అప్పులు తీర్చేందుకే ‘గబ్బర్‌సింగ్‌’ చేశాను: పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లోనే కాదు.. ఆయన అభిమానుల గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’. ‘దబాంగ్‌’కు రీమేక్‌గా దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు అదిరిపోయే వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్ల వసూళ్లు రాబట్టి తెలుగు తెరపై సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఇంతటి విజయం అందుకున్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి పవన్‌ ఈ సినిమా నచ్చి చేయ లేదట. కొన్ని పరిస్థితుల కారణంగా ఈ చిత్రంలో నటించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవన్‌ కల్యాణే స్వయంగా వెల్లడించారు. దీని గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రాన్ని కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. ‘దబాంగ్‌’ చిత్రంవిడుదలైన రెండు మూడు నెలలకు నాకు చూపించారు. అది చూశాక ఆ చిత్రాన్ని నేనెలా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ చిత్ర కథనమంతా సల్మాన్‌ ఖాన్‌ వ్యక్తిత్వానికి, యాటిట్యూడ్‌కి తగ్గట్లుగా ఉంది. అన్ని చిత్రాల్లో ఉన్నట్లే ఓ తల్లి, ఆమె కొడుకు కథ ఉంది. ఇందులో కొత్తదనం ఏముంది..? నేను చేయలేనన్నా. కానీ, కొన్నాళ్ల తర్వాత నాకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. మా అన్నయ్యకి ఓ సినిమా విషయంలో ఆర్థికంగా ఇబ్బందులెదురైతే.. ఆ బాధ్యతను నేను తీసుకున్నా. దీంతో వెంటనే ఏదైనా సినిమా చేసి ఆ అప్పులు తీర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తక్కువ బడ్జెట్‌లో త్వరగా పూర్తి చేసే చిత్రం మంచిది అనుకున్నా. అప్పుడు ‘దబాంగ్‌’ గుర్తొచ్చి మళ్లీ చూశా. ఈ చిత్రంలో నా పోలీస్‌ పాత్ర ఎలా ఉండాలి అన్నది నేనే డిసైడ్‌ చేసుకున్నా. ఈ చిత్రంలో పోలీస్‌ పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటాడు. కానీ, డ్రెస్సింగ్‌ స్టైల్‌ వ్యవహార శైలి చూస్తే చాలా విభిన్నంగా ఉండాలి అనుకున్నా. దీనికి స్ఫూర్తిగా ‘గుడుంబా శంకర్‌’లోని ఓ సీన్‌లో నేను చేసిన పోలీస్‌ పాత్ర తీసుకున్నా. అందులో నా డ్రెస్సింగ్‌ స్టైల్, వ్యక్తిత్వానికి దగ్గరగానే ‘గబ్బర్‌సింగ్‌’లోని నా పాత్ర ఉంటుంది. ఇక ఈ చిత్రంలో నా పేరు వెంకటరత్నం నాయుడు అయినా అందరూ ‘గబ్బర్‌సింగ్‌’ అంటుంటారు. ఆ పేరు పెట్టడానికి స్ఫూర్తి ఒకప్పుడు ఓల్డ్‌ సిటీలో ఉన్న ఓ పోలీస్‌ అధికారి. అప్పట్లో అతన్ని అంతా ‘గబ్బర్‌సింగ్‌’ అని పిలుస్తుండేవారు. తనని నేనూ చూశా కానీ, నాకంత పరిచయం లేదు. నాకు ఆ పేరు చాలా నచ్చేది. కొన్ని సినిమాల్లోని పాత్రల్ని చూసినప్పుడు ఇలాంటి పేరు వాటికి బాగా సూట్‌ అవుతుందనిపిస్తుంది. అలాగే నా చిత్రంలోని పోలీస్‌ పాత్రను చూసుకున్నాక దానికి ‘గబ్బర్‌సింగ్‌’ పేరైతేనే సరిగ్గా సరిపోతుందనిపించింది. అలా ఆ చిత్రం పట్టాలెక్కింది. నిజానికి నా నుంచి వచ్చిన రెండు ‘గబ్బర్‌సింగ్‌’లు నా ఆర్థిక అవసరాల వల్ల వచ్చినవే’’ అని చెప్పుకొచ్చారు పవన్‌.


ఆ సీన్‌లో పవన్‌ ప్లేస్‌లో హరీష్‌!

మీకు తెలుసో లేదో.. ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో ఓ సన్నివేశంలో పవన్‌ కల్యాణ్‌ స్థానంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ నటించారు. అదీ పోలీస్‌ గెటప్‌ వేసుకొని మరీ. రెప్పపాటు కాలం కనిపించే ఈ సీన్‌ చిత్ర క్లైమాక్స్‌కి ముందు వస్తుంది. అదెక్కడంటే.. ప్రత్యేక గీతం ‘కెవ్వు కేక’ పతాక సన్నివేశంలో చెక్‌ పోస్ట్‌ దగ్గర విలన్లను ఆపేందుకు రోడ్డుపై పవన్‌ నుంచున్న సీన్‌ ఉంటుంది కదా. అందులోనే. అక్కడ తొలుత రోడ్డుపై నుంచొని కనిపించేది హరీష్‌. బాగా పరీక్షించి చూస్తే కానీ, అది పవనా, హరీశా అన్నది గుర్తించలేరు. ఒక్క సెకనులో కనిపించి తళుక్కున మాయమవుతారు హరీష్‌. ఎందుకంటే మళ్లీ వెంటనే ఆ సీన్‌లో పవన్‌ దర్శనమిస్తారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.