వైభవంగా ఆస్కార్‌ వేడుకలు

ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్‌ ప్రదానోత్సవ వేడుకలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఎలాంటి కార్యక్రమాలైనా యాంకర్లు, హోస్ట్‌లు లేకుండా జరగవు. అలాంటిది ఈ ఆస్కార్‌ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఎవ్వరికీ రాలేదు. కేవలం మ్యూజికల్‌ ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‌అగ్రరాజ్యంలో జాతి వివక్ష పెరిగిపోతున్న తరుణంలో నల్ల జాతీయులను వివిధ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్‌ చేయడం విశేషం. ఈ వేడుకలో రెండు హాలీవుడ్‌ చిత్రాలకు అవార్డుల పంటపండింది. అవే.. ‘రోమా’, ‘బ్లాక్‌ పాంథర్‌’. ఈ రెండు చిత్రాలకు ఎన్నో విభాగాల్లో అవార్డులు వరించాయి. ‘బ్లాక్‌ పాంథర్‌’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించినవారంతా ఆడవారే.

ఒకేసారి ముగ్గురు ఆడవాళ్లకు

 

అమెరికన్‌ సూపర్‌హీరో చిత్రంగా 2018లో విడుదలైన బ్లాక్‌ పాంథర్‌ చిత్రానికి గానూ ఉత్తమ కాస్ట్యూమ్‌, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో రుత్‌ కార్టర్, హన్నా బీచ్లర్‌ అనే ఇద్దరు మహిళలు అవార్డులు అందుకున్నారు. వీరిద్దరూ నల్లజాతీయులు. నాన్‌ యాక్టింగ్‌ కేటగిరీలో కాకుండా ఇతర విభాగంలో నల్ల జాతీయులు ఆస్కార్‌ను అందుకోవడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఈ కోవలో రికార్డు సృష్టించారు రుత్, హన్నా. రెజీనా కింగ్‌ అనే మరో నల్ల జాతీయురాలు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. ‘ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌’ అనే చిత్రానికి గానూ ఆమెకు అవార్డు వరించింది. ఒకే ఏడాదిలో నల్లజాతికి చెందిన ముగ్గురు ఆడవారు ఆస్కార్‌ను అందుకోవడం కూడా ఇదే మొదటిసారి. ‘బ్లాక్‌ పాంథర్‌’ చిత్రానికి రయాన్‌ కూగ్లర్‌ దర్శకత్వం వహించారు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాల్లో ‘బ్లాక్‌ పాంథర్‌’ ఒకటి. ఆస్కార్స్‌లో ఉత్తమ సినిమా కేటగిరీకి నామినేట్‌ అయిన తొలి సూపర్‌హీరో చిత్రమిదే. అంతేకాదు వివిధ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి మార్వెల్‌ సంస్థ చిత్రమిది కావడం విశేషం.

ఓ దర్శకుడి కథ

‘బ్లాక్‌ పాంథర్‌’ తర్వాత ఎక్కువ విభాగాల్లో అవార్డు అందుకున్న చిత్రం ‘రోమా’. ‘రోమా’ సెమీ-ఆటోబయోగ్రాఫికల్ చిత్రం. అంటే దర్శకుడు ఆల్ఫోన్సో క్వారోన్‌ తన సినిమాను తానే తెరకెక్కించుకున్నారన్నమాట. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో క్వారోన్‌ బాల్యం ఎలా గడిచింది? తదితర విషయాలను ఈ చిత్రంలో చూపించారు. 75వ వెనిస్‌ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాకు గోల్డెన్‌ లయన్‌ అవార్డు లభించింది. 2018లో ఈ సినిమా విడుదలైనప్పుడు తక్కువ థియేటర్లలో ప్రదర్శితమైంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడంతో సినిమాకు థియేటర్ల సంఖ్య పెరిగింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘రోమా’కు అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి మెక్సికన్‌ చిత్రమిదే కావడం విశేషం. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు అందుకుందీ చిత్రం.

అలీ.. సహాయ నటుడిగా మరోసారి

 

ప్రముఖ అమెరికన్‌ నటుడు మహర్షెలా అలీ ‘గ్రీన్‌ బుక్‌’ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. 2017లో వచ్చిన ‘మూన్‌లైట్‌’ చిత్రానికి గానూ అలీకి సహాయ నటుడిగా అవార్డు వరించింది. ఈ కేటగిరీలో రెండు సార్లు అవార్డు అందుకున్న తొలి నల్ల జాతి నటుడు అలీ కావడం విశేషం.

ఆస్కార్‌ అందుకున్న తొలి అరబ్‌-అమెరికన్‌

 రమీ మలెక్‌.. 91వ ఆస్కార్‌ వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి అరబ్‌-అమెరికన్‌ నటుడు. ‘బొమెమియన్‌ రాప్సోడీ’ చిత్రంలో ఆయన ఫ్రెడ్డీ మెర్య్కూరీ పాత్రలో నటించి విమర్శకుల మన్ననలు సైతం పొందారు.


విజేతల వివరాలు..


ఉత్తమ చిత్రం
: గ్రీన్‌ బుక్‌

ఉత్తమ దర్శకుడు-
ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)

ఉత్తమ నటుడు: రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)

ఉత్తమ నటి
: ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)

ఉత్తమ సహాయ నటి
- రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)

ఉత్తమ సహాయ నటుడు
- మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)​​​​​​​

ఉత్తమ ఛాయాగ్రాహకుడు- అల్ఫాన్సో కరోన్‌(రోమా)

ఉత్తమ విదేశీ చిత్రం- ‘రోమా’

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం- ‘ఫ్రీ సోలో’

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- ‘బ్లాక్‌ పాంథర్‌‘

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌- బొహెమియన్‌ రాప్సోడి

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- ‘స్పైడర్‌ మ్యాన్‌:ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.