బండరాయే మా గురువు...

బడి అంటే ఏంటో ఎరగరు..

పట్నం ఎలా ఉంటుందో తెలియదు..

మేకలు, పశువులను కాయడం మాత్రమే తెలుసు..

ఒళ్లు వంచి ఎంతటి కష్టాన్నైనా అవలీలగా చేయడమే వారికి తెలుసు..

కుటుంబం కోసం ఏదొకటి చేయాలనే బలమైన కోరిక వారిని చెన్నైకి రప్పించింది..

మాస్‌, క్లాస్‌ అనే తేడా లేదు..


హీరోలతో పంచులు వేయించారు..

సినీ పరిశ్రమకు తమ దెబ్బల విలువేంటో చూపించారు..

ఫైట్స్‌కు కూడా ప్రేక్షకులతో విజిల్స్‌ వేయించవచ్చని నిరూపించారు...

ఇదంతా ఎవరి గురించో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది..

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన అన్నదమ్ములు ఫైట్‌ మాస్టర్లు ‘రామ్‌-లక్ష్మణ్‌’..


రూపులోనే కాదు.. వినయంలోనూ ఇద్దరికి ఇద్దరూ సాటే..

తమ ఉనికిని గుర్తు చేసుకుంటూ.. సహకరించిన ప్రతి ఒక్కరికీ విధేయతగా నమస్కరించారు.. ఈ అభినవ సోదరులు..

తమ జీవిత పోరాటంలో పడిన కష్టాలు, ఇబ్బందులు, సంఘటనలను సవినయంగా చెప్పుకున్నారు... ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో...

అసలు ఏమవుదామని ఇండస్ట్రీకి వచ్చారు?

రామ్‌-లక్ష్మణ్‌: పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాలు ఊర్లోనే మేకలు, పశువులను కాసుకుంటూ ఉన్నాం. వాటిని బాగా చూసుకున్నామని ప్రమోషన్‌ ఇచ్చి అవే మమ్మల్ని ఆశీర్వదించి బయటకు పంపాయేమో. ఇంకా ఏదో సాధించాలనే చెన్నై వచ్చాం. ఇద్దరం ఒకేసారి ఇంట్లో వారి అనుమతితో సర్కార్‌ బండి ఎక్కాం.


ఈ రోజుల్లో ఈ ఫైట్‌ ఇలా తీయొచ్చు.. అనే ఆలోచన చదువుకుంటేనే వస్తుంది.. మరి మీకెలా వస్తుంది?

రామ్‌-లక్ష్మణ్‌: నిజం చెప్పాలంటే మాకూ అదే డౌట్‌ వస్తుంటుంది (నవ్వులు). అరవింద సమేత వీర రాఘవ ఇంట్రడక్షన్‌ ఫైట్‌ను థియేటర్‌లో వెళ్లి చూసిన తర్వాత మేం చేశామా? అనే అనుమానం మాకే వచ్చింది. ఇదంతా ప్రకృతి సహకారం, ఆ సమయానికి భగవంతుడు వల్లే ఇదంతా వచ్చిందేమో.


అమ్మా, నాన్నకు మీరు మొత్తం ఎంతమంది సంతానం?

రామ్‌-లక్ష్మణ్‌: మాది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం నందిగుంటపాలెం గ్రామం. మేం మొత్తం ఐదుగురం. ఫస్ట్‌ అక్క, తర్వాత అన్నయ్య, మళ్లీ అక్క.. తర్వాత మేం ఇద్దరం. అందరిలోకెల్లా మేమే చిన్నవాళ్లం. ఆ ముగ్గురిలో మేం తప్ప ఎవరూ కవలలు లేరు.


తెలుగులో మీ మొదటి సినిమా ఏది?

రామ్‌-లక్ష్మణ్‌: సురేశ్‌ హీరోగా ‘శివుడు’. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. (మధ్యలో ఆలీ అందుకుంటూ.. దాంట్లో నేను కూడా యాక్ట్‌ చేశా). ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’. ఇదంతా పూరీగారి ప్రసాదమే (నవ్వులు).

టోపీలు పెట్టుకోవడం సెంటిమెంటా? అలవాటా?

రామ్‌-లక్ష్మణ్‌: మా గురువు రాజు మాస్టరు టోపీ పెట్టుకునేవారు. ఓసారి రాజస్థాన్‌కు షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు రెండు లెదర్‌ క్యాప్‌లను పెట్టుకున్నాం. ఫైట్‌ మాస్టరుగా ఓ గెటప్‌ ఉంటే బాగుంటుందని, పెట్టుకుంటే స్టైలిష్‌గా ఉంటుందని ఇదే కంటిన్యూ చేసేశాం.


