ఆరంభం అదిరింది.. ముగింపు?

అదరగొట్టే ఆరంభం.. మెరుపులాంటి ముగింపు.. ఈ రెండింటికీ క్రికెట్‌లోనే కాదు.. చిత్ర పరిశ్రమలోనూ ఎంతో ప్రాధాన్యముంది. ఈ ఏడాది తెలుగు చిత్రసీమకు ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో అదిరిపోయే ఆరంభం దక్కింది. ఏం లాభం! ఓపెనర్లు సెంచరీలు కొట్టాక వర్షంతో అర్ధంతరంగా నిలిచిపోయిన మ్యాచ్‌లా.. కరోనా దెబ్బకు వెండితెర పూర్తిగా చిన్నబోయింది. వేసవి వినోదాలు.. దసరా సరదాలు.. అన్నీ ఒకటి తర్వాత మరొకటి తుడిచిపెట్టుకు పోయాయి. ఇప్పుడు మిగిలింది దీపావళి, క్రిస్మస్‌ సీజన్లే. వచ్చే సంక్రాంతి నాటికి ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడాలన్నా.. బాక్సాఫీస్‌ నూతనోత్తేజాన్ని సంతరించుకోవాలన్నా.. ఈ రానున్న ఈ రెండు పండగ సీజన్ల నుంచి చిత్రసీమ ఓ మెరుపులాంటి ముగింపు అందిపుచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా?


కరోనా దెబ్బకు ఈ ఏడాది చిత్ర పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. 7నెలల కాలంలో దాదాపు రూ.1100 కోట్లు నష్టపోయింది. మిగిలిన రెండు నెలలైనా బాక్సాఫీస్‌ ముందు కాసుల చప్పుడు వినిపిస్తుందా అంటే.. అదీ అనుమానంగానే కనిపిస్తోంది. అక్టోబరు 15నుంచే థియేటర్లు తెరచుకోవచ్చని అనుమతులిచ్చినా.. ఎక్కడా పూర్తి స్థాయిలో సినిమా సందడి మొదలు కాలేదు. నవంబరు నుంచి థియేటర్లు తెరచుకుంటాయనే నమ్మకం.. పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తుంది. హాళ్లు తెరచుకున్నా.. వెండితెరపై సందడి చేసేందుకు కొత్త చిత్రాలేవి సిద్ధంగా లేవని తెలుస్తోంది.
* యాభై శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నిర్వహించాల్సి రావడం, అది గిట్టుబాటు అవుతుందో లేదో అన్న భయాలతో చాలా మంది నిర్మాతలు ఇప్పటికీ సాహసించడం లేదు. ఇప్పుడీ భయాలతోనే దీపావళి సీజన్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న సినిమాల జాబితా మరింత పెరుగుతోంది. ఇప్పటికే సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీ’, నయనతార ‘అమ్మోరు తల్లి’, కీర్తి సురేష్‌ ‘మిస్‌ ఇండియా’, జయం రవి ‘భూమి’, పాయల్‌ రాజ్‌పూత్‌ ‘అనగనగా ఓ అతిథి’ వంటి చిత్రాలు ఓటీటీ విడుదలకు ముహూర్తాలు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నవంబరు మధ్య నుంచి వెండితెర వినోదాలకు తెరలేపినా.. థియేటర్లలో రీరిలీజ్‌ చిత్రాలు, చిన్న సినిమాల హంగామానే కనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఓటీటీ వినోదాలకు అలవాటు పడిన సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించాలంటే.. వీటి సామర్థ్యం అసలు సరిపోదనే చెప్పాలి. స్టార్ల ఆకర్షణ, కథా బలం ఉన్న కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది.

అదే అసలు సవాల్‌..

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల విడుదల బాధ్యతను భుజానికెత్తుకునేందుకు ముందుకొచ్చే నిర్మాతలెవరన్నది అసలు సమస్య. వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’, నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, సాయిధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సోబెటరు’, సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, ప్రదీప్‌ ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’, సుశాంత్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, నరేష్‌ ‘నాంది’ వంటి పలు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసుకున్న జాబితాలో ఉన్నాయి. ఇందులో కొన్ని ఓటీటీ వైపు అడుగులు వేయనున్నటు కనిపిస్తున్నా.. చాలా వరకు థియేటర్లలో సందడి చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఒకవేళ డిసెంబరు నాటికి పూర్తిస్థాయి ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకునేందుకు అనుమతిస్తే.. వీటిలో చాలా చిత్రాల్ని క్రిస్మస్‌ రేసులో చూసే అవకాశ ముంటుంది. ఈలోపు వీలైనంత త్వరగా థియేటర్లు పునః ప్రారంభించాల్సి ఉంది. వీటిలో ఏది ఆలస్యమైనా.. ఆ ప్రభావం సినీ క్యాలెండర్‌ ముగింపు పైనా, సంక్రాంతి సీజన్‌పై పడే అవకాశముంటుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.