రాజకీయ తెరపై.. హిట్లు - ఫట్లు !
దేశంలో ఎన్నికల వేడి చల్లారింది. దేశ ప్రధాని పీఠంపై మరోసారి నరేంద్ర మోదీ సగర్వంగా కొలువుదీరబోతుండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. దాదాపు మూడు నెలలకు పైగా సాగిన ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఎన్నెన్ని చిత్రాలు విచిత్రాలు కళ్ల ముందు తారసపడ్డాయో. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్, హేమమాలిని, ప్రకాష్‌ రాజ్, ఊర్మిళ వంటి వెండితెర తారలు కూడా ఈసారి ఓట్ల సమరంలో తళుక్కున మెరవడం ఈ ఎన్నికలకు మరింత ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. మరి తెరపై తమదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ వెండితెర స్టార్లు.. రాజకీయ సమరంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఎంత మేర విజయం సాధించారు. ఈ ఎన్నికల పోరులు ఎవరెవరు విజయ పతాకాన్ని రెపరెపలాడించారు చూసొద్దాం పదండి.


* అందరి కళ్లు పవర్‌స్టార్‌ వైపే..
ఈసారి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల రణరంగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన సినీ గ్లామర్‌ ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తరపున ప్రచారంలో పాల్గొన్ని తెదేపా విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్‌.. ఈసారి తన జనసేన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల సమరంలోకి నేరుగా అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి తన ప్రచార కార్యక్రమాలతో ప్రజలను అలరించారు. కానీ, అది ఓట్లు రాల్చడంలో ఏమాత్రం ఉపయోగపడలేకపోయింది. జనసేన పార్టీ అధినేతగా భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి పోటీ చేయగా.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. భీమవరంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌కు తొలుత గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరకు మాత్రం ఆయనకు చేదు ఫలితమే ఎదురైంది. ఇక గాజువాకలో తప్పక గెలుస్తాడని ఆశలు పెట్టుకున్నప్పటికీ అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి (టి.నాగిరెడ్డి) చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఇక ఆయన సోదరుడు నటుడు నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయగా.. వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు చేతిలో ఓటమి చవిచూశారు.


* వికసించిన రోజా..
ఏపీ ఎన్నికల్లో వికసించిన సినీ గ్లామర్‌ ఏదైనా ఉందీ అంటే అది రోజా మాత్రమే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈ సీనియర్‌ కథానాయిక.. తన సమీప అభ్యర్థి గాలి బాను ప్రకాష్‌ (తెదేపా)పై విజయం సాధించి సత్తా చాటారు.


* సుమలత.. సీఎం కుమారుడిపైనే
దక్షిణాదిలో అనేక హిట్‌ చిత్రాల్లో కథానాయికగా నటించిన సత్తా చాటిన సుమలత అంబరీష్‌ రాజకీయ తెరపైనా మెరుపులు మెరిపించింది. స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ సీనియర్‌ నాయిక.. కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్‌ కుమారస్వామి గౌడపైన ఘన విజయం సాధించారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. గడిచిన 60 ఏళ్లలో మాండ్యలో ఓ స్వతంత్య్ర అభ్యర్థి ఇలా విజయం సాధించడం ఇదే తొలిసారట.


* ‘రంగీలా’ భామకు రంగుపడింది..
‘‘యాయిరే యాయిరే’’.. అంటూ దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న ‘రంగీలా’ భామ ఉర్మిళ మతోండ్కర్‌ తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉత్తర ముంబయి నుంచి పోటీ చేసి.. భాజపా అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయింది.


* సత్తా చాటిన సన్నీ దేవోల్‌..
90లలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడిగా మెరుపులు మెరిపించారు సన్నీ దేవోల్‌. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (భాజపా) తరపున గురుదాస్‌ పుర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు విజయం సాధించారు. రాజకీయ తెరపైనా హీరోగా నిలిచారు.


* జయప్రదకు దక్కని జయం..
గతంలో సమాజ్‌వాది పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నాయిక జయప్రద.. ఈసారి భాజపాలో పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌ రామ్‌పుర్‌ నుంచి పోటీ చేసిన ఈమె సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్‌ చేతిలో పరాజయం చెందారు.

* రాజ్‌బబ్బర్‌..
ప్రముఖ నటుడు రాజ్‌బబ్బర్‌ భాజపా అభ్యర్థి రాజ్‌కుమార్‌ చాహర్‌ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఫతేపూర్‌సిక్రీ నుంచి పోటీ చేశారు.


* శతృఘ్న సిన్హా...
భాజపా నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన శతృఘ్న సిన్హా పట్నాసాహిబ్‌ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. అయితే భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేతిలో పరాజయం చెందారు.

* ప్రియా దత్‌..
బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ సోదరి ప్రియా సునిల్‌ దత్‌ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ తరపున ముంబయి నార్త్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన ప్రియా భాజపా అభ్యర్ధి పూనమ్‌ మహాజన్‌ చేతిలో ఓడారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.