ఎన్ని సినిమాలు చేశారు?

రామ్‌-లక్ష్మణ్‌: ఫైటర్‌గా దాదాపు వెయ్యి సినిమాలు చేసి ఉంటాం. ఫైట్‌ మాస్టర్లుగా 200కిపైగా సినిమాలకు పని చేశాం. ఫైటర్‌గా మీ(ఆలీ)తో ఫైట్‌ చేశాం కదా.. (మధ్యలో ఆలీ అందుకుని.. అవును అప్పుడు మీరు బాడీ బిల్డర్‌ మాదిరిగా ఉండేవారు. నేను సన్నగా ఉండేవాడిని. నేను కొడితే మీరు పడిపోవడం. ఉఫ్‌ మంటే నేను అంతదూరం పడతా.) (నవ్వులు). చెన్నైకి వచ్చేటప్పుడు చీరాల రైల్వే స్టేషన్‌లో చెరో ఫ్యాంట్‌ కొనుక్కోని .. మళ్లీ ఊరుకెళ్లేటప్పుడు ఆ ఫ్యాంట్‌ను సంచిలో పెట్టుకుని వెళ్లేవాళ్లం. ఫ్యాంట్‌తో ఊర్లోకి వెళ్లాలంటే మొహమాటం పడేవాళ్లం. దాదాపు సంవత్సరం వరకు ఫ్యాంట్‌తో ఊరికి వెళ్లలేదు.


రాజు మాస్టర్‌కు మీకూ పరిచయం ఎలా?

రామ్‌-లక్ష్మణ్‌: రాజు మాస్టర్‌ తండ్రిది మా ఊరు పక్కనే సంతరావూరు. రాజు మాస్టరు అక్కడే చదువుకున్నారు. కోడి పందేలు వేయడానికి అప్పుడప్పుడు మా ఊరు వస్తుంటారు. రాజుగారి స్నేహితుడు మా నాన్నకు మిత్రుడు. అలా మా నాన్నకు ఆయన స్నేహం. పరిచయం చేయడానికి ఆయన దగ్గరకు మా నాన్న తీసుకెళ్లారు. ఆయన చూడగానే.. మీకు ఏం తెలుసురా? అడిగారు. మాకు కర్ర సాము తెలుసు అని చెప్పాం. ఓ ఆరు నెలల వరకు పట్టు వదలకుండా తిరిగాం. అప్పుడు చెన్నైకి రమ్మని పిలుపొచ్చింది.

మొట్టమొదట చెన్నైలోని అరుణాచలం స్టూడియోకు వెళ్లాం. అక్కడ పెట్టే భోజనం చూసి మాకు మతిపోయింది. ఐదారు రకాల కూరలు.. హంగామా చూసి ఎలాగైనా సినిమాలకు పని చేయాలనే తపన అక్కడ స్టార్ట్‌ అయింది. ఊర్లో అంటే ఏదో పచ్చడి, ఒక కూర తినేవాళ్లం కదా. చాన్నాళ్లు ఆకలితో పోరాటం చేశాం. అందుకే భోజనం కోసమైనా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం. ఓసారి భోజనం చేసేటప్పుడు పెరుగు వచ్చింది.. రాగానే పెరుగు వేసుకున్నాం. మళ్లీ రాదేమోనని. రాజు మాస్టరు తల మీద ఒక్కటిచ్చారు.. ముందు కర్రీస్‌ వేసుకుని పెరుగును క్లైమాక్స్‌లో వేయించుకోవాలని చెప్పారు. గురువు అంటే ఏదో పనిమీదే కాకుండా సమాజంలో ఎలా బతకాలో కూడా చెప్పేవాడే అసలైన గురువు. మాకు రాజు మాస్టరు దొరకడం మా అదృష్టం. రామ్‌-లక్ష్మణ్‌కు నేను గురువు అవడం కంటే.. నాకు వారిద్దరూ శిష్యులు కావడం గొప్ప.. అని రాజుమాస్టరు చెప్పడం ఎంతో గర్వంగా ఉంది.

అవును.. మీకు బండరాయి గురువట కదా.. ఏంటా స్టోరీ?

