ఈ ఒక్కసారికీ ప్రేమలో పడిపోదాం
ప్రేమని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు పదాలు సాటిరావు కావ్యాలూ సరితూగవు! కానీ ‘పాటలు’ మాత్రం ప్రేమలోని అణువణువూ స్పృశించాయి. స్మరించాయి. శ్లాఘించాయి. కొన్ని పాటలు వింటే ప్రేమని ద్వేషించేవాళ్లు సైతం ‘ఈ ఒక్కసారికి ప్రేమలో పడిపోదాం’ అనుకుంటారు. ప్రేమలో ఉన్నవాళ్లయితే ‘ఈ పాటలు మన కోసమే రాశారా’ అన్నట్టు సొంతం చేసేసుకుంటారు. ఆత్రేయ పాటలో ప్రేమ పూత రేకులా ఉంటుంది. వేటూరి గీతంలో వేణుగానంలా వినిపిస్తుంది సిరివెన్నెల రాస్తే.. ప్రేమకు ప్రేమమీదే ప్రేమ పుడుతుంది.ఒక్కొకరిదీ ఒక్కో భావం. అయితే అవన్నీ ప్రేమికుల దాహం తీర్చినవే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘మీకు నచ్చిన ప్రేమగీతమేంటి?’ అని కొందరు గీతకారుల్ని ఆరా తీసింది ‘ఈనాడు సినిమా’. వాళ్ల ప్రేమ గీతాలాపనలో మీరూ భాగం పంచుకుని.. ఓ పల్లవి అందుకోండి.. ప్రేమగా!


అటు నువ్వే ఇటు నువ్వే
‘‘ప్రేమ’ చిత్రంలోని గీతాలన్నీ స్వచ్ఛమైన ప్రేమ భావాలను వెదజల్లినవే. ‘ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ..’ అనే ఒక్క లైన్‌ చాలు. ఆత్రేయగారి కలం బలం అర్థం అవుతుంది. ఆ పాటలోని ప్రతీ పదం ప్రేమకు నిర్వచనంలా అనిపిస్తుంది. మా గురువు సీతారామశాస్త్రిగారు ఎన్నో ప్రేమ గీతాలు రాశారు. అవన్నీ నాకు ప్రియమైనవే. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ‘ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే’ అనే పాట మరింత ఇష్టం. ప్రతీ పదంలోనూ ప్రేమని ఎవరెస్టుపై కూర్చోబెట్టారు. ఓచోట ‘మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణీ ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే’ అని రాశారు. అలా ప్రేమలోని భావన వ్యక్తీకరించడం ఆయనకే సాధ్యం. నా ప్రయాణంలోనూ కొన్ని మంచి ప్రేమ పాటలు రాసే అవకాశం దక్కింది. ‘కరెంట్‌’లో నేను రాసిన ‘అటు నువ్వే.. ఇటు నువ్వే’ పాట నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘ఊసరవెల్లి’లోని ‘నేనంటే నాకూ చాలానే ఇష్టం... నువ్వంటే ఇంకా ఇష్టం’ పాటంటే ఇష్టం. ‘రాజుభాయ్‌’లోని ‘ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు.. నీలోకం లోకి లాగావు’ కూడా గుర్తుండిపోతుంది’’. - రామజోగయ్య శాస్త్రి


