ఆస్కార్‌ ఎవర్ని వరించేనో
ఆస్కార్‌ వేడుకకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. సోమవారం ఆస్కార్‌ విజేతలెవరో తేలిపోనుంది. ఈసారి ఉత్తమ నటుడి పురస్కారం కోసం గట్టి పోటీ నెలకొంది. నామినేషన్లు అందుకున్న ఐదు మందిలో పురస్కారాన్ని అందుకునే అవకాశం ఎవరికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ పాత్రను అద్భుతంగా పండించి ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్నారు క్రిస్టియన్‌ బాలె. ‘వైస్‌’ చిత్రంతో ఆయన బరిలో నిలిచారు. ‘బ్యాట్‌మ్యాన్‌ బిగిన్స్‌’ సిరీస్‌లోని మూడు చిత్రాల్లోనూ బ్యాట్‌మ్యాన్‌గా నటించి మెప్పించారు బాలె. తన పాత్ర కోసం కఠిన కసరత్తులకు సిద్ధంగా ఉంటారు. ‘ది మెషినిస్ట్‌’లో పాత్ర కోసం 28 కిలోల బరువు తగ్గారు. మళ్లీ ఆరు నెలల్లోనే ‘బ్యాట్‌మ్యాన్‌’ సిరీస్‌ కోసం 45 కిలోలు పెరిగారు. ‘అమెరికన్‌ సైకో’లో సీరియల్‌ కిల్లర్‌ పాత్రతో పరిశ్రమ దృష్టినాకర్షించారు. ‘ది ప్రెస్టీజ్‌’, ‘టెర్మినేటర్‌ సాల్వేషన్‌’, ‘పబ్లిక్‌ ఎనిమీస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది ఫైటర్‌’తో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. ‘అమెరికన్‌ హజిల్‌’, ‘ది బిగ్‌ షార్ట్‌’లతో ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్నారు.

బ్రాడ్లీ కూపర్‌ తాను దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఎ స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’తో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ బరిలో నిలిచారు. ఇందులో తాగుడు వ్యసనమున్న ఓ సంగీత కళాకారుడిగా నటించారాయన. గతంలో ఆయన ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌’, ‘అమెరికన్‌ స్నైపర్‌’ చిత్రాలతో ఉత్తమ నటుడిగా, ‘అమెరికన్‌ హజిల్‌’తో ఉత్తమ సహాయ నటుడిగా నామినేషన్లు అందుకున్నారు. ‘ది హ్యాంగోవర్‌’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా మూడేళ్లు ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న పదో వ్యక్తిగా ప్రత్యేకత చాటారు కూపర్‌.
విలియమ్‌ డఫో 63 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ పురస్కారం కోసం పోటీపడుతున్నారు. ‘ప్లాటూన్‌’, ‘షాడో ఆఫ్‌ ది వ్యాంపైర్‌’, ‘ది ఫ్లోరిడా ప్రాజెక్ట్‌’ చిత్రాలతో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్నా పురస్కారం దక్కలేదు. ఈసారి ‘అట్‌ ఎటెర్నిటీస్‌ గేట్‌’ చిత్రంతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ బరిలో నిలిచారు. అందులో ప్రముఖ డచ్‌ చిత్రకారుడు విన్సెంట్‌ వాన్‌ గొఘ్‌ పాత్రలో నటించారు. ‘స్పైడర్‌మ్యాన్‌’, ‘ఒన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ మెక్సికో’, ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’, ‘మర్డర్‌ ఆన్‌ ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’ తదితర చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలొచ్చాయి.

‘బొహెమియన్‌ రాప్సొడీ’ చిత్రంతో ఉత్తమ నటుడి పురస్కారం కోసం ఆస్కార్‌ బరిలో నిలిచారు 37 ఏళ్ల రమీ మాలెక్‌. అందులో బ్రిటన్‌ రాక్‌ బ్యాండ్‌ గాయకుడు ఫ్రెడ్డీ మెర్క్యురీ పాత్రలో నటించారు. ఆయన అభినయానికి ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌, బాఫ్టా, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ పురస్కారాలు వచ్చాయి. ‘నైట్‌ ఇన్‌ ది మ్యూజియమ్‌’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. తొలిసారి ఆస్కార్‌ బరిలో నిలిచిన మాలెక్‌ పురస్కారం కోసం గట్టి పోటీనిస్తున్నారు.

నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, సంగీత కళాకారుడు, ఫొటోగ్రాఫర్‌, కవి, చిత్రకారుడు... ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విగ్గొ మార్టెన్‌సెన్‌ 60 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ బరిలో నిలిచారు. ఇప్పటికే ‘ఈస్ట్రన్‌ ప్రామిసెస్‌’, ‘కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌’ చిత్రాలతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న మార్టెన్‌సెన్‌ ఈసారి ‘గ్రీన్‌బుక్‌’ చిత్రంతో మూడో నామినేషన్‌ అందుకున్నారు. అందులో అమెరికన్‌ బౌన్సర్‌ ఫ్రాంక్‌ పాత్రలో నటించారు. ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ ట్రైలాజీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారాయన.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.