రామ్‌-లక్ష్మణ్‌: మాది పక్కా పల్లెటూరు. ఊర్లో ఏదైనా సాహసం చేస్తే హీరోల మాదిరిగా చూసేవారు. ఊర్లో పెద్ద బండరాయి ఉండేది. దానిని ఎవరూ ఎత్తలేకపోయేవారు. మేమిద్దరం రాత్రి వేళ దానిని ఎత్తే ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. ఓ పండుగ రోజు అందరి ముందు బండ రాయిని ఎత్తేశాం. అప్పుడు వాళ్ల రియాక్షన్‌ చూస్తే.. మాకు అదో సంబరంగా ఉండేది.

ఊళ్లో పెద్ద ఇల్లు కట్టారు కదా..?

రామ్‌-లక్ష్మణ్‌: ఊర్లో కట్టలేదు. పక్కన మామిడి తోటలో ఫామ్‌హౌస్ మాదిరిగా కట్టుకున్నా. గ్రామంలో ఉన్న ఇంటిని అలాగే వదిలిపెట్టాం. మేం వెళ్లినప్పుడు మా ఇల్లు గుర్తుకు రావాలని అలాగే వదిలిపెట్టేశాం. మేం ఎంత ఎదిగామో దానిని చూస్తే ఒకరకమైన అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాం. మేం అందరం మంచిగానే సెటిల్‌ అయ్యాం. అన్నయ్య మా డేట్స్‌, సినిమాలను చూసుకుంటూ మాతోనే ఉంటారు. అన్నయ్య గురించి చెప్పాలంటే ఓ సంఘటన గుర్తుకొస్తుంది.. మేం చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఇంటి నుంచి బియ్యం మూటతో వచ్చాడు. అయితే మేం ఉండే చోటుకి రైల్వేస్టేషన్‌కు దాదాపు 25 కి.మీ ఉంటుంది. ఆటో ఎక్కితే ఖర్చు అవుతుందని స్టేషన్‌ నుంచి బియ్యం మూటను నెత్తిన పెట్టుకుని నడిచి వచ్చాడు. మా అన్నయ్యను తండ్రి తర్వాత తండ్రే అని చెప్పొచ్చు.


మీరు ఏ సంవత్సరంలో పుట్టారు? మీకు ఎంత మంది సంతానం?

రామ్‌-లక్ష్మణ్‌: తెలియదు. నాట్లు వేసేటప్పుడు పుట్టారని మా అమ్మ చెప్పింది. (మధ్యలో ఆలీ అందుకుని.. ప్రతి సంవత్సరం నాట్లు వేస్తుంటారు కదా..) అంటే మా ఊర్లో నాట్లు వేసే సమయం ఆగస్టు. సంవత్సరం ఎప్పుడని మా నాన్నను అడిగితే.. 1969 గాలివానకు మేం ఏడాది పిల్లలం అని చెప్పాడు. ఓహో.. అంటే 1968 ఆగస్టులో అని డిసైడ్‌ చేసుకున్నాం. దాదాపు ఇప్పుడు మాకు 52 ఏళ్లు ఉంటాయి. మాకు ఇద్దరేసి పిల్లలు. అన్నయ్య, మేం అంతా ఉమ్మడిగానే ఉంటున్నాం.మీ ఇద్దరిలో రామ్‌ ఎవరు.. లక్ష్మణ్‌ ఎవరనేది నాకు కన్ఫ్యూజన్‌ (నవ్వులు). మీ ఇంట్లో వారూ అవుతుంటారా?

రామ్‌-లక్ష్మణ్‌: మా ఇంట్లోనూ అప్పుడప్పుడూ అయోమయానికి గురవుతుంటారు. మా అమ్మ కూడానూ.. ఎలాగంటే టిఫిన్‌ పెట్టేప్పుడు ఒకడికే రెండుసార్లు పెడుతుంటుంది.. పిల్లలు అవుతుంటారు కాని.. ఇద్దరిలో ఎవరిని డాడీ అని పిలిచినా పలుకుతాం. నిజం చెప్పాలంటే మా పిల్లలు పుట్టిన సమయంలో వారితో ఎక్కువ వారితో గడపలేకపోయాం. అప్పుడే సినిమాలతో బాగా బిజీగా ఉండేవాళ్లం.రజనీకాంత్‌ అంటే పెద్ద యోగి.. రామ్‌-లక్ష్మణ్‌ ఇద్దరూ పెద్ద యోగులు అని రజనీ చెప్పారు. మీ దగ్గర ఆయన ఏం గమనించారు?