నీ కళ్లతోటి నా కళ్లలోకి
‘‘ప్రేమ పాట అనగానే లెక్కకు మించిన గీతాలెన్నో గుర్తొస్తాయి. ఇళయరాజా స్వర సారథ్యంలో ఎన్నో గొప్ప పాటలొచ్చాయి. సీతారామశాస్త్రిగారి గీతాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ‘అంతఃపురం’లోని ‘అసలేం గుర్తుకురాదు...’ గొప్ప పాట. ‘ఖడ్గం’లో ‘నువ్వు.. నువ్వు’ ఓ క్లాసిక్‌. ‘నా పంతం నువ్వు... నా అంతం నువ్వు, నే కోరుకునే నా మరో జన్మ నువ్వు’ లాంటి పదాలు నాకు బాగా నచ్చాయి. ‘తులసి’లో ‘నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం’ నేను రాసిన ప్రేమ పాటల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘మెహబూబా’లో నేను రాసిన ‘ప్రేమలో పడ్డామనే లోపల, కన్నీరేంటో కాపలా’, ‘లేవులే ఏ గాలికీ ఆంక్షలే, నింగికీ లేనేలేవూ ఎల్లలే, మన మట్టిమీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు, ప్రేమంటే ఏంటో తెలిసుంటే వాళ్లు, ఈ గీతగీసుండరు’’ అనే పదాలు చక్కగా కుదిరాయి’’.  - భాస్కరభట్లఆ ప్రేమగా మనమే మారడం
‘‘ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతీక్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం..’ అని ‘1’ (నేనొక్కడినే)లో రాశా. నేను రాసిన ప్రేమగీతాల్లో ఇదొకటి. ‘అనన్యాహి మయా సీతా భాస్కరస్య యధాప్రభ’ అన్నారు వాల్మీకి. సూర్యుడి నుంచి వెలుగుని ఎలా విడదీయలేమో... రాముడి నుంచి, ఆయన మనసు నుంచి సీతని కూడా అలా విడదీయలేమని దాని అర్థం. కాళిదాసు కూడా ‘వాక్కును, అర్థాన్ని ఏ విధంగా విడదీయలేమో, అలా జగజ్జనకుడైన శివుడి నుంచి జగజ్జనని పార్వతిని విడదీయలేమ’ని చెప్పారు. వాళ్లు అంతగా ప్రేమలో మమేకమైపోయారన్న మాట. అదే స్ఫూర్తితో నేను ‘నా వెంటే నువ్వుంటున్నా... ఒంటరిగా నేనుంటున్నా.. దాని అర్థం నువ్వు నేను ఒకటి అని..’, ‘ఎవ్వరితో ఏమంటున్నా... నీతో మౌనంగా ఉన్నా... మనకింకా మాటలతోటి లేదు పని...’, ‘లోకంలో చోటెంతున్నా చాలదని... నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని... నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకుని... నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండని.. యూ ఆర్‌ మై లవ్‌’ అంటూ ‘1’ (నేనొక్కడినే)లో పాట రాశా. ఈ పాటలోనే ‘పాదాలిలా విడిపోవడం దూరం కాదు... అడుగేయడం, నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే... నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం ఆ ప్రేమగా మనమే మారడమే...’ అని రాశా. ప్రేమ ఓ గొప్ప భావోద్వేగం. ఆ పాట కోసం చేసే ప్రయాణం కూడా అలాగే సాగుతుంటుంది. కాలేజీ రోజుల్లో ‘ప్రేమ సాగరం’లోని ‘చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి...’, ‘హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా...’ తదితర ప్రేమ గీతాల్ని బాగా పాడుకొనే వాళ్లం. ‘మరోచరిత్ర’లో ‘పదహారేళ్ళకూ...’ పాటన్నా నాకు చాలా ఇష్టం’’.    - చంద్రబోస్‌
ప్రేమలేఖలు రాసేవాణ్ని

‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికీ ఉండిపోయే భావోద్వేగం ప్రేమ. మన గుండెచప్పుడు ఎలాగో, ప్రేమ కూడా అలాగే. కానీ ప్రేమికుల రోజు అని ప్రత్యేకంగా ఉండటమే ఆశ్చర్యం. ప్రేమలో ఉన్నవాళ్లకి రోజూ ప్రేమికుల రోజే కదా. బహుశా మనలో ఉన్న ప్రేమని తెలియజేయడానికి ఈ రోజుని ఒక అవకాశంగా తీసుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. నాకు బాగా నచ్చిన ప్రేమ పాటలంటే ‘వర్షం’లోనివే. ‘కోపమా నాపైన...’ అనే పాటంటే నాకు చాలా ఇష్టం. ప్రేయసి తాను చేసిన తప్పుని క్షమించమని ప్రియుడిని అడుగుతూ పాడుకొనే పాట అది. ఆ చిత్రం లోని ‘ఈ వర్షం సాక్షిగా...’ పాటన్నా, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ‘నిలువద్దము నిను ఎప్పుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా...’ పాటన్నా ఇష్టమే. నేను రాసిన వాటిలో ‘ప్రేమమ్‌’లోని ‘ఎవరే...’, ‘నేను లోకల్‌’లో ‘అరెరే ఎక్కడ ఎక్కడ...’ పాటలంటే నాకిష్టం. ‘ఎవరే...’ పాటలో ప్రేమికుడి మనసుని, ఆ మనసులోని స్వచ్ఛతని వర్ణించడం కనిపిస్తుంది. ‘అరెరే...’లో ప్రేయసీ ప్రియులు వాళ్ల ఫీలింగ్స్‌ని చెప్పుకోవడం వినిపిస్తుంది. ఎన్ని ప్రేమ పాటలు రాసినా కొత్త భావాలు పుడుతుంటాయి. ఎప్పటికీ నిలిచిపోయేవీ అవే. టీనేజ్‌లో నా స్నేహితులంతా నాతో ప్రేమలేఖలు రాయించుకొనేవారు. వాళ్లు మాత్రం ఇది మావాడు రాశాడని అస్సలు చెప్పే వాళ్లు కాదు. కానీ నువ్వు రాసింది నా ప్రేయసికి బాగా నచ్చిందని నాకు చెప్పేవాళ్లు. అలా ప్రేమ పాటలు రాయడానికి అప్పుడే పునాది పడిందన్నమాట. -శ్రీమణి Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.