అందరి దృష్టి ఓటీటీపైనే..

ఇద్దరు హీరోలతో సినిమాలు తీయాలనుకుని కథలు సిద్ధం చేసుకున్న ఓ దర్శకుడు కొత్తగా వెబ్‌ సిరీస్‌ కోసం కలం పట్టారు. వరుసగా సినిమాల్ని నిర్మించడం కోసం ప్రణాళికలు రచించుకున్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకి కంటెంట్‌ని అందించడమే లక్ష్యంగా పనుల్ని ప్రారంభించింది. సినిమాలు తప్ప ఇప్పట్లో వేరే ఆలోచనే లేదని చెబుతూ వచ్చిన హీరోలు సైతం ఇప్పుడు వెబ్‌ సిరీసుల్లో నటిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. - ఇలా చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అందరి దృష్టీ ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలపైనే పడింది.



కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ప్రారంభమైనా ప్రేక్షకుల జోరు మునుపటిలా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో సినిమాలతో ప్రయాణం చేయడంకంటే... ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టడమే మేలని చిత్ర పరిశ్రమ నమ్ముతోంది. ఇప్పుడు సినిమాకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఓటీటీ వేదికలే. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, ఆహా... ఇలా పలు ఓటీటీ వేదికలు ప్రేక్షకుడి దగ్గరికే వినోదాన్ని తీసుకొస్తున్నాయి. థియేటర్లు మూతపడినా సరే... ప్రేక్షకుడి వినోదానికి లోటు లేకుండా చేస్తున్నాయి. దాంతో చిత్ర పరిశ్రమలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఓటీటీ లక్ష్యంగా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు నిర్మించడం మేలనే అభిప్రాయానికొస్తున్నారు పరిశ్రమలోని దర్శకనిర్మాతలు. ఆ దిశగా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికే పనుల్ని కూడా ప్రారంభించాయి. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే చిత్రీకరణలు షురూ కాబోతున్నాయి.


నిన్నటివరకు సినిమాకి ఓటీటీ మార్కెట్‌ అనేది ఒక అదనపు ఆదాయ మార్గంగా ఉండేది. థియేటర్లలో విడుదలయ్యాక నెల రోజులకో, యాభై రోజులకో ఓటీటీ వేదికల్లో ప్రదర్శితమయ్యేవి. ఆ హక్కుల రూపేణా నిర్మాతలకి అదనపు ఆదాయం సమకూరేది. అలాంటిది ఇప్పుడు నేరుగా ఓటీటీ వేదికల్లోనే సినిమాల విడుదలకు అడుగులు పడుతున్నాయి. థియేటర్లు మూతపడటమే అందుక్కారణం. లాక్‌డౌన్‌తో చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘అమృతరామమ్‌’ అనే చిత్రం బుధవారం జీ5లో విడుదలవుతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ దారిలో మరికొన్ని సినిమాలు నడిచే అవకాశాలున్నాయి. ఎక్కువ వ్యయంతో తెరకెక్కిన చిత్రాల కంటే, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలపైనే దృష్టి సారించి బేరసారాలు సాగిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. థియేటర్లు మూతపడి నెలన్నరవుతోంది. సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో సినిమాల్ని చూస్తున్నారు. భవిష్యత్తులో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అంటే ఇంకొన్నాళ్లపాటు ప్రేక్షకుడు ఓటీటీలతోనే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓటీటీ మాధ్యమాలు కొత్త కంటెంట్‌ని సృష్టించడంపై దృష్టి పెట్టాయి. దర్శకులు, నిర్మాణ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్టు ఇటీవల తెలిపారు. ఆయనకీ, కొన్ని ఓటీటీ ఛానళ్లకీ మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఓటీటీల కోసం ఆయన వెబ్‌ సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన నేతృత్వంలో నడుస్తున్న ఓటీటీ ఆహా కోసం ఈ ఏడాది 20 వెబ్‌ సిరీస్‌లు నిర్మించనున్నట్టు తెలిపారు. ‘‘ఈ డిసెంబరులోపు 12 వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలనుకున్నాం. కానీ ఆ సంఖ్యని 20కి పెంచబోతున్నాం. కరోనా ప్రభావంతో ప్రేక్షకులు ఓటీటీ మాధ్యమాలకి మరింతగా చేరువయ్యారు. ఆ డిమాండ్‌కి తగ్గట్టుగానే మేం నిర్మాణాలు చేపట్టబోతున్నాం. సినిమాల తరహాలో 1.30 గంట, 2 గంటలు నిడివి గల కొన్ని కథల్ని కూడా ఆహా కోసం సిద్ధం చేసి పెట్టాం. లాక్‌డౌన్‌ తర్వాత అనుమతుల్నిబట్టి చిత్రీకరణ చేపట్టబోతున్నాం’’ అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఒక ప్రముఖ కథానాయకుడు తాను చేయాలనుకున్న సినిమాల్ని పక్కనపెట్టి మరీ, వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టేందుకు కథలు వింటున్నట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్, మంచు విష్ణు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఆర్కా మీడియా తదితర నిర్మాణ సంస్థలు వెబ్‌సిరీస్‌ల నిర్మాణంపై ఇప్పటికే అనుభవాన్ని సంపాదించాయి. అలాంటి సంస్థలన్నీ ఓటీటీల కోసం నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.