీ...
చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఆయన ఇప్పటికే కొత్త సినిమాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కించనున్న ఆ సినిమా వచ్చే యేడాది ఆరంభంలో మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కథానాయికని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైందట చిత్రబృందం. మహేష్‌బాబుతో సుకుమార్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. దానికి సమయం ఉన్నప్పటికీ కథానాయిక ఎంపిక ప్రక్రియ ఊపందుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. విజయాలతో దూసుకెళుతున్న ఓ యువ కథానాయికకి కథ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో కథానాయికల కొరత ఎక్కువ. స్టార్‌ భామలు తమ పాత్రలకి ప్రాధాన్యం ఉంటే తప్ప చేయడం లేదు. సీనియర్‌ భామలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే కథానాయికల విషయంలో దర్శకనిర్మాతలు ముందుచూపుతో
వ్యవహరిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.