క్లాస్‌ టు మాస్‌
కథానాయకుడంటే క్లీన్‌ షేవ్‌.. టక్‌ ఉండాలనేది ఒకప్పటి మాట. రఫ్‌ లుక్కే వసూళ్లు రాబడుతుందనేది నేటి మాట. ఇలా రోజు రోజుకు చిత్ర పరిశ్రమలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కెరియర్‌ ప్రారంభంలో చాలా మంది హీరోలు సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లోనే నటించి మెప్పించారు. ప్రేమ కథలు, కుటుంబ కథా నేపథ్యం ఉన్న సినిమాలు చేసి తమను తాము నిరూపించుకున్నారు. కానీ, ఇప్పుడు తమ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సరికొత్త కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతున్నారు. హిట్టవుతుందా..ప్లాప్‌ అవుతుందా అనేది పట్టించుకోకుండా జోనర్‌ మార్చడానికే సిద్ధపడుతున్నారు. ఏ హీరోనైనా మాస్‌ లుక్‌లో తెరకెక్కించే దర్శకులు చాలా మందే ఉన్నారు. వారి సినిమాల్లో నటించేందుకు యువ హీరోలందరూ ఆశపడుతుంటారు. తుపాకి చేతపట్టి, సిగరెట్‌ తాగుతూ అభిమానులకు ట్రీట్‌ ఇస్తున్నారు. ఇటీవలే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ గెటప్‌ చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఇంతకాలం ప్రేమ కథా చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించిన వరుణ్‌ ఏ రేంజ్‌లో మాస్‌ని అలరిస్తాడో వేచి చూడాలి. క్లాస్‌ పాత్రలో అలరించి మాస్‌ కథలు ఎంచుకున్న కథానాయకుల సినిమాలివే..


*రామ్‌
: తొలి చిత్రం ‘దేవదాసు’లాంటి ప్రేమ కథతో విజయం సాధించి, రెండో సినిమా ‘జగడం’తో మాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మళ్లీ ఇంతకాలానికి పూరి దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తన మాస్‌ ఫార్ములా చూపబోతున్నాడు.


*శర్వానంద్‌
: శంకర్‌దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ.. వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ‘వీధి’, క్లాస్‌మేట్స్‌ వంటి సినిమాలతో హీరోగా మారాడు. తర్వాత ‘ప్రస్థానం’ చిత్రంతో మాస్‌కి దగ్గరయ్యాడు. ఇటీవలే ప్రారంభమైన ‘రణరంగం’ సినిమాలోనూ మరో కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నాడు.


*మహేశ్‌బాబు
: మహిళా అభిమానులు అధికంగా ఉండే హీరోల్లో మహేశ్‌బాబు ముందుంటారు. మహేశ్‌ని మాస్‌ యాటిట్యూడ్‌లో చూడలేం అనుకునే వారందరికీ షాక్‌ ఇచ్చాడు ఈ ‘పోకిరి’. తర్వాత కొన్ని క్లాసిక్‌ చిత్రాల్లో నటించి ‘బిజినెస్‌మేన్‌’తో మరోసారి సత్తాచాటాడు.


*ప్రభాస్‌
: ‘ఈశ్వర్‌’గా తెరంగ్రేటం చేసి ‘ఛత్రపతి’గా ‘చక్రం’ తిప్పాడు. ‘పౌర్ణమి’ లాంటి సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. యోగి, బుజ్జిగాడు, రెబల్‌ చిత్రాల్లో సరికొత్తగా మారాడు.


*నాగచైతన్య
: ‘ఏ మాయ చేసావే’తో యువతలో ‘జోష్‌’ నింపిన చైతు 100లవ్‌ చిత్రంతో అలరించాడు. ఇలాంటి ప్రేమికుడు ‘బెజవాడ’, ‘ఆటోనగర్‌ సూర్య’ చిత్రాలతో మాస్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.