విదేశాల్లో చిత్రీకరణకు సై అంటోన్న తెలుగు పరిశ్రమ

తెలుగు సినిమా కథలు కరోనాని ఖాతరు చేయడం లేదు. పరిస్థితులు భయపెడుతున్నా సరే... ఫ్లైట్‌ ఎక్కేయాల్సిందే అంటున్నాయి. మొన్నటివరకు ఇకపై విదేశాల్లో చిత్రీకరణలు కష్టమే అనుకున్నారంతా. కానీ మన కథలు అస్సలు రాజీ పడటం లేదు. విదేశాల్లో చిత్రీకరణలు లేకుండా రూపొందే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఒకట్రెండు పాటల కోసమైనా అక్కడికెళ్లి క్లాప్‌ కొడుతుంటారు. ఇక ఆ నేపథ్యంలోనే సాగే సినిమాలైతే నెలలపాటు అక్కడే చిత్రీకరణలు జరుపుకొంటుంటాయి. అలాంటి కథలకి వైరస్‌ దెబ్బతో కష్టకాలమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా పరిస్థితులకి ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా అలవాటుపడుతోంది. దాంతో చిత్రబృందాలు మళ్లీ చలో అంటూ రెక్కలు కట్టుకొని ఎగిరి పోతున్నాయి.

నిన్న మొన్నటివరకు కరోనా ఉద్ధృతి చూసి విదేశాలకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న చిత్రబృందాలు చాలా ఉన్నాయి. లాక్‌డౌన్‌కి ముందు అక్కడికి వెళ్లినవాళ్లు కూడా వెంటనే తిరిగొచ్చేశారు. ఎంతకూ కరోనా తీవ్రత తగ్గే పరిస్థితులు కనిపించకపోవడంతో... విదేశీ నేపథ్యంలో సాగే సినిమాలన్నీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశాల తరహాలోనే కొన్ని సెట్స్‌ వేసి ఇక్కడే చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నాయి. ప్రభాస్‌ కథా నాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ బృందం అదే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో యూరప్‌ని పోలిన వీధులు, ఆస్పత్రి సెట్స్‌ పనుల్ని మొదలు పెట్టింది. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అయినా ప్రభాస్‌ మాత్రం సెట్స్‌లోకి దిగకుండా విమానమెక్కేశారు. ‘రాధేశ్యామ్‌’ బృందం ఇటలీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లిపోయింది. సన్నివేశాల్లో సహజత్వం కనిపించాలంటే అక్కడ చిత్రీకరణ జరపాల్సిందే అని చిత్ర బృందాలు నమ్ముతున్నాయి.


* మహేష్‌బాబు హీరోగా తెరకెక్కనున్న ‘సర్కార్‌ వారి పాట’ అమెరికా నేపథ్యంలో సాగే కథే. అందుకే మహేష్‌ నవంబర్‌లో ఫ్లైట్‌ ఎక్కేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్‌, ఆయన బృందం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉంది. కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరపడానికి ఆయా బృందాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.


* విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్‌’ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. సినిమాలో విదేశీ ఫైటర్లతో తలపడే సన్నివేశాలు ఉంటాయట. వాటిని తెరకెక్కించేందుకు పూరి జగన్నాథ్‌ అక్కడే చిత్రీకరణ జరపాలని నిర్ణయించారంటున్నాయి సినీ వర్గాలు.


* నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘రంగ్‌దే’ త్వరలోనే ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్నదని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఆ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హిందీ, తమిళ చిత్రబృందాలు విరివిగా విదేశీ షెడ్యూళ్లని ప్లాన్‌ చేసుకుంటున్నాయి.


* బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఇటీవలే ‘బెల్‌ బాటమ్‌’ కోసం స్కాట్లాండ్‌ వెళ్లి విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చారు. దాంతో మిగతా పరిశ్రమలన్నీ మునుపటిలాగా విదేశాల్లో చిత్రీకరణల కోసం ప్రణాళికలు రచించుకుంటున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.