పవన్‌ పాత్రల్లో ఆ కిక్కే వేరప్ప!

పవన్‌ కల్యాణ్‌.. ఈయన నటించకపోయినా తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌ దద్దరిల్లుతుంది. కనిపించకపోయినా ఆయన గొంతు వినిపిస్తే చాలు ‘పవర్‌ స్టార్‌.. పవర్‌ స్టార్‌’ అంటూ మారుమోగుతుంది. ఇది పవన్‌కు ఉన్న క్రేజ్‌. కెరీర్‌ ప్రారంభం నుంచి తన మ్యానరిజంతో ప్రత్యేకంగా నిలవడమే ఇందుకు కారణం. పవన్‌ పోషించిన పాత్రల పేర్లలో ఓ కిక్‌ ఉంటుంది. ఆయన పలకడంలో ఓ మ్యాజిక్‌ ఉంటుంది. వాటిలో కొన్ని చూద్దామా...


* బద్రి.. బద్రినాథ్‌

పూరి తెరకెక్కించిన ‘బద్రి’ చిత్రంలో బద్రినాథ్‌ అలియాస్‌ బద్రిగా సందడి చేశాడు. ‘నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రినాథ్‌’ డైలాగ్‌ ట్రెండ్‌ సెట్‌ చేసింది. ఈ చిత్రంలో పవన్‌ హుషారైన నటన యువతను ఊపేసింది.


* సిద్ధు.. సిద్ధార్థరాయ్‌

ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో పవన్‌ నటించిన చిత్రం ‘ఖుషి’. ఇందులో సిద్ధు అలియాస్‌ సిద్ధార్థ రాయ్‌గా వినోదం పంచాడు. ‘నేనెవరో తెలుసా? గుడుంబా సత్తి’ అని విలన్‌ తుపాకీని తల మీద పెట్టిన సన్నివేశంలో ‘‘మీరు గుడుంబా సత్తి కావొచ్చు, తొక్కలో సత్తిగారు కావొచ్చు బట్‌ ఐ డోన్ట్‌ కేర్‌. బికాజ్‌ ఐయామ్‌ సిద్ధు... సిద్ధార్థ రాయ్‌’’ అంటూ పేల్చిన పంచ్‌ బీభత్సం సృష్టించింది.* బాలు.. గని

కరుణాకరన్‌ తెరకెక్కించిన ‘బాలు’ చిత్రంలో బాలు, గని అనే పాత్రల్లో కనిపించాడు పవన్‌. ఈ చిత్రం నుంచి వరుసగా విభిన్న పేర్లు ఉన్న పాత్రల్లో నటించాడు. గని.. రెండు అక్షరాలే అయినా ఈ క్యారెక్టర్‌ మంచి పేరు తీసుకొచ్చింది.

* సంజు.. సంజయ్‌ సాహు

మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించిన ‘జల్సా’లో మరోసారి చిన్న పేరు అలియాస్‌ పెద్ద పేరు పెట్టుకుని అభిమానులతో జల్సా చేయించాడు. విలన్‌తో ‘నే చెప్పానని చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్‌ సాహు చెప్పాడని చెప్పు’ అంటూ యాక్షన్‌ ప్రదర్శించిన తీరు చిరస్థాయిగా నిలుస్తుంది.


* అర్జున్‌ పాల్వాయ్‌.. మైఖేల్‌ వేలాయుధం

జయంత్‌ సి. పరాన్జీ తెరకెక్కించిన ‘తీన్‌మార్‌’లో అర్జున్‌ పాల్వాయ్, మైఖేల్‌ వేలాయుధం అనే సరికొత్త పేర్లను తెరపై ఆవిష్కరించి ఆకట్టుకున్నాడు.

* వెంకటరత్నం నాయుడు

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’. ఇందులో వెంకటరత్నం నాయుడు పేరు మార్చుకుని గబ్బరసింగ్‌గా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

* అభిషిక్త భార్గవ్‌.. బాలసుబ్రహ్మణ్యం

త్రివిక్రమ్‌ మరోసారి పవన్‌ను కొత్త పాత్రల్లో చూపించాడు. అభిషిక్త భార్గవ్‌ అనే నయా పేరుతో సందడి చేయిస్తూనే బాల సుబ్రహ్మణ్యంగానూ ఎంటర్‌టైన్‌ చేయించాడు.

* వకీల్‌సాబ్‌.. ఏ పేరుతో?

‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు పవన్‌. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. న్యాయవ్యవస్థకు సంబంధించిన కథ ఇది. ఇందులో పవన్‌ న్యాయమూర్తి పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకాలం ఆసక్తికర పేర్లతో అభిమానుల్ని అలరించిన పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ కోసం ఏ పేరు ఎంపిక చేసుకున్నాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ప్రశంసలు పొందుతూ రికార్డు సృష్టిస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.