రామ్‌-లక్ష్మణ్‌: దర్బార్‌ సినిమాతో రజనీకాంత్‌తో చేయాలనే కోరిక తీరింది. ముంబయిలో షూటింగ్‌ సమయంలో కలిశాం. ఎప్పుడో ఆయనతో సోలో ఫైటింగ్‌ చేశాం. దర్బార్‌ అప్పుడు ఆయన గుర్తు పట్టి.. బాగా లావుగా ఉండేవారు కదా.. అని అడిగారు. అవును సార్‌ మేం రామ్‌-లక్ష్మణ్‌ అని పరిచయం చేసుకున్నాం. మేము పదేళ్ల నుంచి ధ్యానం వైపు మళ్లాం. అప్పటి నుంచి మా ఆహారపు అలవాట్లు బాగా మార్చుకున్నాం. మా ఆహారం, మేం మాట్లాడే మాటలను దర్బార్‌ షూటింగ్‌ సందర్భంగా రజనీకాంత్‌ గమనించారు.


ఏ హీరోతో ఇంకా చేయలేదు... అనేది లిస్ట్‌లో ఎవరైనా ఉన్నారు?

రామ్‌-లక్ష్మణ్‌: లిస్ట్‌లో ఒకరు ఉన్నారు. భగవంతుడు.. ( ఆలీ.. ఏంటి ఆయనతో ఫైట్‌ చేయిస్తారా ఏంటి).. అదేం లేదు. దేవుడికి కాస్త దూరమయ్యాం. ఇప్పుడు కొంచెం ప్రకృతి, విశ్వం, భగవంతుడికి దగ్గరమవుదామని.. ఇన్నర్‌ ట్రావెలింగ్‌ చేస్తున్నాం. దగ్గరే ఉన్నాడు.. కాకపోతే దూరంగా ఉన్నాడని మనం భావిస్తున్నాం.


ఊర్లో పంట కోసి మీకు మొదట ఇస్తారట? ఎందుకు?

రామ్‌-లక్ష్మణ్‌: అంటే మేం కవలలం కదా. వరి కుప్ప కొట్టేప్పుడు ధాన్యం మరింత రావాలని ప్రార్థిస్తూ తొలుత మాతో బస్తాలో కొంచెం వేయించేవారు. అదో సెంటిమెంట్‌.. అప్పుడే అనుకున్నాం.. ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని. మేం ఇంత పద్ధతిగా, ఏ వ్యసనాలకు లోనుకాకుండా ఉన్నామంటే దానికి మా ఊరివాళ్లు కూడా కారణమనే చెప్పొచ్చు.


డైరక్షన్‌ ఒక్కటీ మిగిలి ఉంది కదా.. భవిష్యత్తులో చేసే ఉద్దేశం ఉందా?

రామ్‌-లక్ష్మణ్‌: డైరెక్షన్‌ చేయాలనే కోరిక ఉండేది. దాని కోసం పలువురిని కలిశాం. గోపీచంద్‌కు కథ చెప్పాం. దగ్గరగా వచ్చినా.. అది వర్కవుట్‌ కాలేదు. తమ్ముడికి డైరెక్షన్‌, నాకు ఎమ్మెల్యే అవాలని కోరిక ఉండేదని రామ్‌ చెప్పారు. అయితే.. నాలుగైదు ఏళ్ల కిందట భగవంతుడి ధ్యానంలోకి వెళ్లిన తర్వాత కోరిక ఆగిపోయింది. ‘కళామతల్లి మీకెంతో ఇచ్చింది.. కాబట్టి రుణం తీర్చుకోండి’ అని మొట్టికాయలు పొడిచింది.. (నవ్వులు)మీ ఇద్దరిలో ఎవరు హైలీ టాలెంటెడ్‌?

నవ్వుతూ.. ఇద్దరూ ఒకరిమీద ఒకరు చెప్పుకుంటారు..

లక్ష్మణ్‌: నేను మైక్‌ తీసుకుని బానెట్‌ మీద ఉంటా. స్టార్ట్, యాక్షన్‌ చెబుతా. మావాడు ఫైట్‌ను కంపోజ్‌ చేస్తాడు. ఎమోషన్‌ను బాగా ఎలివేట్‌ చేస్తాడు. బోయపాటి కూడా రామ్‌ మాస్టర్‌ను పిలవండి అని చెబుతూ ఉంటారు. నేను యాక్షన్‌, కట్‌ అని చెప్పేవాడినేగాని.. కష్టమంతా మావాడిదే. ఈ సందర్భంగా బోయపాటికి థ్యాంక్స్‌ చెప్పాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.