‘రాములమ్మ’కి 23 ఏళ్లు

‘ఒసేయ్‌ రాములమ్మ’.. దొరల అన్యాయాన్ని ఎదురించే ఓ మహిళ కథ. ఈ చిత్రంతో బలహీన వర్గానికి చెందిన అమ్మాయిల బాధను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు దాసరి నారాయణ రావు. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాయికా ప్రాధాన్య చిత్రమంటే ఇది అని సగర్వంగా చెప్పుకునేలా చేసింది. నాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. ఇలాంటి కథలకు సంగీతం, సాహిత్యం ఎంత అవసరమో నిరూపించారు వందేమాతరం శ్రీనివాస్‌. సమాజాన్ని కదిలించే శక్తి మాటకు, పాటకు మాత్రమే ఉందని మరోసారి రుజువు చేశారాయన. ‘ఒసేయ్‌ రాములమ్మ’ టైటిల్‌ ట్రాక్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది. ఇదొక్కటే కాదు ‘రామసక్కని తల్లి’, ‘ఓ చౌదరి గారు’.. ఈ చిత్రంలో కథానుసారం వచ్చే ప్రతి గీతం ఓ విప్లవం సృష్టించింది. దాసరి నారాయణ రావు, కథానాయకుడు కృష్ణ ప్రత్యేక పాత్రలకు ప్రాణం పోశారు. ప్రస్తుతం వినిపిస్తున్న ‘వన్‌మెన్‌ షో’ని ఈ చిత్రంతో ‘వన్‌ఉమెన్‌ షో’ అని ఎప్పుడో ప్రేక్షకులతో అనిపించుకున్నారు నటి విజయశాంతి. రాములమ్మ పాత్రను పోషించడం కాదు ఆ పాత్రలో జీవించింది. రాములమ్మగానే మారిపోయింది. ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిన విజయశాంతికి ఉత్తమ నటి, వందేమాతరం శ్రీనివాస్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డులు వరించాయి. నేటితో ఈ చిత్రం 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1997 మార్చి 7న విడుదలైంది ‘ఒసేయ్‌ రాములమ్మ’.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.