తొలి నెల టాలీవుడ్‌ విలవిల..

క్రికెట్‌లో ఓపెనింగ్‌ జోడీపై జట్టు జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.వాళ్లిద్దరూ కుదురుగా ఆడితే... భారీ స్కోరుకి గేట్లు తెరుచుకున్నట్లే. ఏ రంగంలో అయినా శుభారంభం చాలా అవసరం. ‘మంచి ప్రారంభం.. సగం విజయం’ అనేది అందుకే. టాలీవుడ్‌ కూడా అలాంటి అదిరే ఆరంభాన్ని కోరుకుంది. సంక్రాంతి సీజన్‌లో వచ్చే సినిమాలతో ఘనమైన బోణీ కొట్టాలని ఆశ పడింది. కానీ అవేం నెరవేరలేదు. సంక్రాంతి సీజన్‌లో అంచనాలు మోసుకొచ్చిన చిత్రాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడడంతో ఈ ఏడాదికి ఆశించిన ‘ఓపెనింగ్‌’ లభించలేదు. దాంతో తొలి నెల వెలవెలబోయింది.


సంక్రాంతితో టాలీవుడ్‌ క్యాలెండర్‌ మొదలవుతుంది. ఈ సీజన్‌లో ఎలాగూ భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతాయి కాబట్టి.. వాటిపై మంచి అంచనాలే ఏర్పడతాయి. ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో ముక్కోణపు పోటీ కనిపించింది. తెలుగు చిత్రాలు ‘ఎన్టీఆర్‌ - కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్‌ 2’ బరిలో నిలిచాయి. అనువాద చిత్రం ‘పేటా’ కూడా ఈ మూడు చిత్రాలకు సవాల్‌ విసిరింది. జనవరి 9, 10, 11, 12... ఇలా రోజుకో సినిమా రావడంతో బాక్సాఫీసు కళకళలాడింది. అయితే వీటిలో ‘ఎఫ్‌ 2’ మాత్రమే విజయాన్ని అందుకుంది.‘ఎన్టీఆర్‌’కి మంచి ఓపెనింగ్స్‌ లభించినా బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకోలేకపోయింది. ఎన్టీఆర్‌గా బాలయ్య అభినయాన్ని, క్రిష్‌ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకున్నా ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. మొత్తంగా చూస్తే పంపిణీదారులకు ఈ చిత్రం నష్టాన్నే మిగిల్చింది. రామ్‌చరణ్‌ - బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ అంచనాల్ని తలకిందులు చేసింది. కథ కథనాలలో కొత్తదనం కనిపించకపోవడం, యాక్షన్‌ సన్నివేశాల్లో లాజిక్కులు మిస్సవ్వడం ఈ చిత్రానికి శాపంగా మారాయి. విడుదలకు ముందు దాదాపు రూ.వంద కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం, అందులో సగం కూడా రాబట్టుకోలేదు. అనువాద చిత్రం ‘పేట’ ఓ మాదిరి ఫలితాన్ని రాబట్టింది కానీ ఆశించిన వసూళ్లు మాత్రం దక్కలేదు.


వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ మాత్రం ‘ఎఫ్‌ 2’తో ఆకట్టుకున్నారు. పండగ సీజన్‌ చివర్లో వచ్చిన ఈ చిత్రం... సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈనెల చివరి వారంలో వచ్చిన ఒకే ఒక్క చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్‌ కథానాయకుడు. యువతరాన్ని టార్గెట్‌ చేసిన ఈ చిత్రం లక్షిత ప్రేక్షకుల మెప్పుని పొందలేకపోయింది. మొత్తంగా ఈనెలలో 5 చిత్రాలు విడుదలైతే ‘ఎఫ్‌2’ ఒక్కటే నిర్మాతకు, పంపిణీదారులకు లాభాలను మిగిల్చింది.


ఓవర్సీస్‌లోనూ ఇంతే!
ఈ మధ్య కాలంలో ఓవర్సీస్‌ వసూళ్లు టాలీవుడ్‌కి కొత్త ఊపిరి పోస్తున్నాయి. సినిమా హిట్టయితే డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికీ ఓవర్సీస్‌ బిజినెస్‌ భారీ ఎత్తున సాగింది. బాలకృష్ణ, చరణ్‌, వెంకటేష్‌ సినిమాల హక్కుల్ని రూ.కోట్లు పోసి కొన్నారు. ‘మిస్టర్‌ మజ్ను’కీ మంచి ధరే పలికింది. అయితే ఓవర్సీస్‌లోనూ సంక్రాంతి సినిమాలకు చుక్కెదురైంది. ‘ఎఫ్‌ 2’ మినహాయిస్తే మిగిలినవన్నీ కనీస వసూళ్లు అందుకోలేక డీలా పడ్డాయి. గత రెండు నెలలుగా ఓవర్సీస్‌లో ఏ చిత్రానికీ సరైన వసూళ్లు లభించడం లేదు. దాంతో అక్కడి పంపిణీదారులు తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. సంక్రాంతి సీజన్‌ అయినా గట్టెక్కిస్తుంది అనుకుంటే ఈసారీ వాళ్లకు నిరాశే మిగిలింది.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.